Updated : 30/01/2022 04:40 IST

90 ఏళ్లొచ్చినా... నా వంట నేనే చేసుకుంటా!

ఏడు దశాబ్దాలకుపైగా సినీ జీవితం ఆమెది. దక్షిణాదిన మూడు భాషల్లో 450కిపైగా సినిమాల్లో నటించారు. ఎన్‌టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, శివాజీ గణేశన్‌ వంటి దిగ్గజ నటులే కాదు.. నేటితరంతోనూ తెర పంచుకుంటున్నారు. ఆమె కళా జీవితమే కాదు.. పాటించే క్రమశిక్షణా నేటితరానికి స్ఫూర్తిదాయకమే. పేరు తెచ్చిన సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న ఆవిడే.. షావుకారు జానకి.  ఇటీవలే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న ఆవిడని వసుంధర పలకరించింది.

నేను పుట్టింది తెలుగు నాటే. మాది రాజమండ్రి. 14 ఏళ్లకే వివాహమైంది. ఆ తర్వాతే రేడియో, రంగస్థల నాటకాల్లో అడుగుపెట్టా. సుమారు 3000కుపైగా ప్రదర్శనలిచ్చా. ఆపై సినిమా అవకాశాలు వచ్చాయి. నా సినిమా ప్రస్థానానికి 75ఏళ్లు. 90వ పడిలోనూ ఉత్సాహంగా కొనసాగిస్తున్నా. ‘ఈ వయసులోనూ ఎలా?’ నన్ను చూడగానే చాలామంది వేసే ప్రశ్న ఇది. దానికి నేను పాటించే శారీరక, మానసిక నియమాలే కారణమని చెబుతా. నేను, చెల్లి కృష్ణకుమారి క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో పెరిగాం. ఇప్పటికీ వంట నేనే చేసుకుంటా. సినిమాలతో తీరిక లేకుండా ఉన్న సమయంలోనూ ఇదే విధానాన్ని పాటించేదాన్ని. మా పిల్లల దగ్గరికి వెళ్లినప్పుడు మినహా ఇప్పటికీ ఇదే విధానం పాటిస్తున్నా. మితాహారంతోపాటు మనసు నిర్మలంగా ఉంచుకుంటే ఏ అనారోగ్యాలూ దరి చేరవు. బీపీ, షుగర్‌ లాంటివి ఎరుగను నేను. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నా. దాన్ని గుర్తిస్తూ పద్మశ్రీ అందించడం గర్వంగా భావిస్తున్నా.

అది బాధించింది

ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు చూశా. నేను చెల్లి కృష్ణకుమారి అంత ఒడ్డూ, పొడవూ కాదు. ఎన్‌టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ వంటి పెద్ద నటుల పక్కన ఎంపిక చేసేప్పుడు కొంచెం పీలగా ఉన్నాననేవారు. అప్పటికే షావుకారు సినిమాతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో దేవదాసులో అక్కినేని నాగేశ్వరరావు పక్కన పార్వతి పాత్ర చేసే అవకాశమొచ్చింది. ‘ఓ.. దేవదా’ పాట రిహార్సల్‌ కూడా చేశారు. మరుసటి రోజు షూటింగ్‌కు సిద్ధమవుతోంటే.. చిత్రం నుంచి తొలగించారన్న కబురందింది. కారణం మాత్రం చెప్పలేదు. అది చాలా బాధించింది. సినిమా రంగంలో అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న సమయంలో ఇలా జరగడంతో అన్నం కూడా మానేసి బాధపడ్డా. తర్వాత కారణం తెలిసినా.. అందరినీ ఇబ్బంది పెట్టొద్దని ఊరుకున్నా. కానీ ఇవన్నీ నాలో కసి పెంచాయి. నిరూపించుకోవాలని తపన పడేదాన్ని. రేడియో అనుభవంతో మంచి వాచకం ఉంది. అనర్గళంగా డైలాగులు చెప్పేదాన్ని. ఇవే నటిగా నిలదొక్కుకునేలా చేశాయి. నటనకు ఆస్కారం ఉండే పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇప్పటివరకూ 450కి పైగా చిత్రాల్లో నటించా. డేట్లు కుదరలేదని కలెక్టర్‌ జానకి సినిమా వదులుకున్నా. నేటికీ ఆ విషయంలో బాధపడతా. ఇన్నేళ్లలో నేను బాధపడేదేదైనా ఉందంటే.. అది ఈ సినిమాను చేజేతులా వదులుకోవటమే.

అదే రహస్యం

సినిమా, సంసారం.. రెంటినీ వేర్వేరుగా చూస్తా. వీటి మధ్య సన్నని గీతను కొనసాగిస్తూ వచ్చా. ఆ గీత చెరిపేస్తేనే సమస్య. అందుకే రెంటినీ గౌరవించా. వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యమిచ్చా. ఇదే నా రహస్యం. ప్రస్తుతం నందినీ రెడ్డి దర్శకత్వంలో ‘అన్నీ మంచి శకునములే’ సినిమా చేస్తున్నా. నా కోసం నేటి తరం దర్శకులు ఎదురుచూస్తుండటం అదృష్టంగా భావిస్తున్నా. పైగా ఈ వయసులో పద్మశ్రీ అందుకున్నా. ఇప్పటివరకూ అందుకున్న వాటిల్లో ఇదే అత్యుత్తమ అవార్డు. ఇప్పటికే ఆలస్యమైందని చాలామంది అంటున్నారు. నిజమే.. కానీ.. అత్యుత్తమమైనది ఎప్పుడొచ్చినా గర్వకారణమే కదా! పైగా ఇది మరింత బాధ్యతను పెంచింది. అందుకే.. కాళ్లలో సత్తువ, తడబాటు లేని వాచకం ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటా.

కె.ముకుంద, జగదీశ్వరి, బెంగళూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని