వాళ్ల కోసం మూడు రెస్టారెంట్లు అమ్మేశా!

ఉన్నదాంట్లో పెట్టేవాళ్లని మంచివాళ్లని అంటారు.. మరి ఉన్నదమ్మైనా సరే అనాథలకి అండగా ఉండాలనుకొనే వాళ్లని ఏమనాలి? సొంతకాళ్లపై నిలదొక్కుకోవాలని.. వ్యాపారవేత్త కావాలని కలలుకన్న శ్రీదేవి

Updated : 01 Apr 2022 06:31 IST

ఉన్నదాంట్లో పెట్టేవాళ్లని మంచివాళ్లని అంటారు.. మరి ఉన్నదమ్మైనా సరే అనాథలకి అండగా ఉండాలనుకొనే వాళ్లని ఏమనాలి? సొంతకాళ్లపై నిలదొక్కుకోవాలని.. వ్యాపారవేత్త కావాలని కలలుకన్న శ్రీదేవి తనకున్న మూడు రెస్టరెంట్లని అనాథలకోసం ఎందుకు అమ్మాల్సివచ్చింది? అమ్మ అనే పిలుపుకోసం ఆమె చేసిన త్యాగం ఏంటి? ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..

నాన్న తపాలాశాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. నేను పుట్టిపెరిగిందంతా నెల్లూరులోనే అయినా ఆయన ఉద్యోగరీత్యా మా కుటుంబం నెల్లూరు, కావలి, బుచ్చిరెడ్డిపాలెంలో కూడా ఉండాల్సి వచ్చింది. ఐదుగురు సంతానంలో నేను పెద్దదాన్ని. నాన్నకి నలుగురికీ సాయం చేయడం అంటే ఇష్టం. చదువుకుంటానన్న పిల్లలని చదివించేవాళ్లు. ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టేవారు. బట్టలిచ్చేవారు. దాంతో నాకూ సేవాగుణం అబ్బింది. ఓ సమయంలో అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించింది. తనకోసమని నాకు హడావుడిగా పదోతరగతిలోనే పెళ్లిచేశారు. మావారు వ్యాపారం చేసేవారు. ఇద్దరు పిల్లలు పాప, బాబు. పెళ్లిచేసినా నాన్న నా చేయి వదల్లేదు. చదువుకుంటానంటే ప్రోత్సహించారు. కావలిలో డిగ్రీ చదివా. నాకాళ్లపై నేను నిలబడాలని ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లో డిగ్రీ చేశాను. తిరుపతిలో మూడు రెస్టరంట్లు, క్యాటరింగ్‌ సర్వీసులు నిర్వహించేదాన్ని.

ఆమె జీవితం మార్చేసింది...

ఒక రోజు మా కుటుంబమంతా కలిసి తిరుమల దర్శనానికి వచ్చాం. అంతవరకూ నా చిటికెన వేలు పట్టుకుని తిరిగిన మాబాబు ఒక్కసారి కనిపించకుండా పోయాడు. గుండెఝల్లుమంది. మొత్తం జల్లెడపట్టి, ఎలా అయితేనేం బాబుని దొరకపుచ్చుకున్నా. కానీ ఆ సమయంలో నాతో చాలామంది అన్నమాట నామనసులో నాటుకుపోయింది. ‘ఇక్కడివన్నీ మామూలే! ఆ పిల్లలని కాళ్లు, చేతులు విరిచి ఎక్కడో అమ్మేస్తారు!’ అన్నారు. అమ్మగా ఆ ఊహ నన్ను వణికిపోయేలా చేసింది. చిన్నచిన్న దొంగతనాలు చేసుకుంటూ, మత్తుకు బానిసైన పిల్లలు నా కళ్లముందు కదిలారు. అప్పుడే ఇంకో సంఘటనా జరిగింది. తిరుపతి నుంచి కావలి వెళ్తుంటే ఒక అమ్మాయి, తన బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. తనని రక్షించి ఇంటికి తీసుకొచ్చా. ఈ సంఘటనలే 15 ఏళ్ల క్రితం నేను మాతృశ్య అనే సంస్థని ప్రారంభించడానికి కారణమయ్యాయి. ఎక్కడెక్కడ నుంచో వచ్చి తిరుపతిలో రోడ్లమీద ఉండే పిల్లలని ఇంటికి తీసుకొచ్చేదాన్ని. వాళ్లకు కడుపునిండా అన్నం పెట్టి బుజ్జగిస్తే నోరువిప్పి సొంతూళ్ల పేర్లు చెప్పేవాళ్లు. వాళ్లకి కౌన్సెలింగ్‌ ఇచ్చి తిరిగి ఇళ్లకు పంపేదాన్ని. అలా కొన్ని వందలమంది పిల్లల్ని వాళ్ల ఇళ్లకు పంపా. ఇక ఏ ఆధారం లేని పిల్లలు, పెద్దవాళ్లకు మాతృశ్యలోనే నీడనిచ్చేదాన్ని. వాళ్లకు కావాల్సిన చదువు, వసతి, భోజనం ఇక్కడే. ఇందుక్కావాల్సిన డబ్బుకోసం మా రెస్టరంట్లని ఒకదాని తర్వాత ఒకటి అమ్మేశాను. ప్రస్తుతం వేడుకలకు క్యాటరింగ్‌ సర్వీసులు, ఆర్గానిక్‌ మసాలా పొడులు, పచ్చళ్లు తయారుచేస్తూ ఆ వచ్చిన ఆదాయాన్ని సంస్థ కోసం ఉపయోగిస్తున్నా.

ఆయనా ఒక బిడ్డే...

ప్రస్తుతం వందకు పైగా పెద్దవాళ్లు, పిల్లలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. పుట్టిన రోజులు, పర్వదినాలప్పుడు దాతలు ముందుకొచ్చి పిల్లలకు కావాల్సినవి భోజన ఏర్పాట్లు చేస్తుంటారు. చెత్తకుప్పల్లో దొరికిన పిల్లలు, ఆసుపత్రుల్లో వదిలేసి వెళ్లిన పిల్లల్ని  సీడబ్ల్యుసీ వాళ్లు మాకు అప్పగిస్తుంటారు. అలాగే బస్టాండు, రైల్వేస్టేషన్లలో అనాథలుగా ఉన్న పిల్లలను పోలీసులు గుర్తించి మా ఆశ్రమానికి తీసుకువస్తారు. తల్లిదండ్రులకు కొవిడ్‌ వస్తే... పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ ఉండేవారు కాదు. ఆ సమయంలో ఎంతోమందికి అండగా ఉన్నాం. ఇప్పటికీ అందరికీ స్వయంగా నేనే వండిపెడతాను. అలా వండిపెట్టడంలో నాకో సంతృప్తి ఉంటుంది. మా ఆశ్రమంలో చదువుకున్న వాళ్లలో ఒకరు వెటర్నిటీ డాక్టర్‌గా స్థిరపడితే, మరికొంత మంది ఇతర వృత్తుల్లో స్థిరపడ్డారు. కొంతమందికి పెళ్లిళ్లయ్యాయి. వాళ్లంతా తిరుపతి వస్తే ‘అమ్మా’ అని నన్ను పలకరించే వెళతారు. ఆరేళ్ల క్రితం ఆయనకి ప్రమాదం జరిగి మంచానికే పరిమితం అయ్యారు. ఇప్పుడు ఆయనకూడా నాకో చంటిబిడ్డే. మా పాప ఎంకామ్‌ చదివింది. నాకు అండగా ఉంటోంది. బాబు వ్యాపారం చేసుకుంటూ నాకు తోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ప్రశంసలు, పురస్కారాలు వచ్చాయి. అంతకుమించిన ఆనందం నాకు సేవలోనే ఉంది.

- మహంకాళి కిరణ్‌కుమార్‌, తిరుపతి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్