దిగువ యాభై శాతం కోసం!

టాటా, ఎయిర్‌టెల్‌ లాంటి సంస్థలతోపాటు ఐక్యరాజ్య సమితి - ప్రపంచ ఆహార పథకంలోనూ విధులు నిర్వహించారు హనీషా అశ్వానీ. తన అనుభవంతో పేదరిక నిర్మూలన కోసం వెంచర్‌ క్యాపిటలిస్ట్‌గా మారాలనుకున్నారు. తన స్నేహితురాళ్లనీ అందుకు ఒప్పించారు.

Updated : 30 Mar 2022 03:42 IST

హనీషా

టాటా, ఎయిర్‌టెల్‌ లాంటి సంస్థలతోపాటు ఐక్యరాజ్య సమితి - ప్రపంచ ఆహార పథకంలోనూ విధులు నిర్వహించారు హనీషా అశ్వానీ. తన అనుభవంతో పేదరిక నిర్మూలన కోసం వెంచర్‌ క్యాపిటలిస్ట్‌గా మారాలనుకున్నారు. తన స్నేహితురాళ్లనీ అందుకు ఒప్పించారు. నలుగురూ కలిసి దేశంలో మహిళలు మాత్రమే సభ్యులుగా ఉన్న తొలి ఏంజెల్‌ ఇన్వెస్టింగ్‌ సంస్థ ‘మెజారిటీ’ని ప్రారంభించారు.


‘ఏ వ్యాపారంలో అడుగుపెట్టాలన్నా ఒక విషయం గుర్తు పెట్టుకోండి. మీ సేవలు, ఉత్పత్తి సమాజంలో ఎక్కువ మందిని ప్రభావితం చేసేలా ఉండాలి. అదే సమయంలో లాభం కూడా చూసుకోవాలి. ఈ విషయం ఎంత బాగా అర్థం చేసుకుంటే అంతలా విజయం సాధించవచ్చు’ అంటూ ఔత్సాహిక వ్యాపారులకు సలహా ఇస్తారు హనీషా.

హనీషా అశ్వానీ 20 ఏళ్ల కెరియర్‌లో వ్యాపార, అంకుర సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. వాటిలో మేక్‌మైట్రిప్‌, టాటా క్లిక్‌, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ఆహార పథకంలోనూ పనిచేశారు. దీన్లో ఇన్నోవేషన్‌ యాక్సెలరేటర్‌గా మ్యూనిక్‌ (జర్మనీ)లో ఉంటూ ప్రపంచవ్యాప్తంగా సామాజిక మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న అంకుర సంస్థల్లో పెట్టుబడుల వ్యవహారాలు చూసేవారు. 2020లో ఈ ఆహార విభాగానికి నోబెల్‌ శాంతి బహుమతి వచ్చింది కూడా. అయినా అక్కడి పరిమితుల దృష్ట్యా సొంతంగా ‘ఇంపాక్ట్‌ ఫండ్‌’ను ఏర్పాటుచేసి పేదల జీవితాల్ని మెరుగుపర్చగలిగే అంకుర సంస్థల్లో పెట్టుబడి పెట్టాలనుకున్నారు హనీషా. ఈ విషయాన్ని వివిధ సంస్థల్లో తన మాజీ సహోద్యోగులు, స్నేహితులైన అదితి సచ్‌దేవ్‌, బెవర్లీ అవలానీ, నేత్రా పారిఖ్‌లతో పంచుకున్నారు. ఆ ఆలోచన వాళ్లకూ నచ్చింది. అలా ఈ నలుగురూ భాగస్వాములుగా ముంబయి కేంద్రంగా ఫండింగ్‌ సంస్థ ‘మెజారిటీ’ని గత మేలో ప్రారంభించారు. వచ్చే అయిదేళ్లలో మన దేశానికి చెందిన అంకుర సంస్థల్లో రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టాలనేది వీరి ఆలోచన. ఒక్కో సంస్థలో 2 - 5 కోట్ల వరకూ పెట్టుబడికి సిద్ధమంటున్నారు హనీషా. ఇప్పటికే మత్స్యకారులకు ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌ సేవల్ని అందించే ‘నంబర్‌8’ సంస్థతోపాటు ఓ విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థకు నిధులు సమకూర్చారు. మరో పది సంస్థలతో చర్చలు తుది దశలో ఉన్నాయి. వాతావరణ మార్పులూ, వ్యవసాయంలో సాంకేతికత వినియోగం, వైద్య సేవలు, పోషకాహారం, ఫిన్‌టెక్‌, ఎడ్‌టెక్‌, మహిళల ఆర్థిక ఉన్నతికి కృషిచేసే సంస్థల్లోనే ఈ పెట్టుబడులు ఉంటాయి. వార్షిక ఆదాయం రూ.2లక్షల లోపు ఉన్న కుటుంబాల్ని దృష్టిలో పెట్టుకుని తెచ్చే ఉత్పత్తుల్లో ప్రధానంగా పెట్టుబడి పెడతారు. ఏటా తమ పెట్టుబడికి పది రెట్లు అంటే రూ.2000 కోట్ల సంపదను సృష్టించడమే లక్ష్యం అంటున్నారు. ప్రస్తుతం కేవలం 5 శాతం పెట్టుబడులు మాత్రమే  ఇంపాక్ట్‌ స్టార్టప్స్‌ వైపు వెళ్తున్నాయని చెబుతున్నారు. ఐటీలో మాస్టర్స్‌ చేసిన హనీషా ఈ సంస్థకి మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ కాగా.. బెవర్లీ-మార్కెటింగ్‌, అదితి- లా అండ్‌ కమ్యూనికేషన్స్‌, నేత్ర- ఫైనాన్స్‌ విభాగాల్ని చూస్తున్నారు.

మహిళా వ్యాపారులకు ప్రాధాన్యం...
సమాజంలో మార్పుతెచ్చే పెట్టుబడిదారులుగా పనిచేయాలనేది లక్ష్యంగా చెబుతారీ నలుగురు. ‘కార్పొరేట్‌ ప్రపంచంలో ధనికులూ, మధ్య తరగతి వర్గాల కోసం పనిచేశాను. ఇప్పుడు పేదల కోసం చేయాలన్న లక్ష్యంతో ఇటువచ్చా. ఈ విభాగంలో ఫలితాలు కాస్త నెమ్మదిగా వస్తాయి. ఎక్కువ సమయం పడుతుంది. ఆ మార్పుల్ని మేమూ చూడాలనే కెరియర్‌ మధ్యలోనే ఇటువైపు అడుగులు వేశాం. తొలి మూడేళ్లూ పోషకాహార లోపంతో బాధపడే పిల్లల చదువు, ఆర్థిక వృద్ధిలో పురోగతి అంతంత మాత్రంగా ఉంటుంది. పిల్లల్లో పోషకాహార లోపాన్ని గుర్తించే యాప్‌ ఉంటే ఈ సమస్యని పరిష్కరించవచ్చు. అలాంటి సంస్థల్ని ప్రోత్సహిస్తాం. దాంతో భౌగోళిక పరిమితులు లేకుండా ఎక్కడివారికైనా ప్రయోజనం కలుగుతుంది’ అంటారు హనీషా. తమ పెట్టుబడుల్లో 70 శాతం మహిళా వ్యవస్థాపకుల సంస్థల్లోనే ఉంటాయంటారు.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్