అమెజాన్‌ మా ఖాతాదారు!

ఎన్నో ఆశలతో వ్యాపారం మొదలుపెడితే నష్టం ఎదురైంది. భయపడి ఆగిపోలేదామె. ఈసారి భిన్నంగా ఆలోచించింది. అందరూ వెళ్లేదారిలో కాక కొత్తగా ప్రయత్నించింది. ఆమె నిర్ణయం అంతర్జాతీయ సంస్థతో

Published : 06 Apr 2022 04:24 IST

ఎన్నో ఆశలతో వ్యాపారం మొదలుపెడితే నష్టం ఎదురైంది. భయపడి ఆగిపోలేదామె. ఈసారి భిన్నంగా ఆలోచించింది. అందరూ వెళ్లేదారిలో కాక కొత్తగా ప్రయత్నించింది. ఆమె నిర్ణయం అంతర్జాతీయ సంస్థతో కలిసి వ్యాపారం చేసే అవకాశం కల్పించడమే కాదు.. మరెందరికో ఉపాధినీ అందిస్తోంది. కర్నూలుకు చెందిన వినుకొండ కిరణ్మయి.. ఆమె వ్యాపార ప్రయాణం తన మాటల్లోనే..!

నేను మైక్రోబయాలజీలో డిగ్రీ చేశా. వ్యాపారంపై మొదట్నుంచీ ఆసక్తి. అందుకే పెళ్లయినా దూరవిద్య ద్వారా ఎంబీఏ చదివా. మావారు సుబ్రహ్మణ్యం పోలీసు ఉద్యోగి. మాకిద్దరు పిల్లలు- షణ్విత, నితీశ్‌సాయి. వాళ్లు కాస్త పెద్దయ్యాక వ్యాపారంపై దృష్టిపెట్టా. ఐస్‌క్రీమ్‌ కోన్‌ల తయారీ లాభసాటిగా తోచింది. దీంతో రూ.25లక్షలు బ్యాంకు రుణం తీసుకుని వ్యాపారం ప్రారంభించా. వీటిని అమ్మకందారులు హైదరాబాద్‌, హరియాణా నుంచి ఒకేసారి ఎక్కువగా తెచ్చుకునేవారు. మమ్మల్నీ స్థాయికి మించి ధర తగ్గించమనేవారు. సాధ్యం కాలేదు. ఫలితమే తీవ్ర నష్టం. శ్రమకు తోడు అంత పెద్ద మొత్తం పోయేసరికి చాలా బాధపడ్డా. కానీ దాన్నో పాఠంగా తీసుకోవాలనుకున్నా. దీంతో ఈసారి కాస్త భిన్నంగా ఎవరూ ప్రారంభించని దాన్ని ఎంచుకుందాం అనుకున్నా. నా నిర్ణయం విని ‘ఇప్పటికే ఓసారి నష్టం చూశావు. మరోసారి ఎందుకు? వదిలెయ్‌’ అన్నవారే ఎక్కువ. నాదగ్గర 15-20 మంది పని చేస్తున్నారు. అంటే ఇరవై కుటుంబాలు మా మీద ఆధారపడట్టే కదా! పైగా నష్టమొచ్చినా నన్ను వీడిపోలేదు. నేను వెనకడుగువేసి సంస్థ మూసేస్తే వాళ్ల పరిస్థితేంటన్న ఆలోచన నన్ను తొలచేది. అందుకే ఎవరెన్ని చెప్పినా వినకుండా ముందుకే అడుగేశా. రూ.35 లక్షలతో 2017లో ‘ఎస్వీ ప్యాకింగ్‌ ప్రొడక్ట్స్‌’ పేరుతో అట్టపెట్టెల తయారీని పెదపాడు వద్ద అద్దె భవనంలో ప్రారంభించాం. ఈసారి కుటుంబ పరంగానూ ఆర్థిక ఇబ్బందులొచ్చాయి. మార్కెటింగ్‌ సైతం ఇబ్బందైంది. మరోవైపు ముడిసరకుకు హైదరాబాద్‌కు రావాలి. మేం జీఎస్టీ కట్టి తీసుకొచ్చినా ఇక్కడి వ్యాపారులు దాన్ని కట్టడానికి అయిష్టత చూపేవారు. అవేమీ లేకుండా బిల్లులడిగేవారు. మొదటిసారి నష్టం, సరఫరా చేసినవాటికి త్వరగా బిల్లులు రాకపోవడం.. డబ్బు చేతిలో ఆడేది కాదు. మానసికంగానూ డీలాపడ్డా. ఆ సమయంలో మావారు తోడు నిలిచారు. కొద్దిరోజులు  ఉద్యోగానికి సెలవుపెట్టి మరీ సాయపడ్డారు. తన జీతాన్నీ వ్యాపారం కోసమే ఇచ్చారు. సరిగా అప్పుడే హైదరాబాద్‌ నుంచి ఓ వ్యక్తి ఆర్డర్‌ ఇచ్చారు. ఆయన టిఫిన్‌ ప్లేట్లు తయారు చేసి కర్నూలుకు సరఫరా చేస్తుంటారు. రవాణా భారం పెరగడంతోపాటు సమయానికి పంపలేక మా సాయం కోరారు. ముడిసరకు సైతం ఆయనే ఇచ్చారు. ఆ సమయంలో ఆయన నాకు దేవుడిలా కనిపించారు. అలా ఆర్డర్లను చేసిస్తూ వచ్చిన మొత్తాన్ని అట్టపెట్టెల తయారీకి రొటేషన్‌ చేసుకునేదాన్ని. ముడి సరుకులో నాణ్యత లేక ఆర్డర్లు రద్దయ్యేవి. దీంతో ధర ఎక్కువైనా కర్ణాటకలోని శివమొగ్గ నుంచి తెస్తున్నాం.

అదే.. లక్ష్యం

జస్ట్‌ డయల్‌ వంటి ఆన్‌లైన్‌ సంస్థల సాయాన్నీ తీసుకున్నాం. దీంతో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి పెద్ద సంస్థలు ముందుకొచ్చాయి. మూడేళ్లుగా అమెజాన్‌కు సరఫరా చేస్తున్నాం. దేశీయంగా పలు సంస్థలకు పుట్టగొడుగులు, చీరల పరిశ్రమలు, పండ్ల ఎగుమతులకు కావాల్సిన పెట్టెలను అందిస్తున్నాం. మా అట్టపెట్టెల్లో పండ్లు కూరగాయలు ఇతర రాష్ట్రాలు, దేశాలకూ ఎగుమతి చేస్తుంటారు. ఏపీఐఐసీ పారిశ్రామిక కారిడార్‌ కల్లూరులో ప్లాటు కేటాయించగా సొంత భవనం కట్టుకొని ఇక్కడికి వ్యాపారం మార్చాం. కొంత మంది పెట్టెలపై లోగో, పేర్లు అడుగుతుండటంతో వాటినీ ముద్రిస్తున్నాం. ప్రతి నెలా 25 టన్నుల వరకూ అందిస్తున్నాం. ఏటా దాదాపు రూ. కోటికిపైగా వ్యాపారం చేస్తున్నాం. ‘మహిళతో వ్యాపారమా? తనకేం తెలుసు? ఈమెతో బేరాలా?’ అనేవారు. సూపర్‌వైజర్లతోనే మాట్లాడేవారు. కొందరు డబ్బులూ ఎగ్గొట్టారు. సమాధానమూ ఇచ్చేవారు కాదు. అందుకే డబ్బులిస్తేనే సరకు అని చెబుతున్నా. చాలామంది దీనికి ఒప్పుకునేవారు కాదు. అయినా కొనసాగిస్తున్నా. ప్రస్తుతం ఇరవై మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తున్నా. అందరూ కూలీలే. కొవిడ్‌ కారణంగా సంస్థ మూతపడితే చాలామందికి రోజు గడవడమే కష్టమైంది. అందుకే వాళ్లకి శాశ్వత ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. పరిశ్రమనీ విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నా. పిల్లలూ, వ్యాపారం రెండూ కష్టమయ్యేది. కానీ వాళ్లూ నన్ను అర్థం చేసుకుని ప్రోత్సహించేవారు. ఉన్నతవిద్య కోసం ఇప్పుడు హాస్టల్లో చేరారు. దీంతో మరింత సమయం వ్యాపారానికే కేటాయిస్తున్నా. నష్టమొచ్చిందని ఆగిపోకూడదు. ఓటమే గెలుపు పాఠాల్ని నేర్పిస్తుంది. ఇది నా స్వానుభవం కూడా. ఒడుదొడుకులొచ్చినా తట్టుకుని నిలబడగలగాలి.

- యడ్లపాటి బసవ సురేంద్ర, కర్నూలు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్