రైతుల జట్టు... ఆలోచన హిట్టు!

ఆరుగాలం శ్రమించినా పంట చేతికి వస్తుందన్న హామీ లేదు. అదృష్టం బావుండి పండినా, దళారుల రూపంలో దురదృష్టం వెనకే ఉండేది. దాంతో ఆ గ్రామాల్లోని రైతులు ఒక్కొక్కరే కూలీలుగా మారడంతో ఆమె మనసు తరుక్కుపోయింది. ‘రైతులందరం జట్టు కట్టి కొత్తదారిలో నడుద్దాం’ అని పిలుపునిచ్చింది. అన్నదాతలంతా మళ్లీ ధైర్యంగా కాడి పట్టేందుకు శాంతి ఏం చేస్తున్నారంటే...

Updated : 28 Mar 2022 04:34 IST

ఆరుగాలం శ్రమించినా పంట చేతికి వస్తుందన్న హామీ లేదు. అదృష్టం బావుండి పండినా, దళారుల రూపంలో దురదృష్టం వెనకే ఉండేది. దాంతో ఆ గ్రామాల్లోని రైతులు ఒక్కొక్కరే కూలీలుగా మారడంతో ఆమె మనసు తరుక్కుపోయింది. ‘రైతులందరం జట్టు కట్టి కొత్తదారిలో నడుద్దాం’ అని పిలుపునిచ్చింది. అన్నదాతలంతా మళ్లీ ధైర్యంగా కాడి పట్టేందుకు శాంతి ఏం చేస్తున్నారంటే...

విజయనగరం జిల్లాలోని బాడంగి, తెర్లాం, రామభద్రపురం మండలాల్లో చెరకు, కూరగాయల సాగు ఎక్కువ. కానీ ఏడాది కష్టం, చివరకు నష్టం.. ఇది అక్కడ రైతుల పరిస్థితి. దాంతో కూలి పనులకు వెళ్లేవారు. బాడంగి మండలం వీరసాగరానికి చెందిన లచ్చిపతుని శాంతి వీటన్నింటినీ గమనించారు. సమస్య గుర్తిస్తే పరిష్కరించకుండా నిద్రపోదామె. మొదట్నుంచీ సామాజిక స్పృహ ఎక్కువ. పెళ్లి కారణంగా తొమ్మిదో తరగతితో చదువు ఆపేసినా, వయోజన విద్యా కార్యక్రమం ‘అక్షర విజయం’ వాలంటీరుగా గ్రామంలో ఎందరినో అక్షరాస్యులుగా మార్చారు. బడికి దూరంగా ఉంటోన్న బాలికలను బ్రిడ్జి  పాఠశాలలో చేర్పించేవారు. వన సంరక్షణ సమితి ఎన్జీవో ఫెసిలిటేటర్‌గా గిరిజన ప్రాంతాల్లో పని  చేశారు. అప్పుడే ఎన్జీవోల పనితీరుని దగ్గరగా  పరిశీలించారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం 1999లో ‘దీక్షా ఉమెన్‌ వెల్ఫేర్‌ సొసైటీ’ని ఏర్పాటు చేశారు. గ్రామంలో అందరినీ భాగస్వాములను చేస్తూ సంఘ సభ్యులంతా వారానికోసారి గ్రామాన్ని శుభ్రం చేసేవారు. మొక్కలు నాటేవారు. పొదుపునీ ప్రోత్సహించేవారు. తర్వాత నాబార్డు సాయంతో చుట్టుపక్కల మండలాల్లో వందల మంది మహిళలకు  టైలరింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో శిక్షణ ఇప్పించి స్వయంఉపాధి  కల్పించారు శాంతి. అన్నదాతలకు ఆధునిక సాగు పద్ధతుల్నీ పరిచయం చేశారామె. అందుకే శాంతి మీద గ్రామస్థులకి నమ్మకం. కానీ ఈసారి ఆమె ఎంచుకున్న లక్ష్యం అంత చిన్నది కాదు.

చెరకు ఇప్పుడెంతో తీపి!

రైతులతో మాట్లాడి 2016లో బాడంగి కేంద్రంగా కూరగాయలూ, బెల్లం ఉత్పత్తిదారులతో ‘రైతుల జట్టు’ కంపెనీని ఏర్పాటు చేయించారు. రైతులే తమ ఉత్పత్తుల్ని నేరుగా వినియోగదారులకు అమ్ముతారు. నాబార్డు సాయంతో 20 మందితో దీన్ని ప్రారంభించారు. బెల్లాన్ని  అచ్చులుగా అమ్మితే కిలో రూ.35-40 వస్తుంది. ఆ ధరతో నష్టమే. ఈ ప్రాంత చెరకుతో చేసిన బెల్లంలో ఉప్పు తక్కువగా ఉండి రుచిగా ఉంటుంది. బెల్లంతో ఉప ఉత్పత్తులు తయారుచేద్దామని సూచించి కొందరు మహిళా రైతులకు అనకాపల్లిలోని బెల్లం పరిశోధన కేంద్రంలో శిక్షణ ఇప్పించారామె. ఇప్పుడు బెల్లాన్ని పొడిగా, స్పటికాలుగా మార్చి ‘రైతుల జట్టు’ బ్రాండ్‌తో కేజీ రూ.100 చొప్పున అమ్ముతున్నారు. ద్రవం, సూప్‌ల ప్యాక్‌లూ తయారు చేస్తున్నారు. చాక్లెట్లు, వేరుశనగ, నువ్వుల లడ్డూలూ, పూతరేకుల్లాంటివీ అమ్ముతున్నారు. ఫార్మా కంపెనీలూ వీరినుంచి బెల్లం కొనుగోలు చేస్తున్నాయి. లాభాల్ని రైతులంతా ఉమ్మడిగా పంచుకుంటున్నారు. రైతులు కూరగాయల్ని సమీపంలోని రామభద్రపురం మార్కెట్‌లో అమ్ముతుంటారు. అక్కడ దళారులు సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధరకు చేజిక్కించుకునేవారు. ఈ పరిస్థితిని మార్చడానికి సంఘం ఆధ్వర్యంలో కోల్డ్‌స్టోరేజీని ఏర్పాటు చేయించారామె. అనుకున్న ధర రాలేదంటే ధైర్యంగా తిరిగి తీసుకొచ్చి దీన్లో పెట్టి మర్నాడు అమ్ముకుంటారు. ఆకుకూరల్ని పొడిగా, ఎండు మిర్చిని కారంగా మార్చి ప్యాక్‌లలో అమ్మడం మొదలుపెట్టారు. ఇప్పుడు రైతుల పరిస్థితి మెరుగైంది. ప్రస్తుతం 100 మంది సభ్యులుగా ఉన్నారు.

కదిలే దుకాణం..

దీక్షా ఆధ్వర్యంలో సాలూరులో ధరణి,   కొమరాడలో రైతు నేస్తం, బాడంగిలోనే అక్షయ పేరుతో పరస్పర సహకార పరపతి సంఘాలనీ ఏర్పాటు చేయించారు శాంతి. రైతులు సాగుచేసిన పసుపు, చిరుధాన్యాలూ, బియ్యం, తెల్ల నువ్వులు, పండ్లతోపాటు కొన్ని రకాల అటవీ ఉత్పత్తుల్ని నేరుగా  మార్కెటింగ్‌ చేస్తున్నారు. దీని కోసం ‘రూరల్‌ మార్ట్‌’ వ్యాన్‌నీ ఏర్పాటుచేసుకున్నారు. వీరి శ్రమను గుర్తించి 16 కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు కూరగాయలు సరఫరా చేసే అవకాశాన్ని ఇచ్చింది జిల్లా పాలనా యంత్రాంగం. ‘రైతు కూలీగా మారితే ఆహారం దొరకడం కష్టం. సిరులు పండించే భూమి బీడుగా మిగిలిపోతుంది. అన్నదాతలు గర్వంగా బతకాలన్నదే నా లక్ష్యం. నాబార్డు, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, జిల్లా సహకార బ్యాంకు, పలు స్వచ్ఛంద సంస్థలతోపాటు ఇంకెందరో వ్యక్తులు అండగా నిలుస్తున్నారు. దీక్షా ఆధ్వర్యంలో 400 మంది రైతులు ఉన్నారు. వీరిలో 75 శాతం మహిళలే. మూడువేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గతేడాది రూ.కోటి టర్నోవర్‌ సాధించాం. మార్కెటింగ్‌కి మరిన్ని దారులు అన్వేషిస్తున్నాం. ఈ ప్రయాణంలో మావారు ఈశ్వరరావు సహకారం ఎంతో ఉంది’ అంటారు శాంతి. దూరవిద్య ద్వారా పీజీ పూర్తి చేయడమే కాదు, ఇద్దరు కూతుళ్లనీ ఉన్నత చదువులు చదివించారు. శాంతి మాట మాత్రమే కాదు, బాట కూడా ఎందరికో స్ఫూర్తి!

-కె.మునీందర్‌, విజయనగరం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్