Published : 02/03/2022 01:09 IST

చీరపై ప్రేమను..ఓ బ్రాండ్‌గా మార్చారు..

ఆ అక్కాచెల్లెళ్లిద్దరికీ చీరలంటే ఇష్టం. సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే చీరపై పెంచుకున్న ప్రేమ వారిని వాణిజ్యవేత్తలుగా మార్చింది.  తమ మనసును దోచిన చీరనే ఓ బ్రాండ్‌గా చేసి, వేలమంది నేతకార్మికులకు ఉపాధిని కల్పిస్తున్నారు. తమ సృజనాత్మకతతో వినియోగదారుల మనసు గెలుచుకుంటూ.. కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు సుజాత, తాన్యా బిశ్వాస్‌..

సుజాత, తాన్యా బిశ్వాస్‌ తండ్రి ఇండియన్‌ రైల్వేలో విధులు నిర్వహించేవారు. మూడునాలుగేళ్లకోసారి బదిలీ అయ్యే ఉద్యోగం కావడంతో దేశమంతా తిరిగిందీ కుటుంబం. దాంతో ఆయా  ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయం,  వంటలు, ఆహార్యం వంటివన్నీ వీరిద్దరూ ఒంటపట్టించుకున్నారు ఇంట్లో నానమ్మ, అమ్మ ధరించే చీరలు వీరిలో ప్రేమను పెంచుతూ వచ్చాయి. వారు భద్రపరిచే అలనాటి చీరలపై ఇద్దరూ మనసు పారేసుకునేవారు. అలా బాల్యం నుంచి అందమైన ఆహార్యమంటే చీర మాత్రమే అనే అభిప్రాయం వీరి మనసులో చేరింది.  

వారాంతంలో... ముంబయిలో ఇంజినీరింగ్‌, ఎంబీఏ పూర్తిచేసిన సుజాత పరిశ్రమలో చేరితే, లఖనవూ ఐఐఎమ్‌లో ఎంబీఏ చేసి ఐబీఎంలో కన్సెల్టెంట్‌గా చేరింది తాన్యా. అక్కడి నుంచి ఏడాదికే ముంబయికి బదిలీ అవడంతో సోదరి సుజాతను కలుసుకుందీమె. అక్కడ ఆ ఇరువురికీ  వచ్చిన ఆలోచన ‘సుతా’గా రూపొందింది. చీరపై మక్కువే దీనికి కారణమంటుంది సుజాత. ‘ఈ ఆసక్తి మేం ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉద్యోగాల్లో చేరినా తగ్గలేదు. దాంతో దీనికి సంబంధించి ఏదైనా చేయాలనిపించింది. ఉత్తరాదిన చీరల గురించి మాకు పూర్తిగా తెలిసినా కూడా, వాటి ఉత్పత్తిపై అవగాహన తెచ్చుకున్నాం. 2016లో సుతాను ప్రారంభించాం. ఓవైపు కార్పొరేట్‌  ఉద్యోగాలు చేస్తూనే వారాంతాల్లో ఇద్దరం కలిసి పనిచేసే వాళ్లం. ఆర్డర్లను ప్యాక్‌ చేసి డెలివరీ చేసేవాళ్లం. అప్పుడు మా వద్ద ఒక సహాయకుడు, ఇద్దరు చేనేత కార్మికులు మాత్రమే ఉండేవారు. వినియోగదారుల ఆసక్తిని గుర్తించి, ఇద్దరం ఏడాదికే పూర్తిగా ఇందులోకి అడుగుపెట్టాలనుకున్నాం. అలా ఉద్యోగాలకు రాజీనామా చేసినప్పుడు ఇంట్లో  అభ్యంతరం చెప్పలేదు. ‘సుతా’ అంటే దారం అని అర్థం వస్తుంది. మొదట జందానీ, ముల్‌ముల్‌, మల్కేష్‌, బనారస్‌ రకాలుగా కాటన్‌ చీరలను నేయించేవాళ్లం. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉండే సంప్రదాయాలకు సంబంధించిన కాటన్‌ చీరల రకాలన్నీ మా వద్ద తయారయ్యేవి. ఇకత్‌, లినెన్‌, వంటి రకాలూ మా వద్ద ఉంటాయి. బాతిక్‌, బ్లాక్‌ ప్రింటింగ్‌, ఎంబ్రయిడరీపై నైపుణ్యం ఉన్నవారిని గుర్తించి ఉపాధి కల్పిస్తున్నాం’ అని అంటుంది సుజాత.

వేలమంది... ‘సుతా’ను చేనేత కార్మికుల ఉపాధికి వేదికగా మార్చగలిగాం అంటుంది తాన్యా. ‘ఆరేళ్లలో దేశవ్యాప్తంగా ఉండే సంప్రదాయాలన్నింటినీ ఒకే చోట మేళవించేలా చేయడమే కాదు, కార్మికులు, కళాకారులు దాదాపు 16వేలమందికి ఉపాధిని అందించగలిగాం. అలాగే వారి కుటుంబసభ్యులకూ అర్హత, చదువుబట్టి ఉద్యోగాలను కల్పిస్తున్నాం. ప్రస్తుతం మా వద్ద ఉద్యోగులు మాత్రమే 150మందికి పైగా ఉన్నారు. మొదట రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టగా, ఇప్పుడు మా వార్షికాదాయం రూ.50 కోట్లకు చేరుకోవడం సంతోషంగా ఉంది. సుతాను ఒక బ్రాండ్‌గా మార్చడానికి చాలా సవాళ్లను ఎదుర్కొన్నాం. వస్త్రనాణ్యత తెలిసిన, నైపుణ్యం ఉన్న చేనేత కార్మికుల కోసం పశ్చిమబంగా, మధ్యప్రదేశ్‌, మేఘాలయ, వారణాసి, ఒడిశా, గుజరాత్‌, తెలంగాణలో మారుమూల గ్రామాలన్నీ తిరిగాం. ఆయా సంప్రదాయాలనూ దగ్గర నుంచి పరిశీలించాం. ఇప్పుడు మా ఫ్యాక్టరీలు నోయిడా, ధాన్యఖలిలో ఉన్నాయి. ప్రతిరోజూ వినియోగించేలా, అలాగే వర్కింగ్‌ వుమెన్‌ కోసం ఎక్కువగా మా ఉత్పత్తులను రూపొందిస్తుంటాం.’ అని చెప్పుకొస్తోంది తాన్యా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని