Published : 02/02/2022 20:38 IST

నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే ఎలా?

లావుగా ఉన్నావని ట్రోల్‌ చేశారు.. పట్టించుకోలేదు! ఊబకాయానికి బ్రాండ్‌ అంబాసిడర్‌వని నవ్వారు.. భరించింది! ఎన్నడూ ఆత్మస్థైర్యం కోల్పోలేదు. పైగా అందాల పోటీల్లో పాల్గొంది. ‘మిసెస్‌ ఈ అండ్‌ ఈ ప్లస్‌ సైజ్‌ ఇండియా 2019’, ‘మిసెస్‌ ఈ అండ్‌ ఈ ప్లస్‌ సైజ్‌ వరల్డ్‌ 2020’ కిరీటాలు దక్కించుకుంది శివానీ పాఠక్‌. ‘అందం శరీర కొలతల్లో కాదు.. నిన్ను నీవు ప్రేమించుకోవడంలో ఉంటుందంటున్న తన మాటలేంటో విందామా...

అందానికి నిర్వచనం ఏంటంటే.. నాజూగ్గా, ఫిట్‌గా ఉండటం అని చెబుతారు ఎవరైనా. అందాల పోటీల్లో అయితే కొన్ని కొలతలనే ప్రామాణికంగా తీసుకుంటారు. దీన్ని శివానీ అస్సలు అంగీకరించదు. ‘సన్నగా, ఎత్తుగా ఉండటమే అందానికి కొలమానం అనే అభిప్రాయమే తప్పు. బరువు ఎక్కువగా ఉంటే తప్పేంటి? అది అందం కాకుండా పోతుందా? అయినా లావుగా ఉన్నవాళ్లు ముందు తమని తాము ప్రేమించుకోవాలి. లేకపోతే వేరొకరు మనల్ని ఎలా ఇష్టపడతారు?’ అని ఎదురు ప్రశ్నిస్తుంది. ఈ మాట చెప్పడానికి ముందు తను ఎన్నో చేదు అనుభవాలు చవిచూసింది.  

ప్రస్తుతం వైద్యవిద్యనభ్యసిస్తున్న శివానీకి అందాల పోటీలంటే ఆసక్తి ఉండేది. కానీ చిన్నప్పట్నుంచీ తను కొంచెం బొద్దుగా ఉండేది. అందుకే చాలా పోటీల్లో తిరస్కరణకు గురైంది. ‘కొలతలు, శరీర సౌష్టవమే అందం కాదు.. ఆత్మవిశ్వాసం, మంచితనమే అసలైన అందం’ అని వాదించేది. ఎంత చెప్పినా పట్టించుకున్నవాళ్లే లేరు. ‘వదిలేయొచ్చుగా.. ఊబకాయాన్ని ఎందుకు ప్రమోట్‌ చేస్తున్నావు?’ అని దగ్గరివాళ్లే కామెంట్‌ చేసేవాళ్లు. బాగా విసిగిపోయి, ఒకానొక సమయంలో తనే సొంతంగా అందాల పోటీలు నిర్వహించాలనుకుంది. అప్పుడే శివానీకి ‘మిసెస్‌ ఈ అండ్‌ ఈ ప్లస్‌’ వెబ్‌సైట్‌ గురించి తెలిసింది. బొద్దుగుమ్మల కోసం ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తారక్కడ. ఆ నిర్వాహకులదీ అచ్చం శివానీ లాంటి ఉద్దేశమే. వెంటనే ఫొటోలు, వివరాలు పంపించింది. తర్వాత అంతా చరిత్రే. తన నెత్తిమీద అందాల కిరీటాలు చేరాయి. బ్యూటీక్వీన్‌గా దేశం దృష్టిని ఆకర్షించింది. ఆ వేదిక పై నుంచే ‘బరువు అనేది నా దృష్టిలో ఒక కొలమానం మాత్రమే. నాకున్న శరీర స్థితికి నేనెప్పుడూ చిన్నతనంగా ఫీలవలేదు. నేనే కాదు.. నాలాంటి వాళ్లందరికీ బరువు తగ్గడం, తగ్గకపోవడం అనేది వ్యక్తిగత విషయం. ఎవరో ఏదో అనుకుంటారనీ, సమాజం గమనిస్తుందనీ కడుపు మాడ్చుకొని, సన్నబడాల్సిన పని లేదు’ అని సగర్వంగా చెప్పింది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని