రాణి... మా మంచి సీనియర్‌

ఇంటిల్లపాదీ కష్టపడితేగానీ ముద్ద నోట్లోకి వెళ్లని పరిస్థితి. ఇక చదివించే స్థోమతెక్కడిది? కలలు నిజం చేసుకోవడానికి డబ్బే కావాలా? ప్రయత్నమూ సరిపోతుందని నమ్మింది. ఈ తీరే.. ఆమెను అవకాశాలను వెతుక్కుని వెళ్లేలా చేయడమే కాక.. అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగం సాధించేలా చేసింది.

Published : 21 Mar 2022 02:16 IST

ఇంటిల్లపాదీ కష్టపడితేగానీ ముద్ద నోట్లోకి వెళ్లని పరిస్థితి. ఇక చదివించే స్థోమతెక్కడిది? కలలు నిజం చేసుకోవడానికి డబ్బే కావాలా? ప్రయత్నమూ సరిపోతుందని నమ్మింది. ఈ తీరే.. ఆమెను అవకాశాలను వెతుక్కుని వెళ్లేలా చేయడమే కాక.. అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగం సాధించేలా చేసింది. అంతటితో ఆగలేదు.. తనలాంటి ఎంతోమందికి మార్గనిర్దేశం చేస్తోంది. గుంటికాడి రాణి.. తన సేవలకు కేంద్ర ప్రభుత్వ అవార్డునూ అందుకుంది. ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణమిది!

రాణి.. పేద కుటుంబంలో మూడో సంతానం. ఈమెది నారాయణపేట జిల్లాలోని చిత్తనూరు. నాన్న లక్ష్మణ్‌ మేస్త్రి, అమ్మ సుజాత ఆయన వెంటే కూలి పనులకు వెళ్తుంది. అంతంతమాత్రం ఆదాయం ఉన్న కుటుంబానికి రాణీ అక్క పెళ్లితో అప్పులు పెరిగాయి. దీంతో ఆమె అన్నయ్య హరీశ్‌ ఇంటర్‌ తర్వాత చదువు మానేసి బైక్‌ మెకానిక్‌గా మారి కుటుంబానికి ఆసరా అయ్యాడు. కానీ రాణీకేమో ఉన్నతవిద్య చదవాలని కోరిక. ఉపకారవేతనాలతో ఇంటర్‌ వరకూ పూర్తిచేసింది. బీటెక్‌ కలకి ఆర్థిక పరిస్థితులు అడ్డునిలిచాయి. దీంతో బీఎస్సీ వైపు మళ్లింది. సాంఘిక గురుకుల డిగ్రీ కళాశాల ప్రవేశ పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించి, సీటు సంపాదించింది. అది 2019.. ఈసారి అవకాశం డేటాసైన్స్‌ శిక్షణ రూపంలో తలుపు తట్టింది. ఆ శిక్షణకు 100మంది గురుకుల డిగ్రీ విద్యార్థులను ఎంపిక చేయగా వారిలో ఆమె కూడా ఉంది. మూడు నెలల శిక్షణ తర్వాత రూ.3.6 లక్షల వార్షిక వేతనంతో కాగ్నిజెంట్‌లో డేటా అనలిస్ట్‌గా ఉద్యోగమూ సాధించింది.

తన కల నెరవేరింది. మరి తనలాంటి అమ్మాయిల సంగతేంటని ఆలోచించింది రాణి. అందుకే ఓవైపు ఉద్యోగం చేస్తూనే గురుకుల విద్యార్థులకు రెండేళ్లుగా శిక్షణనిస్తోంది. అంతేకాదు.. రెజ్యూమె తయారీ నుంచి ఇంటర్వ్యూని ఎదుర్కోవడం సహా అన్నింటిపైనా సూచనలిస్తోంది. ఇతర అనుభవజ్ఞులతో గెస్ట్‌ లెక్చర్లనూ ఇప్పిస్తోంది. ఇప్పటివరకూ రాణి 200 మందికి డేటాసైన్స్‌లో శిక్షణనివ్వగా దాదాపుగా అందరికీ కొలువులొచ్చాయి. ఇప్పుడామె ట్విటర్‌(బెంగళూరు)కి మారింది. ఏడాదికి రూ.25 లక్షల జీతం. అయినా వీలునుబట్టి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తోంది. ఉద్యోగావకాశాల సమాచారాన్నీ  మెయిల్‌, వాట్సాప్‌ గ్రూపు, గూగుల్‌ మీట్‌ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటుంది. తద్వారా వాళ్లూ ఉద్యోగాల్లో స్థిరపడేలా చూస్తోంది. తన సామాజిక సేవలకుగానూ మహిళా దినోత్సవం రోజున న్యూదిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చేతుల మీదుగా విమెన్‌ ఎక్సలెన్స్‌ అవార్డును అందుకుంది. రాణి సేవల్ని గుర్తించిన ఉపాధ్యాయులు.. రాజేష్‌ లక్కార్సు, సతీష్‌ తిప్పారపు ఈమెను ఈ అవార్డుకి నామినేట్‌ చేశారు.

అవే మార్చాయి..

‘రెండు అంశాలు నా జీవితాన్ని మలుపు తిప్పాయి. మొదటిది చదువుకోవడానికి పైసల్లేవన్న ఆలోచనను దూరం చేసుకోవడం, రెండోది డేటాసైన్స్‌ శిక్షణకు ఎంపికవ్వడం. శిక్షణయ్యాక ఐఐటీ, ఎన్‌ఐటీల్లో బీటెక్‌, ఎంటెక్‌ పూర్తిచేసిన వారితో పోటీపడుతూ ఇంటర్వ్యూకు హాజరయ్యా. డిగ్రీ పూర్తవ్వక ముందే కాగ్నిజెంట్‌లో ఉద్యోగం వచ్చింది. ఇంట్లోవాళ్లంతా చాలా ఆనందించారు. ఇంటి నుంచి రూపాయి తీసుకోకుండా చదువుకొని, ఉద్యోగం సంపాదించా. నాలాగే తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే వాళ్లెందరో! వాళ్లకి సాయపడాలని 2020 నుంచి డేటాసైన్స్‌లో శిక్షణనివ్వడం ప్రారంభించా. పేద విద్యార్థినిలు ఉద్యోగాలు తెచ్చుకోవడం చాలా సంతోషాన్నిస్తుంది. నా లాంటి పరిస్థితే చాలామందిది. పరిస్థితులను పక్కన పెట్టి ధైర్యంగా, ఓపిగ్గా ప్రయత్నిస్తే మీరూ మీ కలల్ని సాధ్యం చేసుకోగలరు. కాబట్టి ప్రయత్నం ఆపొద్దు’ అంటోన్న రాణి జీవితం, ప్రయత్నం.. ఈ తరం అమ్మాయిలకు స్ఫూర్తిమంతమే కదూ!


మూడు నెలల శిక్షణ సమయంలో అన్నింటినీ పక్కన పెట్టేశా. పండగలేకాదు.. ఇల్లు, అమ్మానాన్న సంగతీ మర్చిపోయి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11.30 వరకు కంప్యూటర్‌ ల్యాబ్‌లోనే సాధన చేస్తుండేదాన్ని.


- నర్సింగోజ్‌ మనోజ్‌కుమార్‌, మహబూబ్‌నగర్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్