లక్షల మందికి మానసిక సేవ

‘శరీరానికి జబ్బు చేస్తే వైద్యుణ్ని కలుస్తాం, చికిత్స తీసుకుంటాం. మానసిక సమస్యలూ అలాంటివే! వాటికీ సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి’ అంటారు డాక్టర్‌ తారా రంగస్వామి. ఈ అంశంపై పరిశోధనలు చేయడమే కాదు.. ప్రజల్లో అవగాహనా కల్పిస్తున్నారీమె. బాధితులకు న్యాయం జరిగేలా చట్టంలో మార్పులొచ్చేలా చేశారు. లక్షల మందికి ఆవిడ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు.

Published : 17 Mar 2022 00:43 IST

‘శరీరానికి జబ్బు చేస్తే వైద్యుణ్ని కలుస్తాం, చికిత్స తీసుకుంటాం. మానసిక సమస్యలూ అలాంటివే! వాటికీ సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి’ అంటారు డాక్టర్‌ తారా రంగస్వామి. ఈ అంశంపై పరిశోధనలు చేయడమే కాదు.. ప్రజల్లో అవగాహనా కల్పిస్తున్నారీమె. బాధితులకు న్యాయం జరిగేలా చట్టంలో మార్పులొచ్చేలా చేశారు. లక్షల మందికి ఆవిడ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు.

డాక్టర్‌ తారకు చిన్నప్పటి నుంచి మనుషుల్ని చదవడం, వారి బాధల్ని దూరం చేయడం ఇష్టం. అందుకే మెడిసిన్‌ తర్వాత మద్రాస్‌ మెడికల్‌ కాలేజీ నుంచి సైకాలజీలో పీజీ చేశారు. ‘డిజెబిలిటీ ఇన్‌ స్కిజొఫ్రీనియా’పై పీహెచ్‌డీ కూడా చేశారు. మద్రాస్‌ విశ్వవిద్యాలయంలో సీనియర్‌ రిసెర్చ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలో ఎందరో మానసిక రోగుల్ని, వారి కుటుంబాలను కలుసుకున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కొరవడుతోందని గ్రహించారు. వారికి సాయమందించాలని సన్నిహితులతో కలిసి 1984లో స్కిజొఫ్రీనియా రిసెర్చ్‌ ఫౌండేషన్‌ (స్కార్ఫ్‌) ప్రారంభించారు. దానికి తనే వైస్‌ ఛైర్‌పర్సన్‌!

పట్టణాల్లో ఉన్న వారికి కొద్దో గొప్పో మానసిక సమస్యలపై అవగాహన ఉంటుంది. మరి పల్లెల్లో వారి పరిస్థితి ఏంటి? ఇదాలోచించే... మారుమూల గ్రామాలకూ తన సేవల్ని తీసుకెళ్లారు. తమిళనాడులోని 7 జిల్లాల్లో ‘ఉచిత మొబైల్‌ టెలీ సైకియాట్రి’ పేరుతో సేవల్ని అందిస్తున్నారు. బాధిత కుటుంబాల వద్దకు ప్రత్యేక బృందం బస్సులో వెళ్లి క్యాంపు నిర్వహించి మరీ కౌన్సెలింగ్‌, మందులూ ఇస్తుంది. ప్రతి రోగి వివరాలనూ డిజిటల్‌గా నమోదు చేస్తారు. ఇప్పటిదాకా 5.2 లక్షల మందికి ఈ సేవలందాయి. దీర్ఘకాల మానసిక రోగులపై పరిశోధనలూ చేశారు. వీరిని శాస్త్రీయంగా గుర్తించడంపై ఇండియన్‌ డిజెబిలిటీ ఇవాల్యూయేషన్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ స్కేల్‌ (ఐడియాస్‌) పేరుతో ప్రత్యేక కొలమానాల్నీ రూపొందించారు. దీనికి ప్రభుత్వ ఆమోదమూ దక్కింది. మానసిక వికలాంగుల కోసం జాతీయ దివ్యాంగుల చట్టంలో మార్పులు చేయించిన ఘనత డాక్టర్‌ తార సొంతం. ఈవిడవి సుమారు 180దాకా పరిశోధక పత్రాలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. పుస్తకాలు, పాఠ్యాంశాల్నీ రచించారు. మానసిక రుగ్మతకు జన్యు కారణాలపై పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ సహా ఎన్నో అంతర్జాతీయ సంస్థల్లో మానసిక విభాగాల్లో సలహాదారీమె. గతంలోనూ రాష్ట్రపతి పతకాన్ని అందుకున్నారు. యూకే నుంచి రాయల్‌ ఛాలెంజ్‌ ఆఫ్‌ సైక్రియాట్రిస్ట్‌ ఫెలోషిప్‌నీ పొందారు.

- హిదాయతుల్లాహ్‌, చెన్నై

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్