జర్మనీ నుంచి.. ఆ పిల్లల కోసం వచ్చేశా!

ఆధ్యాత్మిక పయనానికి భారత్‌లో అడుగుపెట్టినా... అనుకోకుండా సేవా మార్గాన్ని ఎంచుకున్నారు. దానికోసం జన్మభూమినీ, తల్లిదండ్రుల్నీ వదిలి... వేల కిలోమీటర్ల దూరంలోని తెలుగు నేలమీద స్థిరపడ్డారు. వందల మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు

Published : 04 Apr 2022 00:48 IST

ఆధ్యాత్మిక పయనానికి భారత్‌లో అడుగుపెట్టినా... అనుకోకుండా సేవా మార్గాన్ని ఎంచుకున్నారు. దానికోసం జన్మభూమినీ, తల్లిదండ్రుల్నీ వదిలి... వేల కిలోమీటర్ల దూరంలోని తెలుగు నేలమీద స్థిరపడ్డారు. వందల మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు జర్మనీకి చెందిన హెల్గా ప్రుడెంట్‌. ఆ ప్రయాణం గురించి వసుంధరతో పంచుకున్నారిలా...

స్నేహితుల ద్వారా తెలుసుకుని మొదటిసారి 1996లో సత్యసాయి బాబా దర్శనానికి పుట్టపర్తి వచ్చాను. ఆ తర్వాత పదేళ్లలో ఇండియాకి చాలాసార్లు వచ్చివెళ్లా. ఇక్కడే ఉంటానని అనుకోలేదెపుడూ. వచ్చినప్పుడల్లా అనంతపురం జిల్లా, ముదిగుబ్బలోని నాగానందస్వామి ఆశ్రమానికీ వెళ్తూ ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునేదాన్ని. ఆశ్రమంలోని స్కూల్లో పాఠాలూ చెబుతుండేదాన్ని. పేద పిల్లలెందరో చదువుకునేవారక్కడ. స్వామీజీకి ఆధ్యాత్మిక అంశాలతోపాటు స్కూల్‌ అన్నా, పిల్లలన్నా ఎంతో ఇష్టం. 2006లో స్వామీజీ ఆరోగ్యం బాగాలేదని తెలిసి కడసారిగా చూసి వెళ్దామని వచ్చా. బెంగళూరు ఆసుపత్రిలో కోమాలో 72 రోజులుండి చనిపోయారు. ఆ సమయానికి నేనిక్కడే ఉన్నా. తర్వాత జర్మనీ ప్రయాణానికి సిద్ధమవుతున్నా కానీ, అంతరాత్మ మాత్రం స్వామీజీ స్థాపించిన స్కూల్‌ బాధ్యతలు తీసుకోవాలని చెప్పేది. లేకపోతే ఆ పిల్లలు ఏమైపోతారోనన్న ఆలోచన నా మనసుని తొలిచేస్తుండేది. వాస్తవంగా చూస్తే అది సాధ్యం కాదనిపించేది. ఆ మానసిక సంఘర్షణలో చివరకు అంతరాత్మే గెలిచింది. పెళ్లి, పిల్లల్లాంటి బంధాలు లేకపోవడంతో ఆ నిర్ణయం సులభంగా తీసుకోగలిగానేమో. స్కూల్‌ ప్రిన్సిపల్‌తో ఆ విషయమే చెప్పి తొందర్లోనే తిరిగొస్తానన్నా. అక్కడికి వెళ్లి అపార్ట్‌మెంట్‌ ఖాళీ చేశా. అమ్మానాన్నకీ, అన్నయ్యకూ చెబితే మొదట వద్దని.. చివరకు అయిష్టంగానే అంగీకరించారు. అక్కడే దాతల్ని కలిసి నిధులు సమీకరించా. స్కూల్‌కి విరాళం ఇచ్చిన మొదటి వ్యక్తి మా అన్నయ్య హెర్బర్ట్‌. రూ.కోటి సాయం అందించాడు. తర్వాత స్కూల్‌కి మూడు సార్లు వచ్చాడు కూడా. ఇప్పటికీ విరాళాలు పంపిస్తాడు.


ప్రకృతి ఒడిలో పాఠాలు...
జర్మనీ నుంచి మూడు నెలల్లో తిరిగొచ్చా. అన్నాళ్లూ ఇక్కడ టీచర్లకీ, సిబ్బందికీ జీతాల్లేవు. కొంతమంది తమ పిల్లల్ని వేరే స్కూళ్లలో చేర్పించారు. 2006 నవంబరులో కొత్త స్కూల్‌ సొసైటీ ఏర్పాటుచేసి 9.5 ఎకరాల స్థలంలో ‘శాంతి ఆనంద స్కూల్‌’ని ప్రారంభించా. ఎల్‌కేజీ నుంచి ఏడో తరగతి వరకూ ఇంగ్లిష్‌ మీడియంలో పాఠాలు చెబుతాం. నేనూ స్కూల్‌ టీచర్‌ని. హిస్టరీ పాఠాలు చెప్పేదాన్ని. చదువుతోనే పేదల జీవితాల్లో మార్పు తేవచ్చని నమ్ముతా. జర్మనీలో సృజనకూ ప్రాధాన్యం ఇస్తారు. అందుకే పెయింటింగ్‌, డ్యాన్సింగ్‌, సింగింగ్‌ లాంటి అంశాల్నీ నేర్పిస్తుంటాం. మా టీచర్లే ఇవీ నేర్పుతారు. 2008లో అనంతపురంలోని టింబక్టూ కనెక్ట్‌, మదనపల్లె రిషీ వ్యాలీ స్కూళ్లలో బోధనా విధానాల్ని పరిశీలించాం. ప్రకృతిలో భాగమవుతూ నేర్చుకోవడం.. నాతోపాటు టీచర్లకూ నచ్చి మా స్కూల్లో అవలంబించడం మొదలుపెట్టాం. అలా మా స్కూల్‌ పేరులో ‘నేచురల్‌ కాన్సెప్ట్‌’నీ చేర్చాం. ఉదయంపూట వివిధ సబ్జెక్టుల్లో బోధన ఉంటుంది. మధ్యాహ్నం మాత్రం యోగా, కరాటే, క్రీడలు, చిత్రలేఖనం, బొమ్మల తయారీ, అల్లికలు, మొక్కల పెంపకంలో శిక్షణ ఇస్తారు. ఐరోపా నుంచి స్కూల్‌ని సందర్శించడానికి టీచర్లు వస్తుంటారు. వారితో టీచర్లకు ట్రైనింగ్‌, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంటాం. నేను పెయింటింగ్‌ వేస్తా. మా పిల్లలకు పెయింటింగ్‌లో, ఆర్ట్‌లో శిక్షణ ఇస్తా. ఏడాదికోసారి విద్యార్థులు చేసిన బొమ్మలూ, కళాకృతులతో స్కూల్‌ ఆవరణలో ఎగ్జిబిషన్‌నీ నిర్వహిస్తారు. 50 మందితో మొదలైన స్కూల్లో ప్రస్తుతం 180 మంది చదువుతున్నారు. స్కూల్లో అడుగుపెట్టగానే,  ఒకప్పటి గురుకులాల్ని తలపించేట్లు చేశాం. పచ్చదనం నిండిన సువిశాలమైన ప్రాంగణం, మధ్యలో కుటీరాలను తలపించేలా నిర్మించిన తరగతి గదుల్ని తీర్చిదిద్దాం. చాలామంది ఇక్కడ తమ పిల్లల్ని చేర్చడానికి పోటీ పడతారు. కానీ పేద పిల్లలకే అవకాశమిస్తాం. రూపాయి కూడా ఫీజుగా తీసుకోం. క్లాసుకి గరిష్ఠంగా 30 మంది ఉంటారంతే. ఇప్పటివరకూ 600 మంది చదువుకున్నారిక్కడ. నిధుల పరిమితుల దృష్ట్యా పై తరగతులకు వెళ్లడం సాధ్యపడటంలేదు.

పుట్టపర్తిలో కొన్నాళ్లూ, ముదిగుబ్బ స్కూల్లో కొన్నాళ్లూ ఉంటాను. పుట్టపర్తిలో ఎక్కువ సమయం పెయింటింగ్‌ వేస్తూ, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగడానికి యోగా, ధ్యానం సాధన చేస్తా. స్కూల్లో ఉంటే న్యూస్‌ లెటర్స్‌ రాస్తూ దాతలకు పంపుతుంటా. నన్ను ఇక్కడ ‘హెల్గా శాంతి’ అని పిలుస్తారు. మా గురువు గారు పెట్టిన పేరది. స్కూల్‌ పిల్లలతో మాట్లాడుతున్నపుడూ, వాళ్లకి ఏదైనా నేర్పుతున్నపుడూ, ఇక్కడ చదివిన పిల్లలు ప్రయోజకులైన సందర్భంలో వాళ్ల తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూసినపుడు ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. ఇది కదా జీవిత పరమార్థం అనిపిస్తుంది.

- తలారి గోవర్ధన్‌, ముదిగుబ్బ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్