Published : 18/01/2022 01:18 IST

100 సంస్థలు... 10వేల మందికి సేవలు

‘పెళ్లి తర్వాతా చదువుకుంటా’... ఈ షరతు పెట్టి వివాహానికి అంగీకరించిన ఆమె అనుకున్నట్టుగానే పట్టుదలగా సీఏ చదివారు. పదిహేనేళ్లు ప్రాక్టీసూ చేశారు. అయినా ఇంకేదో సాధించాలన్న తపన తనను నిలవనీయలేదు. సకల సదుపాయాలతో ఆఫీసు స్థలాన్నిఅందించే సరికొత్త వ్యాపార ప్రయోగం చేసి మన దేశంలోని ప్రధాన నగరాలన్నింటా విస్తరించారు పాటిబండ్ల సుందరి. ఇంతవరకూ పదివేలమందికి కోవర్కింగ్‌ స్పేస్‌ని అందించిన ఆమె విజయగాథ ఇది..  

మాది ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలోని ఎడ్లూరుపాడు. నాన్న ఊబయ్య రైతు. అమ్మ పుష్పవతి. ఇంటర్‌లో ఉండగా తాతయ్యకు ఆరోగ్యం బాగా లేక, ఆయన కోరిక మేరకు నాకు పెళ్లి చేశారు. చదువుకోనిస్తేనే పెళ్లి చేసుకుంటానని నిబంధన పెట్టా. ఇంటర్‌ రెండో ఏడాది పరీక్షలప్పుడు ఐదునెలల గర్భవతిని. అలానే పరీక్షలు రాశా. పాప పుట్టడంతో ఏడాది విరామం తీసుకున్నా. నా భర్త శ్రీనివాసరావు ఒంగోలులోనే వెటర్నరీ డాక్టర్‌. అక్కడే ఉంటూ కంప్యూటర్‌ కోర్సులో చేరాను. డిగ్రీలో కాలేజీ టాపర్‌ని. మా మామయ్య నాగేశ్వరరావు ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌. డిగ్రీలో నా మార్కులు చూసి సీఏ చదవమని సలహా ఇచ్చారు. నాకూ నచ్చి, సీఏ చదివి 2006లో ప్రాక్టీసు ప్రారంభించా. 15 ఏళ్లు గడిచిపోయాయి. చేస్తున్న పనిలో ఉత్తేజం కనిపించలేదు. ఇతరులకు భిన్నంగా, కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దామనుకున్నా.

ఆలోచన చిగురించిందిలా...
సీఏగా చేస్తున్నప్పుడు నేను విదేశీ విభాగాల వ్యవహారాలు చూసే దాన్ని. అప్పట్లో ఐటీ, ఇతర కంపెనీల నిర్వాహకులు కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వస్తే ఇక్కడి పరిస్థితులు వివరించి వాళ్ల సంస్థ ఏర్పాటుకు ముందుగా మా కార్యాలయంలో కొంత స్థలం ఇచ్చేవాళ్లం. ఆ తర్వాత వాళ్లు నచ్చిన చోటకు వెళ్లిపోయే వారు. అప్పుడే పనిచేసేందుకు కావాల్సిన స్థలాన్ని అన్ని సదుపాయాలతో ఇచ్చే కో వర్కింగ్‌ స్పేస్‌ గురించిన ఆలోచన వచ్చింది. ఇతర దేశాలలో ఈ తరహా వ్యవస్థ ఉన్నా... మన దేశంలో తక్కువ. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కొండాపూర్‌లో 15వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2017లో ‘ఐస్ప్రౌట్‌’ సంస్థను ప్రారంభించా. మొదట్లో పెట్టుబడి కష్టమయ్యింది. స్నేహితులు, బంధువుల సాయంతో క్లౌడ్‌ ఫండింగ్‌తో ఆ సమస్యను అధిగమించాం. కేవలం పని ప్రదేశమే కాదు.. అకౌంటింగ్‌, ట్యాక్స్‌, ఆన్‌లైన్‌ సర్వీసులు వంటివి అందించేవాళ్లం. క్రమంగా 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మరో భవనంలోకి సంస్థని విస్తరించాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో నాలుగు, చెన్నైలో రెండు, విజయవాడ, పుణెలో కలిపి మొత్తంగా తొమ్మిది కార్యాలయాల నుంచీ సేవలందిస్తున్నాం. త్వరలో బెంగళూరు, ముంబయి, న్యూదిల్లీలోనూ ప్రారంభించనున్నాం. ఇప్పటి వరకు 5 లక్షల చదరపు అడుగుల్లో, 100 కంపెనీలకు చెందిన 10 వేల మందికి కోవర్కింగ్‌ స్పేస్‌ కల్పించాం. ఉద్యోగులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్సాహంతో పని చేసేందుకు వీలుగా జిమ్‌, ఆటలు, కెఫెటేరియా వంటివి అందిస్తున్నాం. యోగా, ఆరోగ్య శిబిరాలు వంటివీ నిర్వహిస్తున్నాం. అంకురసంస్థలు, మహిళా పారిశ్రామికవేత్తల కంపెనీలకు రాయితీపై సేవలు అందిస్తున్నాం. మా సంస్థలో 200 మంది పని చేస్తున్నారు.  

కొవిడ్‌ పరిస్థితులను తట్టుకుని...
అంతా బాగానే ఉందనుకొనే సమయానికి కొవిడ్‌తో పరిస్థితులు మారిపోయాయి. మొదటి దశ లాక్‌డౌన్‌ పీడకలే. అద్దెలు చెల్లించే విషయంలో కొందరు బిల్డర్లు సహకారం అందిస్తే.. మరికొందరు కుదరదు అన్నారు. మొత్తం నిర్వహణ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. కొన్ని సంస్థల బిల్లులు నిలిచిపోయాయి. మరికొన్ని కంపెనీల సహకారంతో తట్టుకుని నిలబడ్డాం. కరోనాకు ముందు రూ.35 కోట్ల వరకు వార్షిక టర్నోవర్‌ ఉండేది. కరోనా వచ్చాక 30-40 శాతం టర్నోవర్‌పై ప్రభావం పడింది. ప్రస్తుతం కుదురుకున్నాం. సాధారణంగా అమ్మాయిలు మానసికంగా బలంగా ఉంటారు. ఇతరులు ఏమనుకుంటారోనని భయపడకుండా వారి శక్తిని నమ్ముతూ ముందడుగు వేయాలి. పట్టుదల, కష్టించేతత్వంతో ప్రయత్నిస్తే కచ్చితంగా ఏదైనా సాధించగలరని నా నమ్మకం.

- యార్లగడ్డ అమరేంద్ర, హైదరాబాద్‌


Advertisement

మరిన్ని