Published : 20/03/2022 00:47 IST

కళను కాపాడి.. పతకాన్ని అందుకున్నారు

కళే తమ ఉనికి అనుకున్నారు జయ ముత్తు, తేజమ్మ. దాన్ని అంతరించిపోకుండా కాపాడుకోవాలనుకున్నారు. ఇప్పుడది ఎంతోమందికి ఉపాధిగానూ మారింది. అంతర్జాతీయ గుర్తింపూ దక్కింది. వీరి కృషికి పురస్కారంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ఏడాది నారీశక్తి అవార్డును అందుకున్నారు.

య, తేజమ్మలది తమిళనాడులోని నీలగిరి జిల్లా కొండప్రాంతాల్లో కనిపించే తోడా అనే తెగ. వస్త్రాలపై డిజైన్లను చేత్తోనే నేయడం ఈ తెగ ప్రత్యేకత. అందులో ఈ ఇద్దరూ మంచి నిష్ణాతులు. చిన్నతనంలోనే ఈ కళలో ప్రావీణ్యం పొందారు. ఈ తెగ వారు చేసే శాలువా, ఇతర వస్త్రాల్ని అందానికే కాక సమాజంలో గౌరవం, హుందాతనానికి చిహ్నంగానూ వాడుతుంటారు. వారు నిర్వహించుకునే ప్రతి వేడుకలోనూ వీటికి ప్రాధాన్యం ఉంటుంది. నీలగిరిలోని కొండ ప్రాంతాల్లో వీరి తెగకు చెందిన 70 గ్రామాల్లో ఇదే ఒరవడి.

చుక్కలు, మార్కింగ్‌లే కాదు అల్లికకూ ప్రమాణాలుండవు. ఎంతటి కష్టమైన డిజైన్‌ అయినా ఓసారి మనసులో అనుకుని చేత్తో చకచకా అల్లేస్తుంటారు జయ ముత్తు, తేజమ్మ. యంత్రాల ఊసే ఉండదు. పూర్తిగా రూపొందాక చూస్తే ఎవరైనా వారెవ్వా అనాల్సిందే. తెల్లటి వస్త్రంపై రంగుల ఎంబ్రాయిడరీ దారాలతో అల్లుతుంటారు. ప్రధానంగా ఎరుపు, నలుపు రంగులు కనిపిస్తుంటాయి. పర్యావరణాన్ని ఈ తెగవారు ఎక్కువగా ప్రేమిస్తారు. అందుకే చాలావరకు మొక్కలు, పువ్వుల డిజైన్లే ఉంటాయి. ఖాళీ సమయాల్లో తామూ ప్రయోగాలు చేస్తుంటామనీ, ఆకట్టుకుంటాయి అనిపించాక వాడుకలోకి తెస్తామని చెబుతోందీ ద్వయం. కొత్తది ఆవిష్కరించిన ప్రతిసారీ ఎంతో ఆనందంగా ఉంటుందంటారు. నీలగిరి జిల్లాలోని ఊటీ, ఇతర పర్యాటక ప్రాంతాల్లో ‘తోడా ఎంబ్రాయిడరీ’ పేరుతో లభిస్తాయి. యంత్రాలకు మించిన పరిపూర్ణత అంటూ పర్యాటకులు ప్రశంసిస్తుంటారు. ఇప్పుడు ఎంతోమంది వీరి బాటలో నడుస్తూ ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు.. 2013లో దీనికి ‘భౌగోళిక గుర్తింపూ’ (జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌) దక్కింది.

- హిదాయతుల్లా బిజాపూర్‌, చెన్నై


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని