అర్ధరాత్రైనా అక్క సాయం చేస్తుంది...

అర్ధరాత్రి 12. సుమతికి నొప్పులు మొదలయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో వాళ్లు ఈమెకు ఫోన్‌ చేశారు. క్షణాల్లో ఆసుపత్రికి చేర్చిందామె. దివ్యకు ఆఫీస్‌లోనే బాగా ఆలస్యమైంది. సమయమేమో రాత్రి 11 దాటింది. ఏ ఆటో ఎక్కాలన్నా భయమే. మళ్లీ ఆమెకే ఫోన్‌.. సురక్షితంగా ఇంటికి చేరుకుంది. ఎన్నో సంఘటనలు..

Published : 13 Mar 2022 01:44 IST

అర్ధరాత్రి 12. సుమతికి నొప్పులు మొదలయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో వాళ్లు ఈమెకు ఫోన్‌ చేశారు. క్షణాల్లో ఆసుపత్రికి చేర్చిందామె. దివ్యకు ఆఫీస్‌లోనే బాగా ఆలస్యమైంది. సమయమేమో రాత్రి 11 దాటింది. ఏ ఆటో ఎక్కాలన్నా భయమే. మళ్లీ ఆమెకే ఫోన్‌.. సురక్షితంగా ఇంటికి చేరుకుంది. ఎన్నో సంఘటనలు.. సందర్భాల్లో  ఈమె సాయం అందుకున్న మహిళలెందరో. అందరూ ప్రేమగా ఆటో అక్క అని పిలుచుకునే ఆవిడే ... రాజీ అశోక్‌.

రాజీ భర్త ఆటో నడిపి కుటుంబాన్ని పోషించేవాడు. ఆదాయం సరిపోక కేరళ నుంచి చెన్నైకి తరలి వచ్చిందీ కుటుంబం. భర్తకు అండగా ఉండాలనుకున్న రాజీ తన డిగ్రీ అర్హతతో చాలా ఉద్యోగాలకు ప్రయత్నించింది. చివరికి ఆటో నడపడం నేర్చుకుని డ్రైవర్‌గా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటో నడిపే ఈమె అర్ధరాత్రి మహిళలను సురక్షితంగా చేర్చే ఆటో అక్కగా మారడానికి ఓ సంఘటన కారణమైంది.

గుర్తు పెట్టుకుంటారు... ఓరోజు భర్తతో బయటకెళ్లి ఇంటికొస్తుండగా, రాజీ ఓ ఆటోలో అమ్మాయిని చూసింది. రాత్రి చాలా ఆలస్యం కావడంతో భయంగా కూర్చున్న ఆ అమ్మాయి ముఖం నాకిప్పటికీ గుర్తే అంటుంది రాజీ. ‘పగలెలాగూ నా జీవనోపాధి కోసం ఆటో నడుపుతున్నాను. అర్ధరాత్రి మహిళల కోసం ప్రత్యేకంగా నేనే ఆటో ఎందుకు నడపకూడదనిపించింది. దాంతో నా ఆటో ఎక్కే మహిళలందరికీ నా ఫోన్‌ నంబరు చెప్పి, అవసరమైతే ఏ సమయంలోనైనా వచ్చి గమ్యానికి చేరుస్తానని చెప్పేదాన్ని. అప్పటి నుంచి విమానాశ్రయంలో ఫ్లైటు ఆలస్యంగా చేరుకున్నప్పుడు, ఆఫీస్‌లో ఆలస్యం అయితే, ప్రసవ సమయాల్లోనూ, అనుకోని అనారోగ్యాలు వచ్చినప్పుడు... ఇటువంటి సందర్భాల్లో నాకు ఫోన్‌ చేయడం ప్రారంభించారు. అలా రెండు దశాబ్దాలుగా చెన్నై వాసులకు సేవలందిస్తున్నా. ఏ సమయమైనా ఆలోచించను. వారి ఇబ్బందిని గ్రహించి వారికి సాయం చేయడానికి వెళతా. అందుకే చాలామంది నన్ను ఎంతకాలమైనా మర్చిపోరు. ఎక్కడ చూసినా పలకరిస్తారు. డిగ్రీ చదువుకున్నా ఉద్యోగం రాలేదని నేననుకోలేదు. ఈ ఉపాధి ఆర్థికంగానే కాదు, వృత్తిపరంగానూ తృప్తిని కలిగిస్తోంది. తోటి మహిళలను అవసరానికి ఆదుకుంటున్నాను అనే ఆలోచనే చాలా సంతోషాన్నిస్తోంది. నేను తోడ్పడిన వారి సంఖ్య పూర్తిగా గుర్తులేదు. దాదాపు 10 వేలమందికి పైగా అమ్మాయిలకు, మహిళలకు అర్ధరాత్రి సేవలందించా. రాత్రిపూట ఎందుకని మావారెప్పుడూ నన్ను అడగలేదు. తను నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాడు. అలాగే ఆటో డ్రైవింగ్‌ నేర్పడానికి ప్రత్యేక శిక్షణా సంస్థలు లేవు. అందుకే ఆసక్తి ఉన్న మహిళలకు నేను ఉచితంగా డ్రైవింగ్‌ నేర్పుతున్నా. ఎందుకంటే నెలకు రూ.15 నుంచి రూ.20 వేల వరకు ఆదాయాన్ని పొందే ఈ ఉపాధి మహిళలకూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ నన్ను అభిమానంగా ఆటో అక్క అని పిలుస్తుంటే చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తుంది’ అని చెబుతోంది రాజీ. ఇంతేనా తన ఆటో ఎక్కే వృద్ధులు, పేదవారి దగ్గర డబ్బులు కూడా తీసుకోదు. తనను చాలా కళాశాలల్లో, కార్యక్రమాల్లో స్ఫూర్తి ప్రసంగాలకు ఆహ్వానిస్తూ ఉంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్