విజయ జలపాతమైంది!

అతను చేసే ల్యాండ్‌స్కేపింగ్‌ పనుల్లో ఫౌంటెయిన్‌ తయారు చేసే వ్యక్తి రాలేదు. రోజులు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. ఆయన ఆందోళన చూసి ‘నేనే ప్రయత్నిస్తే?’ అనుకుందా ఇల్లాలు. ఆ ఆలోచనే

Updated : 01 Apr 2022 15:49 IST

అతను చేసే ల్యాండ్‌స్కేపింగ్‌ పనుల్లో ఫౌంటెయిన్‌ తయారు చేసే వ్యక్తి రాలేదు. రోజులు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. ఆయన ఆందోళన చూసి ‘నేనే ప్రయత్నిస్తే?’ అనుకుందా ఇల్లాలు. ఆ ఆలోచనే ఆమెనీ రోజు భిన్నమైన రంగంలో రాణించేలా చేసింది. ఫౌంటెయిన్ల తయారీలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతోన్న హైదరాబాద్‌కి చెందిన పూర్ణిమ వసుంధరతో మాటకలిపారు..

మా నాన్న రాజ్‌భవన్‌లో పనిచేసేవారు. అమ్మ గృహిణి. ఇంటర్‌ తర్వాత బాపట్లలో అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ చేశా. ప్రభుత్వ విభాగంలో ఐదేళ్లు ఒప్పంద ఉద్యోగిగా పని చేశా. తర్వాత స్టేట్‌బ్యాంకులో మార్కెటింగ్‌, రికవరీ ఆఫీసర్‌గా చేరాను. మావారు మల్లిఖార్జునరావు.. ఎంటెక్‌ చేసి, ల్యాండ్‌ స్కేపింగ్‌ వైపు వెళ్లారు. మాకు కవల పిల్లలు. వాళ్లు నెలలునిండకుండా పుట్టారు. వాళ్ల కోసం ఉద్యోగం వదులుకున్నా. వాళ్లకు మూడేళ్లు వచ్చాక ఏదైనా చేయాలనిపించింది. అదే నా జీవితంలో మలుపు. మావారికి ఇండోర్‌ వాటర్‌ ఫౌంటైన్‌ ఆర్డర్లు వస్తుంటాయి.  వాటిని తయారుచేసే వ్యక్తి సరిగా వచ్చేవాడు కాదు. ఆర్డరిచ్చిన వాళ్ల నుంచి ఫోన్‌లమీద ఫోన్లు. వినియోగదారులని వదులుకోలేం. దాంతో ఆ ఫౌంటైన్‌ ఏదో నేనే చేద్దాం అనుకున్నా. నాకు టెక్నికల్‌గా ఐడియా ఉంది కానీ ఆ డిజైన్‌ను మోల్డ్‌లోకి చేయడం తెలియలేదు. యూట్యూబ్‌లో వెతికా. మట్టితో చేసి విఫలమయ్యా. తర్వాత మరో నాలుగు డిజైన్లు... అవీ ఫెయిల్‌. మొదట్లో నిరుత్సాహపడ్డా పట్టుదలగా ప్రయత్నించాను. కాకపోతే నెలరోజులు పట్టింది. కానీ మరోచిక్కు. వచ్చిన ఆర్డరు మూడు అడుగులత్తైతే.. నేను 5 అడుగులది చేశా. ‘ఇది పెట్టాలంటే మా ఇల్లు సరిపోదు’ అన్నాడు ఆ ఆర్డరిచ్చినతను. అలా నా మొదటి ప్రయత్నంలో నిరాశ ఎదురయ్యింది. కొన్నిరోజులకి మరొకరు దాన్ని రూ.35వేలకు కొన్నారు. చాలా సంతోషంగా అనిపించింది. ఈ సంఘటన నా మీద నాకు నమ్మకాన్ని  కలిగించింది... నన్ను ఫౌంటైన్‌ డిజైనర్‌గా మార్చింది. 2013 నుంచి ఇదే నా కెరియర్‌. నేను చేసిన మోడల్స్‌ని ప్రదర్శనల్లో ఉంచేదాన్ని. ఆర్డర్లు బాగానే వచ్చేవి. వీటి ధరలు 800 నుంచి 25 లక్షల వరకూ ఉంటాయి. కొన్నింటికి పెట్టుబడి ఎక్కువ. అంత నేను పెట్టలేను. అందుకే ఓ ఆర్డర్‌పై వచ్చిన ఆదాయంతో రెండోది చేసే దాన్ని. 50 రకాల ఇండోర్‌ ఫౌంటైన్లను డిజైన్‌ చేయడంలో నైపుణ్యం సంపాదించా. భిన్నమైన డిజైన్లు, సమయానికి పూర్తిచేయడంతో నెమ్మదిగా వినియోగదారులు పెరిగారు. ముఖ్యంగా ఎర్రమంజిల్‌, పంజాగుట్ట, ఉప్పల్‌, రాయదుర్గం ప్రాంతాల్లోని మెట్రోరైల్‌ పనులు చేశాక ఆత్మవిశ్వాసం పెరిగింది. గచ్చిబౌలి, హైటెక్‌సిటీలోని పార్కులు, గేటెడ్‌ కమ్యూనిటీలు, ఆలయాలకు ఫౌంటైన్లని చేశాను. మెల్లగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతర జిల్లాల నుంచీ ఆర్డర్లు మొదలయ్యాయి. మావారు నిర్వహిస్తున్న గ్రీన్‌ టెక్నో సర్వీసెస్‌కు మేనేజింగ్‌ పార్టనర్‌నీ అయ్యా. ఇందులో టెర్రస్‌ ల్యాండ్‌స్కేపింగ్‌, వర్టికల్‌ గార్డెనింగ్‌, అవుట్‌డోర్‌, ఇండోర్‌ ఫౌంటైన్స్‌, పోడియం గార్డెన్‌ సిస్టం వంటి సర్వీసులని ప్రారంభించాం.

అనుకోని కుదుపుతో...

నా కెరియర్‌లో సవాళ్లు లేవా అంటే ఉన్నాయి. 2016... మాకు గడ్డుకాలం. ఆ ఏడాది ఆర్డర్ల డబ్బులు చాలామటుకు రాలేదు. ఎంత ఇబ్బందీ అంటే మావారు, నేను తిరిగి ఉద్యోగాల్లో చేరాల్సిన పరిస్థితి. అయినా అధైర్య పడలేదు. ఏడాదికి కోలుకున్నాం. మళ్లీ వ్యాపారాన్ని కొనసాగించాం. ప్రస్తుతం నెలకు 10-15 ఆర్డర్లు వస్తున్నాయి. అపర్ణ, రామ్‌కీ, ఎల్‌అండ్‌టీ, మెట్రో, హాల్‌మార్క్‌ బిల్డర్స్‌ కోసం పని చేస్తున్నాం. వారం రోజులు ఏకబిగిన రాత్రీ పగలు పనిచేసిన సందర్భాలున్నాయి. అయినా ఇష్టంగా చేస్తున్నది కాబట్టి కష్టం అనిపించదు. మరిన్ని ప్రయోగాలు, ఆవిష్కరణలు చేయాలి, సంస్థని ఇంకా విస్తరించాలన్నది నా లక్ష్యాలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్