Updated : 16/02/2022 02:59 IST

అనాథ వధువులకు సారె పెట్టి పంపిస్తాం!

కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ సంతృప్తి చెందే సేవా గుణం కొద్దిమందికే ఉంటుంది. ఆ కోవకే చెందుతారు సత్తి సునీత. దివ్యాంగులకు ఉపాధి, నిరుపేద చిన్నారుల చదువు, అనాథ యువతుల పెళ్లి, నిరాధార మహిళలకు చేయూత... ఇలా ఎవరు బాధల్ని చెప్పుకున్నా నేనున్నానంటారు. కష్టాల తీరం దాటిస్తారు! అలా అని ఆమేమీ కోటీశ్వరురాలు కాదు... మరెలా చేస్తున్నారంటారా... అయితే చదవండి...

మా నాన్న వీరరాఘవరెడ్డి… ఫౌండ్రీ నడిపేవారు. రోజూ మా దుకాణం ఎదుట ఓ గిన్నె నిండా రూపాయి బిళ్లలు ఉంచే వారు. ఎందుకని అడిగితే.. ‘నేను పనిలో ఉన్నప్పుడు భిక్ష కోసం వచ్చిన వాళ్లు ఉత్తచేతులతో వెళ్లకుండా అలా ఉంచా’ అన్నారు. పండగలప్పుడు పేదలకు కొత్తబట్టలు, పిండివంటలు, మిఠాయిలు పంచేవారు. ఇవన్నీ చూస్తూ పెరిగిన నాకూ తోటివారికి ఎంతో కొంత సాయం చేయాలనిపించేది. చిన్నప్పుడు స్కూల్‌కి రిక్షాలో వెళ్లేదాన్ని. రిక్షా వాళ్లకు చెప్పులుండేవి కావు. కాళ్లకు దెబ్బలు తగిలేవి. వాళ్లని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లి నా పాకెట్‌మనీతో వైద్యం చేయించి, కొత్త చెప్పులు కొనిచ్చేదాన్ని. అక్కడి వైద్యులు ‘అప్పుడే సమాజసేవ మొదలుపెట్టావా?’ అనేవారు ఆత్మీయంగా! ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మా సొంతూరు. అమ్మ.. కృష్ణవేణి. నేను పదోతరగతి వరకే చదువుకున్నా. పెళ్లయ్యాక హైదరాబాద్‌ వచ్చా. తర్వాత యోగాలో డిప్లొమా చేశాను. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి ఉచితంగా యోగా నేర్పేదాన్ని. తర్వాత మా వారి ప్రోత్సాహంతో యోగా కేంద్రాన్ని ప్రారంభించాను. పేద పిల్లలకు ఉచితంగా శిక్షణనిస్తుంటాను.

వాళ్లను చూశాక...
ఓ రోజు మలక్‌పేట్‌లోని ఫిన్‌ బధిర పాఠశాల పిల్లలకు యోగా నేర్పడానికి వెళ్లా. అక్కడ ఒక గంట మూగ, చెవిటి పిల్లలతో గడిపాక నా కళ్లలోంచి నీళ్లొచ్చాయి. భగవంతుడు మనకు అన్నీ సక్రమంగా ఇచ్చాడంటే దానర్థం ఇతరులకు సాయం చేయమనేమో అని అనిపించింది. దాంతో ఆ స్కూల్‌ నుంచే నా సేవని మొదలుపెట్టాను. ఆ పాఠశాలకు ఒక డిజిటల్‌ మానిటర్‌ కావాలని నిర్వాహకులు అడిగారు. అందుకు రూ.లక్షా యాభైవేలు అవుతుందని తెలిసింది. అంత మొత్తం నా ఒక్కదాని వల్లా కాదు. అప్పుడు నా యోగా విద్యార్థులు గుర్తుకొచ్చారు. వాళ్ల సాయానికి తోడు తెలిసిన వారి నుంచీ డబ్బులు సేకరించి డిజిటల్‌ మానిటర్‌ కొని, ఆ బడికిచ్చాం. మానిటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు ఆ పిల్లల సంతోషం చెప్పనలవి కాదు. ఆ స్ఫూర్తితోనే నా కార్యక్రమాలు విస్తరించా.

వైకల్యం ఉన్న వారి కోసం...
శారీరక లోపాల్ని అధిగమించి.. సమాజంలో ప్రత్యేకంగా నిలబడాలన్న బలీయమైన కోరికను దివ్యాంగుల్లో చూశాను. అందుకే వారికి అండగా ఉండాలనుకున్నా. కొందరికి స్వయంఉపాధి కోసం కుట్టు మిషన్లు అందించా. కొంత మందికి వీల్‌ఛైర్లు పంపిణీ చేశా. నలుగురితో టీ స్టాల్స్‌ పెట్టించాం. నల్గొండ జిల్లాలోని లెప్రసీ కాలనీలో కుష్ఠు వ్యాధిగ్రస్థులు ఆకలితో బాధపడుతున్నారని తెలిసి నెల రోజులకు సరిపడా బియ్యం బస్తాలు, నిత్యావసర సరకులు, నగదు అందజేశాం. సూర్యప్రకాశ్‌ అనే యువకుడికి ప్రమాదం జరిగితే శస్త్రచికిత్స కోసం రూ.50 వేలు అందజేశాం. కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథలైన ఇద్దరు ఆడపిల్లలకు సాయం కోసం ఫేస్‌బుక్‌లో అర్థిస్తే... స్వయంగా మంత్రి కేటీఆర్‌ వాళ్లకి అండగా నిలబడ్డారు. ఉప్పల్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు దేవి, కీర్తిలు అనాథలమని చెప్పడంతో వాళ్లతో టిఫిన్‌ సెంటర్‌ పెట్టించాం. అలాగే ‘అమ్మప్రేమ’ ఫౌండేషన్‌కు ఫ్రిజ్‌, వాషింగ్‌ మిషన్‌తోపాటు అక్కడి అంధ విద్యార్థులకు ఏటా బ్రెయిలీ పుస్తకాలు అందిస్తున్నా. కొన్ని ఆశ్రమాలకు నెలవారీ అద్దె, సరకులు అందిస్తుంటాం. వీటితో పాటు అనాథ, పేద అమ్మాయిలకు పెళ్లి చేసి ఒక తోడు తీసుకురావడం ఎంతో సంతృప్తినిచ్చేది. ఇందుకోసం వాళ్లకు తాళి, మెట్టెలు, పెళ్లిబట్టలు, సారె ఇస్తుంటాం. బాధితుల ఇంటికి వెళ్లి, వారి అవసరం నిజమైందో...కాదో తెలుసుకుంటున్నా. సాయమూ నేరుగా వాళ్లకే అందిస్తున్నాం. మొదట్లో కొన్ని సందర్భాల్లో నిధుల దుర్వినియోగం వంటి చేదు అనుభవాలు ఎదురయినా ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాం. క్యాన్సర్‌ బాధిత చిన్నారులు కీమోథెరపీ వల్ల జుట్టు ఊడిపోయి బాధపడుతుంటారు. వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపేందుకు తెలిసున్న వారందరితో జుట్టుదానం చేయిస్తున్నా. కొవిడ్‌ సమయంలో రోజుకు వెయ్యి మందికి రెండు పూటలా ఆహారం అందించే వాళ్లం.  హుద్‌హుద్‌ అప్పుడు వైజాగ్‌లో వందలాదిమందికి అవసరమైన మందులు, సరకులు, దుప్పట్లు పంపిణీ చేశాం.

వదాన్యులెందరో  
వీటన్నింటికీ అవసరమైన సొమ్ముని నేనొక్కదాన్నే సమకూర్చలేను కదా. నేనో వస్త్రదుకాణాన్ని కూడా నడుపుతున్నా. దాని మీద లాభాల్నీ సేవ కోసం వినియోగిస్తున్నా. అయినా సరిపోదు. అందుకే ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా క్రౌడ్‌ఫండింగ్‌ పద్ధతిలో సేకరిస్తున్నా. సమస్యని వివరించి దాతల నుంచి బాధితులకు నేరుగా ఆర్థిక సాయం అందేట్టు చేస్తున్నా. మావారు సుధాకర్‌ సినిమా పరిశ్రమలో ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయన సహకారం, ప్రోత్సాహం లేకుంటే ఇవన్నీ చేయగలిగే దాన్ని కాదు. త్వరలో పెద్దవాళ్ల కోసం ఒక ఆశ్రమం నిర్మించాలని ఉంది. ఆ కలా సాకారం చేసుకోగలనన్న నమ్మకం ఉంది.

- భూపతి సత్యనారాయణ, ఈనాడు పాత్రికేయ పాఠశాల


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని