Updated : 03/04/2022 06:31 IST

కేన్స్‌ వేదికపై మెరిసిన అసోం సంప్రదాయం...

అ అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్‌ అంటే ఇష్టం. కానీ తప్పనిసరై ఇంజినీరింగ్‌ చదివింది. ఆ రంగంలో పదేళ్లు ఉద్యోగమూ చేసింది. కానీ తన అభిరుచి తనను నిలవనీయలేదు. ఇక చాలనుకుని మనసు మెచ్చిన రంగంలోకి ప్రవేశించింది. అంతర్జాతీయ స్థాయికి ఎదిగి అద్భుతాలు సృష్టిస్తోంది. బ్రిటిష్‌ యువరాణి సహా మరెందరో ప్రముఖుల మనసూ చూరగొన్న సంజుక్తా దత్తా స్ఫూర్తి గాథ ఇదీ...

ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌లో డిజైన్లను ప్రదర్శించాలని కలలు కంటారు. అటువంటి తన కల ఇన్నాళ్లకు నిజమైంది అంటోంది అసోంకి చెందిన సంజుక్తా దత్తా. అక్కడ ప్రదర్శించిన ప్రతి డిజైన్‌నూ తీర్చిదిద్దడానికి ఎన్నో నెలలు కష్టపడింది తను. వీటిలో డ్రేప్‌ స్కర్టులు, ఇండో వెస్ట్రన్‌ లెహెంగాలు, ఛదర్‌ వంటివన్నీ ఉన్నాయి.

చేనేత రంగంలోకి.. సంజుక్త అసోంలో ఇంజినీరింగ్‌ చదివింది. పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పదేళ్లు పని చేసింది. బాల్యం నుంచి దుస్తుల డిజైన్‌పై ఉన్న ఆసక్తి తనను నిలవనివ్వలేదు. అప్పటికి చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉండటం, నేత కార్మికులు ఉపాధిని కోల్పోతూ ఉండటాన్నీ చూసి ఆవేదన చెందింది. దాంతో వారి కళకు జీవం పోయాలంటే కొత్త పంథాను అనుసరించాలనే ఆలోచనతో ఈ రంగంలోకి అడుగుపెట్టింది. సొంతంగా వస్త్రడిజైన్లను చేయడం నేర్చుకుంది. ఉద్యోగానికి రాజీనామా చేసి, గువాహటిలో 2012లో చేనేత యూనిట్‌ను ప్రారంభించింది. స్థానిక నేత కార్మికులకు పని కల్పించడం ప్రారంభించింది. అసోం సంప్రదాయ ఆభరణాల డిజైనింగ్‌లో మహిళలకు శిక్షణనిప్పించి వారి కాళ్ల మీద వాళ్లు నిలిచేలా చేయూత నిచ్చింది.

యువరాణికి... తన సృజనాత్మకతతో పలువురు ప్రముఖులకు వస్త్రాలను డిజైన్‌ చేసే అవకాశాల్ని అందుకుంది  సంజుక్త. హేమామాలిని, జరీనాఖాన్‌, బిపాసబసు, లారాదత్తా, కరిష్మాకపూర్‌ వంటి పలువురు నటీమణులు ఈమె డిజైన్లను ధరించి అంతర్జాతీయ వేదికలపై మెరిశారు. 2015లో భారతదేశానికి వచ్చిన ప్రిన్స్‌ విలియమ్స్‌ సతీమణి కేట్‌ మిడిల్టన్‌కు అవుట్‌ఫిట్‌ డిజైన్‌ చేసే అవకాశాన్ని సంజుక్త చేజిక్కించుకుంది. కేట్‌ ఆ దుస్తులను ధరించి మురిసిపోయింది. అవి తనకు ఎంతగా నచ్చాయంటే కజిరంగ నేషనల్‌ పార్కు సందర్శన కోసం తీసుకున్న ఆ డ్రస్‌తోనే స్వదేశానికి ప్రయాణమైంది.

గౌరవంగా... ఫ్యాషన్‌ వేదికల్లో ప్రతిష్ఠాత్మకమైంది న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌. ఆ వేదికపై ప్రపంచానికి అసోం సంస్కృతిని తెలియజేసే అవకాశం దక్కడం నా అదృష్టం అంటుంది దత్తా. ‘అసోంలో పుట్టిపెరిగిన నాకు ఇక్కడ సంప్రదాయ దుస్తులపై ఎనలేని ప్రేమ. అంతటి విలువైన సంస్కృతిని అందరికీ చేర్చాలని ఉండేది. కొన్నాళ్ల నుంచి ఇక్కడి చేనేత వెనుకబడింది. దాంతో ఆధునిక ఫ్యాషన్‌కు సంప్రదాయాన్ని జత చేస్తూ చాలా ప్రయోగాలు చేశా. పశ్చిమ్‌ బంగా బాతిక్‌ ప్రింట్స్‌, కశ్మీరు అరీ డిజైన్‌, రాజస్థాన్‌కు చెందిన బాందానీ వంటి వాటిని అసోం దుస్తులకు జత కలిపా. పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలిస్తున్నా. న్యూయార్క్‌ ఫ్యాషన్‌ షోలో ప్రదర్శించిన ప్రతి అవుట్‌ఫిట్‌ రూపొందించడానికి కనీసం నెలన్నర నుంచి రెండు నెలలు పట్టింది. అవి అందరి ప్రశంసలూ పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. అసోం చేనేతను ప్రపంచం దృష్టికి తీసుకు రావాలనేది నా లక్ష్యం. అమెరికాలో నివసించే వారి వార్డ్‌రోబ్స్‌లో త్వరలో ఈ సంప్రదాయ దుస్తులు ఉండేలా చేయనున్నా’ అని చెబుతున్న సంజుక్త 2018లో ఉత్తమ ఫ్యాషన్‌ డిజైనర్‌ విభాగంలో  ప్రతిష్ఠాత్మక ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్సలెన్స్‌’ అవార్డునూ అందుకుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని