బొమ్మలతో.. దియామిర్జాని మెప్పించింది!

బొమ్మలంటే.. ప్లాస్టిక్‌, ఎలక్ట్రానిక్‌... ఇంతకు మించేమీ కనిపించలేదామెకు. ఒకటి అనారోగ్యం, మరోదాంతో బలవంతంగా నేర్చేసుకోవాల్సి రావడం. ఇలాగైతే పిల్లల బాల్యం ఒత్తిడితో నిండిపోదూ?.. ఇలాగే ఆలోచించింది మీతా శర్మ. వాళ్ల బాల్యాన్ని అందంగా, సృజనాత్మకంగా...

Published : 01 Mar 2022 00:46 IST

బొమ్మలంటే.. ప్లాస్టిక్‌, ఎలక్ట్రానిక్‌... ఇంతకు మించేమీ కనిపించలేదామెకు. ఒకటి అనారోగ్యం, మరోదాంతో బలవంతంగా నేర్చేసుకోవాల్సి రావడం. ఇలాగైతే పిల్లల బాల్యం ఒత్తిడితో నిండిపోదూ?.. ఇలాగే ఆలోచించింది మీతా శర్మ. వాళ్ల బాల్యాన్ని అందంగా, సృజనాత్మకంగా తీర్చిదిద్దాలని సొంతంగా బొమ్మల తయారీ సంస్థను ప్రారంభించింది. ఇప్పుడవి విదేశాల్లోనూ ప్రాచుర్యం పొందాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడులనూ ఆకర్షిస్తున్నాయి.

‘వ్యాపారమంటేనే కష్టం. ఓ మహిళ ప్రారంభిస్తోందంటే దాన్ని ఇంకాస్త కష్టంగా మార్చేవాళ్లే ఎక్కువ. దీనికి తోడు ఇంటి బాధ్యతలు. కానీ నేను నమ్మిన మార్గంపై నాకు నమ్మకం ఎక్కువ. అదే నిలబడేలా చేసింది. కాబట్టి, ముందుకు సాగగలం, నలుగురినీ నడిపించగలం అని నమ్మి అడుగేయండి, కావాల్సిన తోడ్పాటు అదే అందుతుంది’ అంటుంది మీతా.

మీతా చిన్నతనమంతా ఆడుతూ పాడుతూ సాగింది. చదువూ తనకు ఆటలో భాగమే. తన ఇద్దరు పిల్లలకీ అలాంటి బాల్యాన్ని అందించాలనుకుంది. తను కంప్యూటర్‌ ఆర్కిటెక్ట్‌. ఐఐటీ దిల్లీ నుంచి డిగ్రీ, హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసింది. అక్కడి బెల్‌, ఐబీఎం రిసెర్చ్‌ ల్యాబ్‌ల్లోనూ పనిచేసింది. ఉద్యోగం, జీతం కాదనుకుని పిల్లల్ని తీసుకుని 2012లో దేశానికి వచ్చేసింది. అప్పటికి తన చిన్నబాబుకి రెండేళ్లు. ఆడుకోవడానికి ఏవైనా కొనిద్దామని చూస్తే.. ప్లాస్టిక్‌వి లేదా ఎలక్ట్రానిక్‌ పరికరాలు మినహా ఏమీ కనిపించలేదు. ఇలాగైతే సృజనాత్మకతకు తావుండదంటుంది మీతా. పైగా ఇవి చిన్నతనం నుంచే వాళ్లలో ఒకరకమైన ఒత్తిడిని కలగజేస్తాయనుకుంది. తన పిల్లలకు వీటిని ఇవ్వాలనుకోలేదామె. యూఎస్‌లో దొరికేవే నేర్చుకునే వీలుని కలిగిస్తాయనుకుంది. అక్కడ్నుంచి ఆర్డర్‌ చేయడం మొదలెట్టింది. కానీ బోలెడు ఖర్చు. ఇక్కడికొచ్చే వారి ద్వారా తెప్పించుకుందామంటే వీలయ్యేది కాదు. దీంతో తనే తయారు చేయిద్దామనుకుంది. అలాగైతే తన పిల్లలతోపాటు దేశంలోని ఎంతోమంది చిన్నారులకు మేలవుతుందనుకుంది. అలా 2014లో ‘షుమీ టాయ్స్‌’ను మొదలెట్టింది.

‘అమ్మకాలు 2016 నుంచి మొదలుపెట్టాం. బొమ్మల డిజైనింగ్‌, స్థానిక తయారీదారులు, నాణ్యమైన ముడిసరకు.. సమకూర్చుకోవడానికి సమయం పట్టింది. సురక్షితే ప్రాధాన్యం మరి! పిల్లల సృజనాత్మకతకు ప్రాధాన్యమివ్వాలి. కాబట్టి చాలా పరిశోధనా అవసరమైంది. పిల్లలు నేర్చుకునేలా, ఆస్వాదించేలా బొమ్మలు రూపొందించా. చెక్క, మట్టి, కాటన్‌ వంటి వాటినే ఎంచుకున్నా. సృజనాత్మకత, భావప్రకటన, సమస్యా పరిష్కారం, ఆలోచనలను వ్యక్తపరచడం.. వంటి నైపుణ్యాలను ప్రదర్శించేలా ఉంటాయివి. దీనిలో పిల్లలు చేసేది 90%.. బొమ్మ పాత్ర 10 శాతమే’ అంటోంది మీతా.

ఈ బొమ్మల్ని ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచేది. కొద్దిరోజుల్లోనే ఆదరణ పెరిగింది. విదేశాల నుంచీ ఆర్డర్లు అందుకుంటోంది. దీంతో ఏడాదిలోనే పెట్టుబడిదారులను ఆకర్షించింది షుమీ. 2017, 2019ల్లో దేశంలోనే ఉత్తమ బొమ్మల బ్రాండ్‌ అవార్డులనూ అందుకుంది. ఇప్పటివరకూ రెండు లక్షలకుపైగా బొమ్మలను అమ్మింది మీతా. ఈమె పద్ధతులు మెచ్చి బాలీవుడ్‌ నటి దియామిర్జా ప్రచారకర్తగా ఉండటంతోపాటు పెట్టుబడీ పెట్టింది. ‘నేను పర్యావరణ ప్రేమికురాలిని. ఓ అమ్మగా నా బిడ్డకి సురక్షితమైన, సహజంగా ఎదిగే బాల్యాన్ని ఇవ్వాలనుకున్నా. అలా వెతుకుతున్నప్పుడు షుమీ గురించి తెలిసింది. మీతాతో మాట్లాడా. పర్యావరణ హితం, స్థానిక కళాకారులకీ ఉపాధి దొరుకుతోంది. ఇలాంటి సంస్థల్ని ప్రోత్సహించాలనే నేనూ చేతులు కలిపా’ అంటోంది దియా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్