పిల్లల దుస్తులతో వందకోట్ల వ్యాపారం!

తమ బిడ్డకి ఫ్యాషన్‌ దుస్తులు వేసి అందంగా ముస్తాబు చేయాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. కానీ స్థానికంగా తయారు చేసే దుస్తుల్లో నాణ్యత తక్కువ. పోనీ విదేశీ బ్రాండ్లు కొందామంటే అవి ధర

Updated : 07 Feb 2022 06:37 IST

తమ బిడ్డకి ఫ్యాషన్‌ దుస్తులు వేసి అందంగా ముస్తాబు చేయాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. కానీ స్థానికంగా తయారు చేసే దుస్తుల్లో నాణ్యత తక్కువ. పోనీ విదేశీ బ్రాండ్లు కొందామంటే అవి ధర ఎక్కువ. ఈ రెండు సమస్యలకు పరిష్కారంగా ‘మినీక్లబ్‌’ బ్రాండ్‌ పుట్టుకొచ్చింది. దీని వ్యవస్థాపకురాలు అంజనా పాసి.  పిల్లల దుస్తులతో రూ.వందకోట్లకుపైగా టర్నోవర్‌ సాధిస్తున్నారీమె...

మేం చాలాకాలంగా వస్త్రరంగంలో ఉన్నాం. నా భర్తతో కలిసి 2002లో ‘ఫస్ట్‌ స్టెప్‌ బేబీవేర్‌’ పేరుతో వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేశా. విదేశాలకు చెందిన పలు బ్రాండ్లకు ఫ్యాషన్‌ దుస్తులు రూపొందించి ఎగుమతి చేస్తుంటాం. ముఖ్యంగా యూరప్‌లో సంక్షోభం తలెత్తినప్పుడు అక్కడి వ్యాపారస్తులు నవజాత శిశువు నుంచి 2 ఏళ్ల చిన్నారుల దుస్తుల కోసం విదేశీ పరిశ్రమలపై ఆధారపడ్డారు. అలా మేం యూరప్‌ దేశాలకు  దుస్తులు ఎగుమతి చేసి మంచి పేరు తెచ్చుకున్నాం. మా వ్యాపారాన్ని విస్తరింపజేయాలన్న ఆలోచన రాగానే, భారత్‌లో చిన్నారుల దుస్తులపై ఆరా తీశా. చాలావరకు పిల్లల దుస్తులు రిటైల్‌గా అమ్ముడుపోతుంటాయి. వాటిల్లో నాణ్యత ఉండదు. అప్పుడే విదేశాలకు నాణ్యమైన దుస్తులు ఎగుమతి చేస్తున్న మేమే దేశీ చిన్నారుల కోసం ఒక బ్రాండ్‌ను ఎందుకు ఏర్పాటు చేయకూడదు అనుకున్నా.

అలా విదేశీ బ్రాండ్లకు దుస్తులు తయారు చేయడంలో మాకున్న విశేష అనుభవంతో 2012లో ‘మినీక్లబ్‌’ను స్థాపించా. మరుసటి ఏడాది నుంచి రిటైల్‌ విక్రయం ప్రారంభించా. వయసు, సీజన్‌కు తగ్గట్టు కొత్త కొత్త డిజైన్లతో దుస్తులను రూపొందిస్తున్నా. అంతేకాదు, ఫుట్‌వేర్‌.. ఇతర ఫ్యాషన్‌ యాక్ససెరీస్‌ కూడా విక్రయిస్తున్నా. బెంగళూరు కేంద్రంగా నడిచే మా బ్రాండ్‌ దుస్తులు దేశవ్యాప్తంగా 450 మల్టీ-బ్రాండెడ్‌ స్టోర్లలో లభిస్తున్నాయి. మా వెబ్‌సైట్‌ నుంచే కాకుండా ఇతర ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల ద్వారానూ ఆన్‌లైన్‌ విక్రయాలు కొనసాగిస్తున్నాం. మొదట్లో కేవలం నవజాత శిశువు నుంచి నాలుగేళ్ల చిన్నారుల కోసమే దుస్తులు తయారు చేసేవాళ్లం.. ఇప్పుడు 4 నుంచి 6 ఏళ్ల పిల్లలకూ అందుబాటులోకి తెచ్చాం.

బ్రాండ్‌ను ప్రారంభించిన కొత్తలో దుస్తులను మార్కెట్లోకి తీసుకెళ్లడం కన్నా.. తల్లుల నమ్మకాన్ని పొందడమే పెద్ద సవాలుగా మారింది. ఒకరిని అనుసరించకుండా.. సొంత దారిని సృష్టించుకోవాలి. అప్పుడే మన ప్రత్యేకతేంటో ఎదుటివాళ్లకి తెలుస్తుంది. మనం ఏం చేసినా దాన్ని ఔన్నత్యాన్ని చాటిచెప్పగలగాలి. అందుకు మనపై మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతోనే మా బ్రాండ్‌ దుస్తుల మన్నికను తల్లులకు తెలిసేలా చేశాం. దీంతో వారికి మాపై గురి కుదిరింది.. సంస్థ వృద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు మా సంస్థ ఏటా రూ.107కోట్ల టర్నోవర్‌ సాధిస్తోంది. మరో మూడేళ్లలో మా ‘మినీ క్లబ్‌’ సంస్థని ఐపీవోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.

వర్ధమాన వ్యాపారులు వినూత్న ఆలోచనలతో ముందుకొస్తున్నారు. అయితే, వైఫల్యం చెందుతామనే భయం ఉండకూడదు. భారీ కలలు కనాలి.. మీ ఆలోచనలు, చేతలు వాటినే అనుసరిస్తాయి. మీరు ప్రారంభించే వ్యాపారంపై నమ్మకం ఉంచడమే మీ విజయానికి మూల సూత్రం అంటూ యువ వ్యాపారవేత్తలకు అంజనా పాసి సూచనలు ఇస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్