ఝార్ఖండ్‌ మహిళా విప్లవం పలాశ్‌...

పచ్చళ్లూ, సబ్బులూ, చేనేత వస్త్రాలూ, తేనె, నూనె... మొత్తం 65 రకాల ఉత్పత్తులు దొరుకుతాయి ‘పలాశ్‌’ దుకాణాల్లో. ఇవన్నీ పలాశ్‌ బ్రాండ్‌తో ఆన్‌లైన్‌లో లభిస్తాయి. ప్రారంభించిన ఏడాదికే ఈ బ్రాండ్‌కి ఎంతో

Updated : 22 Mar 2022 04:28 IST

పచ్చళ్లూ, సబ్బులూ, చేనేత వస్త్రాలూ, తేనె, నూనె... మొత్తం 65 రకాల ఉత్పత్తులు దొరుకుతాయి ‘పలాశ్‌’ దుకాణాల్లో. ఇవన్నీ పలాశ్‌ బ్రాండ్‌తో ఆన్‌లైన్‌లో లభిస్తాయి. ప్రారంభించిన ఏడాదికే ఈ బ్రాండ్‌కి ఎంతో గుర్తింపు వచ్చింది. ఇంతకీ ఈ ఉత్పత్తులు తెస్తున్నది ఎవరంటారా... ఝార్ఖండ్‌లోని స్వయం సహాయక బృందాలు. అక్కడ ప్రస్తుతం ‘పలాశ్‌’ విప్లవం నడుస్తోంది.

దేశంలోని పేద రాష్ట్రాల్లో ఝార్ఖండ్‌ ఒకటి. అక్కడ చాలా కాలంగా స్వయం సహాయక బృందాలు స్థానిక వనరులతో వివిధ రకాల ఉత్పత్తులు తెస్తున్నాయి. వాటిని స్థానికంగానే అమ్ముతుండేవారు. ఆ ఉత్పత్తులు నాణ్యమైనవే అయినా సరైన మార్కెట్‌ లేక అమ్మకాలు అంతంత మాత్రంగా ఉండేవి. ఈ విషయం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ దగ్గరకు చేరింది. ఈ పరిస్థితిని మార్చడంఎలా అన్న చర్చలు జరిగినప్పుడు... వీటన్నింటినీ ఒకే బ్రాండ్‌ కింద అమ్మితే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ ఏర్పడి ఆదాయం పెరుగుతుందని, లక్షల మంది పేదరికం నుంచి బయట పడతారన్న నిర్ణయానికి వచ్చారు. దాంతో వెంటనే ఆ ఏర్పాట్లు చేయమని అధికారులను ఆదేశించారు సోరెన్‌. అలా 2020 సెప్టెంబరు నుంచి ‘పలాశ్‌’ బ్రాండు మొదలుపెట్టారు. పలాశ్‌ అంటే మోదుగ పువ్వు, ఆ రాష్ట్ర పుష్పం. పలాశ్‌ పేరుతో మొదట రాంచీ, జంషెడ్‌పూర్‌లలో మార్ట్‌లు ప్రారంభించారు. అక్కడ స్వయం సహాయక బృందాల ఉత్పత్తుల్నే అమ్ముతారు. ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుకాణాల్ని విస్తరించారు. దీంతో వీటికి మంచి గిరాకీ ఏర్పడింది. ఇటీవల నోయిడాలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించిన ‘సారస్‌ అజీవికా మేళా’లో అత్యధిక అమ్మకాలూ, వినూత్న ఉత్పత్తులూ అందించినందుకు ప్రథమ బహుమతీ అందుకున్నారు పలాశ్‌ సభ్యులు. ఇక్కడ 25 రాష్ట్రాల మహిళలు 162 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వాటిలో పలాశ్‌ మాత్రమే రూ.15 లక్షల విలువైన ఉత్పత్తుల్ని అమ్మింది.

అంతా మహిళలే...

పలాశ్‌లో ఉత్పత్తులకు ముడి పదార్థాలను సామాజిక సాగు చేసే స్వయం సహాయక బృందాల దగ్గరే సేకరిస్తారు. ఉత్పత్తుల తయారీనీ ఆ బృందాల వారే చేపడతారు. ప్యాకింగ్‌, మార్కెటింగ్‌... ఇలా అన్నింటా మహిళలే భాగమవుతారు. దంపుడు బియ్యం, కంది పప్పు, రాగి పిండి, ఆవ నూనె, చింతపండు లాంటి ఆహార ఉత్పత్తులతోపాటు పసుపు, కుంకుమ, డిటర్జెంట్‌ సబ్బులూ, ఫినాయిల్‌, మాస్కులూ, హ్యాండ్‌ వాష్‌, చింత పండు, శానిటైజర్లూ, శానిటరీ ప్యాడ్‌లూ... ఇలా అన్నింటినీ మహిళా బృందాలే చేస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి విభాగం కార్యదర్శి ఆరాధనా పట్నాయక్‌ పర్యవేక్షిస్తున్నారు. ఈ యావత్‌ కార్యక్రమంలో మహిళలకు అవసరమైన నైపుణ్య శిక్షణను ప్రభుత్వమే అందిస్తోంది. ‘ఆదివ’ పేరుతో ఆభరణాలనీ   అమ్ముతున్నారు. ఆదివాసీల సంప్రదాయ నగల్ని పోలినట్లు వెండి, రాగి తదితర లోహాలతో ఈ నగల్ని ఆకర్షణీయంగా చేస్తున్నారు. గతేడాది పలాశ్‌ మార్ట్‌ యాప్‌నీ తెచ్చారు.

ఇదంతా ఒకెత్తైతే పలాశ్‌ తెస్తున్న ఆర్థిక మార్పు మరొకెత్తు. దాదాపు 32 లక్షల మంది దీని ద్వారా ఆదాయం పొందుతున్నారు. మార్ట్‌లూ, ఈ-కామర్స్‌, యాప్‌లలో ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాక దళారుల బెడద పోయింది. సభ్యుల ఆదాయం నాలుగైదు రెట్లు పెరిగింది. ఒకప్పుడు రోజుకి సగటున రూ.100 మాత్రమే సంపాదించే వారికి ఇప్పుడు రూ.400 - 500 వస్తోంది. ఈ బ్రాండ్‌ని రూ.1500 కోట్ల టర్నోవర్‌ స్థాయికి తీసుకువెళ్లాలనేది ఝార్ఖండ్‌ ప్రభుత్వ లక్ష్యం. దాన్నీ సాధిస్తామని ఈ బృందాల మహిళలు ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్