చెత్తకు సృజనాత్మకత జోడిస్తోంది

ఏ ప్రధాన నగరాలైనా.. పరిశ్రమ ప్రాంతాలను గమనించండి! పెద్ద మొత్తంలో వ్యర్థాలతో నిండిపోయి ఉంటుంది. దీనివల్ల పర్యావరణానికే కాదు.. మానవాళికీ ఎంత ప్రమాదరం! ఇదే ఆలోచించింది.. షుబీ సచన్‌. తన సృజనాత్మకతతో పరిష్కారాన్నీ కనుక్కుంది. అదేంటో.. చదివేయండి.

Updated : 25 Jan 2022 04:41 IST

ఏ ప్రధాన నగరాలైనా.. పరిశ్రమ ప్రాంతాలను గమనించండి! పెద్ద మొత్తంలో వ్యర్థాలతో నిండిపోయి ఉంటుంది. దీనివల్ల పర్యావరణానికే కాదు.. మానవాళికీ ఎంత ప్రమాదరం! ఇదే ఆలోచించింది.. షుబీ సచన్‌. తన సృజనాత్మకతతో పరిష్కారాన్నీ కనుక్కుంది. అదేంటో.. చదివేయండి.

షుబీ.. 2014లో లండన్‌లోని సెంట్రల్‌ సెయింట్‌ మార్టిన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ నుంచి మెటీరియల్‌ ఫ్యూచర్స్‌లో ఎంఏ పూర్తి చేసింది. ఎన్నో ప్రముఖ సంస్థలకు కన్సల్టెంట్‌గానూ పనిచేసింది. పరిశ్రమలు, వ్యవసాయ వ్యర్థాలపైన దృష్టిపెడుతూ ఎన్నో ప్రాజెక్టులపై పనిచేసింది. ఫ్యాషన్‌ సంస్థలకు డిజైనర్‌ కూడా. ముడిసరకు నుంచి తుది ఉత్పత్తి తయారయ్యేలోపు ఎంత వృథా అవుతోందో గమనించింది. ఇది ఆమెను చాలా ఇబ్బందికి గురిచేసింది. దీనికితోడు ఓసారి ముంబయి శివార్లలో గుట్టలుగా పోసిన వ్యర్థాలను చూసింది. కొత్తవాటిని రూపొందించే బదులు వ్యర్థాలపైనే తన సృజనాత్మకతను ఉపయోగించాలనుకుంది. 2017లో నోయిడాలో ‘మెటీరియల్‌ లైబ్రరీ’ని ప్రారంభించింది. కొంతమంది సిబ్బందినీ ఏర్పరచుకుంది. ల్యాబ్‌లు, ఆసుపత్రులు, పరిశ్రమలు, మార్కెట్లు, వ్యవసాయ భూమి.. ఇలా ప్రతి స్థలం నుంచి వ్యర్థాలను సేకరించేది. వాటిని తన పరిజ్ఞానం, నైపుణ్యాలతో సంప్రదాయ వస్తువులుగా తీర్చిదిద్దుతోంది. ఫర్నిచర్‌ నుంచి అలంకరణ వస్తువులు, నగలు, దుస్తులు.. ఇలా ఎన్నింటినో రూపొందిస్తోంది.

‘చాలామంది నాకు చెత్త, వ్యర్థాలు అంటే ఇష్టం అంటుంటారు. నిజానికి నాకవంటే అసహ్యం. అందుకే వాటిని లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నా. చాలా సంస్థలకు దీని వల్ల కలిగే హాని, వాటిని తిరిగి ఉపయోగించే విధానాలపై అవగాహన ఉండటం లేదు. అందుకే ఇలా కుప్పలా పోసి వదిలేస్తున్నారు. నిజానికి కొంత ఊహాశక్తిని ఉపయోగిస్తే తక్కువ ఖర్చులో అందమైన వస్తువులను రూపొందించొచ్చు. ఇన్నేళ్లూ మనం దాన్ని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తున్నాం. అందుకే సమస్యగా అనిపిస్తోంది. తిరిగి ఎలా ఉపయోగించొచ్చు అని ఆలోచిస్తే పరిష్కారాలు బోలెడు. నేనదే చేస్తున్నా. గోద్రెజ్‌తో కలిసి ‘పునాహ్‌’ అనే ప్రాజెక్టు చేశా. అందులో భాగంగా లక్షా ఎనభైవేల జతల రబ్బర్‌, కాటన్‌, ఇతర గ్లోవ్స్‌తో వివిధ వస్త్రాలను రూపొందించా. కొన్నింటిని కుర్చీలు, టేబుళ్లు మొదలైనవాటికి అవసరమైన వస్త్రాలుగా, యాక్సెసరీల కోసమూ ఉపయోగించా. ఓ ఫార్మాస్యూటికల్‌ సంస్థతో కలిసి ‘క్యాన్సిల్డ్‌ ప్లాన్‌’ ప్రాజెక్టు చేశా. అల్యూమినియం, ప్లాస్టిక్‌ వస్తువులతో హ్యాండ్‌ బ్యాగులు, గృహాలంకరణ వస్తువులను రూపొందించా. ప్రతి సంస్థ నుంచి వ్యర్థాలను తెప్పించడం వాటిని ఏవిధంగా రీసైకిల్‌ చేయొచ్చన్న దానిపై మా ల్యాబ్‌లో పనిచేస్తుంటా. ఎన్నో డిజైనింగ్‌, ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్ట్‌, నగలు, వస్త్ర సంస్థలు మాతో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. కానీ ఇంకా ఈ దిశగా ఆలోచించని సంస్థలే ఎక్కువ. అవీ ముందుకొస్తేనే భూమిని కాపాడుకోగలం’ అంటోంది షుబీ.

ఈమె టెడెక్స్‌ స్పీకర్‌ కూడా. వ్యర్థాలతో రూపొందించిన దుస్తులను లాక్మే, ఆంబియెంట్‌ టాలెంట్స్‌, లండన్‌ డిజైన్‌ వీక్‌, డచ్‌ డిజైన్‌ వీక్‌ సహా ఎన్నో ఫ్యాషన్‌ షోల్లోనూ ప్రదర్శించింది. లెక్సస్‌ డిజైన్‌ అవార్డు, సీఐఐ గ్రీన్‌ కో బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ వంటి అవార్డులనూ అందుకుంది. ప్రముఖ పరిశ్రమలను కలిసి వాళ్ల ఆలోచనను రీసైక్లింగ్‌ వైపు మరల్చే దిశగా ప్రయత్నిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్