ఈ రిక్షా వీళ్ల జీవితాలను మార్చింది

మారుమూల ప్రాంతంలో జీవించే ఆ మహిళలంతా ఇప్పుడు ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని సాధికారత సాధిస్తున్నారు. ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడి ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. గుజరాత్‌లో ప్రముఖ పర్యటక కేంద్రంగా మారిపోయిన సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ విగ్రహం దగ్గర ఈ రిక్షాలు నడుపుతున్న గిరిజన మహిళల విజయగాథ ఇది...

Published : 25 Feb 2022 00:24 IST

మారుమూల ప్రాంతంలో జీవించే ఆ మహిళలంతా ఇప్పుడు ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని సాధికారత సాధిస్తున్నారు. ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడి ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. గుజరాత్‌లో ప్రముఖ పర్యటక కేంద్రంగా మారిపోయిన సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ విగ్రహం దగ్గర ఈ రిక్షాలు నడుపుతున్న గిరిజన మహిళల విజయగాథ ఇది...

ర్మదా జిల్లాకు సమీపంలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ఆ మహిళలకు గతంలో చదువు, సాధికారత అనే పదాలకు అర్థంకూడా తెలీదు. విద్యకు దూరమై, పేదరికంలో మగ్గారు. గుజరాత్‌లో జరిగిన ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌’ విగ్రహ ఆవిష్కరణ వీరికి ఉపాధి మార్గాన్ని చూపించేలా చేసింది. ప్రభుత్వం తరఫున స్థానికంగా ఏక్తానగర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు వీరి జీవితాల్లో వెలుగులు పూయించింది. మహిళా స్వయంప్రతిపత్తికి కేంద్రంగా ఇది నిలిచింది. పరిసర గ్రామాలకు చెందిన 260 మంది మహిళలకు ‘ఈ రిక్షా’ నడపడంలో శిక్షణనిచ్చారు. ఇప్పుడు వీరంతా స్థానిక రైల్వేస్టేషన్‌ నుంచి పర్యాటకులను ఈ రిక్షాల్లో వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం వద్దకు చేరుస్తున్నారు.

ఇంట్లో వద్దన్నారు.. ఈ రిక్షా నడుపుతున్న జ్యోతి కుమారికి గిరిజనభాష మాత్రమే తెలుసు. హిందీ అంతంతమాత్రమే మాట్లాడగలదు. గతంలో కూలీకి వెళుతూ కుటుంబానికి చేదోడుగా ఉన్న ఆమె, ఇప్పుడు ఏక్తానగర్‌లో ఈ రిక్షా నడుపుతోంది. అక్కడికొచ్చే పర్యాటకులకు వచ్చీరాని హిందీతో స్థానికంగా ఉండే పర్యాటకప్రాంతాల గురించి చెబుతోంది. ఇదంతా తాను తీసుకున్న శిక్షణ ద్వారా వీలవుతోంది అంటోందీమె. ‘చిన్నప్పటి నుంచి పేదరికంలోనే పెరిగా. పెళ్లి, ఆ తర్వాత కుటుంబ భారం పంచుకోవడంలో కూలీ పనులకెళ్లేదాన్ని. ఈ రిక్షా నడపడం నేర్పుతారని తెలిసి ఇంట్లో అడిగితే నీకేం తెలుస్తుందన్నారు. వెళితేనే కదా తెలిసేది అని ఒప్పించి ధైర్యంగా శిక్షణలో చేరా. ఆ తర్వాత ఈ రిక్షాను తక్కువ రుణానికి అందించారు. ఇప్పుడు హిందీ కూడా మాట్లాడగలుగుతున్నా. మా ప్రాంత విశేషాలు, సందర్శించాల్సిన చోట్ల గురించి వివరంగా చెప్పగలుగుతున్నా. రోజుకి ఇప్పుడు రూ.1500 వరకు సంపాదిస్తున్నా. రిక్షాకు కట్టాల్సిన రుణంలో కొంత పోగా, ఇంటికి రూ.1100 తీసుకెళ్ల గలుగుతున్నా. నా కుటుంబానికి ఆర్థిక భరోసాను అందించే స్థాయికి చేరుకున్నా. ఇప్పుడు ఇంటినీ, ఈ బాధ్యతలను రెండింటినీ సమన్వయం చేసుకోగలుగుతున్నా. ఇక్కడ మొత్తం నాలాగే మరో 60 మంది మహిళలు రిక్షా నడుపుతున్నారు. మమ్మల్ని మేం ‘ఆత్మనిర్భర్‌ మహిళలం’ అని గర్వంగా చెప్పుకొంటున్నాం’ అని అంటోంది 35 ఏళ్ల జ్యోతి కుమారి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్