క్యాన్సర్‌ బాధిత చిన్నారుల కోసం

ఆమె క్యాన్సర్‌ బాధితురాలు. చికిత్స ఎంత కష్టమో ఆమెకు తెలుసు. ఎంతోమంది చిన్నారులు దీనికారణంగా పడిన బాధనీ దగ్గర్నుంచి చూసింది. తాను దీన్నుంచి తప్పించుకుంటే.. మరింత మందిని బయట పడేలా చూడాలనుకుంది.

Published : 14 Mar 2022 01:43 IST

ఆమె క్యాన్సర్‌ బాధితురాలు. చికిత్స ఎంత కష్టమో ఆమెకు తెలుసు. ఎంతోమంది చిన్నారులు దీనికారణంగా పడిన బాధనీ దగ్గర్నుంచి చూసింది. తాను దీన్నుంచి తప్పించుకుంటే.. మరింత మందిని బయట పడేలా చూడాలనుకుంది. అనుకున్నట్లుగానే వేలమంది చిన్నారులకు సాయం అందిస్తోంది పూనమ్‌ బగాయ్‌.

పూనమ్‌కి ఇద్దరు పిల్లలు. భర్తతోపాటు పోలండ్‌లో ఉండేది. అక్కడ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగి. అప్పుడామెకు 38 ఏళ్లు. అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. పరీక్ష చేయిస్తే పెద్ద పేగు క్యాన్సర్‌గా తేలింది. పిల్లలింకా చిన్నవారే. వాళ్ల కోసమైనా దీన్ని జయించాలనుకుంది. ఇందుకోసం కుటుంబంతో కలిసి భారత్‌కు తిరిగొచ్చింది. ఈమెది దిల్లీ. చికిత్సలో భాగంగా మూడు శస్త్రచికిత్సలు, తొమ్మిది కీమోథెరపీలు.. నరకమే చూసింది. దీనికితోడు ఒత్తిడి. కొద్దిరోజులకే అసలు దీనిబారి నుంచి బయటపడతానా అనుకుంది పూనమ్‌. తనలాగే ఆసుపత్రిలో ఎంతోమంది పిల్లలు క్యాన్సర్‌ బారినపడి నరకాన్ని అనుభవిస్తుండటం చూసింది. తను దీన్నుంచి బయటపడితే ఈ చిన్నారులకు ఏదైనా చేయాలని తీర్మానించుకుంది. నాలుగేళ్లకు మొత్తానికి ఆ వ్యాధి బారి నుంచి బయటపడింది.

దీంతో తన ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలనుకుంది పూనమ్‌. స్నేహితురాలు సోనాల్‌ శర్మతో కలిసి 2004లో ‘కెన్‌ కిడ్స్‌.. కిడ్స్‌ కెన్‌’ ఎన్జీవోను స్థాపించింది. ఈ వ్యాధి సోకిన చిన్నారులు తిరిగి అందరిలా మారగలరు.. దేన్నైనా సాధించగలరనే నినాదంతో ఈ సంస్థ నడుస్తోంది. గడచిన 18 ఏళ్లలో 60వేలమంది పిల్లలకు చికిత్స అందించడంలో సాయపడింది. వారి మానసికారోగ్యం మెరుగుపడేలా చేయూతనందిస్తోంది. ‘సోనాల్‌ రెండేళ్ల కూతురికీ క్యాన్సర్‌ సోకింది. దాంతో తను కూడా నాతో చేయి కలిపింది. క్యాన్సర్‌ తగ్గిందనుకుంటే మావారు దూరమయ్యారు. ఒంటరిగానే పిల్లల బాధ్యత తీసుకున్నా. మా సంస్థ ద్వారా చిన్నారులకు వైద్యసేవలు, చదువు, సంరక్షణ, జీవన నైపుణ్యాలను మెరుగుపరచడంతోపాటు వారి తల్లిదండ్రులకూ దీనిపై అవగాహన కలిగిస్తున్నాం. పిల్లలకి వైద్యసాయంతోపాటు మానసికపరమైన చేయూతనీ ఇస్తున్నాం. దిల్లీలోని ప్రతి క్యాన్సర్‌ ఆసుపత్రిలో దాదాపు 100మందితో మా సేవలు ప్రారంభమయ్యాయి. నాలుగేళ్ల తర్వాత  రాష్ట్రేతర ప్రాంతాలకీ విస్తరించాం. దేశవ్యాప్తంగా 122 ఆసుపత్రులతో కలిసి పనిచేస్తున్నాం. పలు ఎన్జీవోల సాయాన్నీ తీసుకుంటున్నాం. ఎందరో సామాజిక సేవాకార్యకర్తలూ భాగస్వామ్యులయారు. మానసిక వైద్యనిపుణులు, ఉపాధ్యాయులు, పోషకాహారనిపుణులు, నర్సులు మాతోకలిసి సేవలందిస్తున్నారు. క్యాన్సర్‌ నుంచి బయటపడిన పిల్లల తల్లిదండ్రులు కూడా మాతో చేయికలుపుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మా సంస్థ తరఫున ఇలా 1500మందికి పైగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో మా సేవలను రెట్టింపు చేయడానికి కృషి చేస్తున్నాం’ అని చెబుతున్న పూనమ్‌ 13 ఏళ్లు దాటిన వారికి అవసరమైతే ఇంటర్న్‌షిప్స్‌, ఉద్యోగ శిక్షణ వంటివి ఇప్పిస్తోంది. క్యాన్సర్‌పై అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇండియన్‌ క్యాన్సర్‌ సొసైటీతో కలిసి పనిచేస్తున్న పూనం ప్రస్తుతం ‘పల్లియం ఇండియా’కు వైస్‌ ఛైర్మన్‌. ఈమె సేవలకుగాను ‘నర్గీస్‌దత్‌ క్యాన్సర్‌ కాంకెరర్‌’, ‘ఇందిరా ప్రియదర్శిని’, ‘కర్మవీర్‌ మహారత్న’ వంటి పలు అవార్డులు వరించాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్