ఈమె వంటలకు కోట్లమంది ఫిదా..

గృహిణిగా ఇంట్లో వారికి రుచిగా వండి పెట్టడంతోనే ఆమెకు తృప్తి. అనుకోకుండా వచ్చిన ఓ ఆలోచన ఆమెను యూట్యూబర్‌గా మార్చింది. పల్లెవంటకాల రుచిని ప్రపంచానికి చూపించే అవకాశాన్ని

Published : 24 Mar 2022 01:37 IST

గృహిణిగా ఇంట్లో వారికి రుచిగా వండి పెట్టడంతోనే ఆమెకు తృప్తి. అనుకోకుండా వచ్చిన ఓ ఆలోచన ఆమెను యూట్యూబర్‌గా మార్చింది. పల్లెవంటకాల రుచిని ప్రపంచానికి చూపించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. అయిదేళ్లలోనే కోట్లమంది ఈ రుచులకు ఫిదా అయ్యారు. 17లక్షలమంది సబ్‌స్క్రైబర్లుగా మారారు. ఏ కోర్సులూ చేయకుండానే వంటలో నైపుణ్యాలను ప్రదర్శిస్తూ, యూట్యూబ్‌ స్టార్‌గా మారిన 50 ఏళ్ల శశికళ చౌరాసియా విజయ రహస్యం తెలుసుకుందాం.

శశికళకు వివాహమై, అత్తగారింట్లో అడుగుపెట్టేనాటికి ఆ మారుమూల గ్రామంలో ఇంటర్నెట్‌ అంటే ఏంటో తెలీదు. అయిదో తరగతి చదివిందీమె. ఆడపిల్లకు పెద్దచదువులు అవసరం లేదనే కుటుంబం వారిది. ఇంటి పనుల్లో అమ్మకు సాయం చేసేది. అలా చిన్నవయసులోనే వంటిల్లు పరిచయమైంది. ఆ తర్వాత వివాహమై, ముగ్గురు మగపిల్లలు పుట్టడంతో రోజంతా వాళ్లతోనే సరిపోయేది. అందరికీ వండిపెడుతూ, తృప్తిపడేది. అలా 30 ఏళ్లు గడిచిపోయాయి. ముగ్గురు పిల్లలూ కెరియర్‌లోకి అడుగుపెట్టారు. వీళ్లది ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాఖ్వా గ్రామం. అప్పటివరకు లేని ఇంటర్నెట్‌ సౌకర్యం 2016లో 4జీ రూపంలో వచ్చింది. ఇది శశికళ జీవితంలో అనుకోని మలుపునూ తీసుకొచ్చింది. 

యూట్యూబర్‌గా...

ఈ సౌకర్యం అందరినీ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా మారేలా చేసింది అంటుంది శశికళ. ‘నాకు తెలిసిన కొందరు మహిళలు బ్లాగర్స్‌గా, ఇన్‌ఫ్లుయన్సర్లుగా మారారని తెలిసి, దాని గురించి అడిగి తెలుసుకునేదాన్ని. వాళ్ల ధైర్యం చూసి ఆశ్చర్యపడ్డా. నువ్వు కూడా ఏదైనా చేయొచ్చు కదా అని మా పిల్లలు అంటుంటే నా వల్ల ఏమవుతుందిలే అనుకున్నా. నా వంటలకి ఇంట్లోనే కాదు, మా బంధువుల్లోనూ అభిమానులున్నారు. ఓరోజు మా అబ్బాయి చందన్‌ ‘ఏదైనా వంట చెయ్యి. వీడియోను యూట్యూబ్‌లో పెడతా’ అన్నాడు. ఆదాయం కూడా వస్తుందన్నాడు. నేను వంట చేస్తా, నా ముఖం మాత్రం స్క్రీన్‌లో కనిపించకూడదని నియమం పెట్టా. అలా యూట్యూబర్‌గా మారా. 2017, నవంబరులో ‘అమ్మా కీ¨ థాలీ’  ప్రారంభించాం. మొదట బూందీ ఖీర్‌ తయారీని ఫోన్‌లోనే రికార్డు చేసి అప్‌లోడ్‌ చేశాం. దీన్ని కొద్దిమందే చూశారు. నిరుత్సాహపడ్డాం. అయిదునెలలు వంటలు చేస్తూ, వాటిని యూట్యూబ్‌లో పెడుతూ వచ్చాం. అప్పటికీ వీక్షకుల సంఖ్య తక్కువే. అలా కాకుండా కొత్తగా చేయాలనుకున్నా. ఇక్కడి పచ్చళ్ల తయారీని అందరికీ పరిచయం చేయాలని మామిడికాయ పచ్చడి చేశా. అప్‌లోడ్‌ చేసిన గంటల్లోపే వేలమంది చూశారు. ఈ వంటను ఇప్పటివరకు 2.6 కోట్లమంది చూశారు. బెల్లం ఊరగాయలను ఎక్కువగా చేస్తున్నా. ‘అమ్మా కీ థాలీ’కి ఇప్పుడు 17 లక్షలమంది సబ్‌స్క్రైబర్లుండగా, 27.38 కోట్లమంది వీక్షించారు. దీంతో నెలకు రూ.70వేలకు పైగా ఆదాయాన్ని అందుకుంటున్నా. ఈ వీడియోలను పాకిస్థాన్‌, ఫిజీ, అమెరికా, దుబాయి దేశాలవారు కూడా చూసి ప్రశంసిస్తున్నారు. ‘సూజీ కీ గులాబ్‌ జామూన్‌’ను 5 కోట్లు, రసగుల్లా వీడియోను 4.1 కోట్లమంది చూశారు. ‘గోబీ కే కోఫ్తా’ను 80 లక్షల మంది వీక్షించారు. చాలామంది ఇంట్లో చేసే రసగుల్లా ఎక్కువ కాలం నిల్వ ఉండదనుకుంటారు. అందుకోసం నేను చెప్పిన చిన్న చిట్కాకు చాలా స్పందన వచ్చింది. ఇన్ని చేయగలుగుతున్నానంటే అవన్నీ మా అమ్మ నుంచి నేర్చుకున్న నైపుణ్యాలే’ అంటోంది శశికళ. ఒకప్పుడు బయటి ప్రపంచం తెలియని ఆమె ఇప్పుడో సెలబ్రిటీ. ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు చాలామంది తనను గుర్తుపట్టి సెల్ఫీలు దిగుతూ ఉంటారు. ఇంట్లో మిగిలిన ఆహారంతో వేరే పదార్థాలు తయారు చేయొచ్చా అని అడుగుతున్న అభిమానుల కోసం కొత్తరకాలు చేసి చూపించడానికి సిద్ధపడుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్