పోయింది కాళ్లే... ఆత్మస్థైర్యం కాదు

ఇటీవల కేరళలో జరిగిన 23వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో వేదికపైకి వచ్చిన ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె మాత్రం నవ్వుతూ ‘నడిచి వచ్చి’ మరీ పురస్కారాన్ని అందుకొంది.

Updated : 06 Apr 2022 01:29 IST

ఇటీవల కేరళలో జరిగిన 23వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో వేదికపైకి వచ్చిన ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె మాత్రం నవ్వుతూ ‘నడిచి వచ్చి’ మరీ పురస్కారాన్ని అందుకొంది. స్ఫూర్తిదాయక ప్రసంగాన్నీ ఇచ్చింది. తనే టర్కీకి చెందిన చిత్ర నిర్మాత, దర్శకురాలు, సామాజిక ఉద్యమకారిణి లిసా కెలాన్‌. తీవ్రవాదుల దాడిలో రెండు కాళ్లనూ కోల్పోయినా... తమ జాతిపై ప్రభుత్వ వివక్షకు, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోన్న ఓ యోధురాలు ఆవిడ...

ది 2015, జూన్‌ 5. టర్కీలో మరో రెండు రోజుల్లో ఎన్నికలు. పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ ర్యాలీలో లిసా పాల్గొంది. అంతలో పెద్ద శబ్దం. ఏం జరిగిందో అర్థమయ్యే లోపే ఎక్కడి వారక్కడ చెల్లా చెదురుగా పడిపోయారు. అక్కడ జరిగిన ఐసిస్‌ బాంబు దాడిలో అయిదుగురు ప్రాణాలొదలగా వందల మంది గాయపడ్డారు. స్పృహ కోల్పోయిన లిసాకు మెలకువ వచ్చేసరికి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉంది. మోకాళ్ల కింద నుంచి రెండు కాళ్లను తొలగించకపోతే ప్రాణానికే ముప్పు అన్నారు వైద్యులు. అసలింతకీ లిసా ఎవరంటే...

వివక్షకు..

టర్కీలో కుర్దిష్‌ కుటుంబంలో పుట్టింది లిసా. ఈ జాతి పట్ల అక్కడ వివక్షెక్కువ. వీరు మాతృభాషలో చదవకూడదు. చిన్నప్పటి నుంచి అలాంటి వివ్క్షŸల మధ్య పెరిగిన ఈమె, తమ జాతి హక్కుల కోసం పోరాడాలనుకుంది. తన చదువు అయ్యాక కుర్దిష్‌ ప్రజల సమస్యలను ప్రపంచానికి చాటి చెప్పడానికి సినిమాను మాధ్యమంగా ఎంచుకుంది. డెమొక్రటిక్‌ పార్టీ కార్యకలాపాల్లోనూ పాలుపంచుకునేది. సామాజిక సమస్యలపైనా పోరాడేది. మహిళలు, చిన్నారుల హక్కులు, తమ మాతృభాష పరిరక్షణ, అందరికీ సమాన విద్య వంటి అంశాలపై కృషి చేస్తోందీమె.

అలా ర్యాలీలో పాల్గొన్నప్పుడే బాంబుదాడికి గురయ్యింది. కాళ్లు తొలగించడంతో పాటు తనకు ఎన్నో శస్త్రచికిత్సలు జరిగాయి. వీటన్నింటికీ పెద్ద మొత్తంలో ఖర్చయ్యింది. అదంతా భరించే స్థితిలో తను లేదు. ఇందుకోసం పలువురు సినీ ప్రముఖులు ‘లెట్స్‌ బి ఆర్మ్స్‌ అండ్‌ లెగ్స్‌ టు ఈచ్‌ అదర్‌’ పేరుతో ప్రచారం చేసి నిధులను సేకరించి లిసాకు వైద్యసాయం అందించారు. ‘చికిత్స తర్వాత మానసికంగా తీవ్ర కుంగుబాటుకు గురయ్యా. కోలుకోడానికి మూడేళ్లు పట్టింది. పోయింది కాళ్లే... కానీ అంతకన్నా దయనీయ స్థితిలో చాలా మంది ఉండటాన్ని గమనించాను. బాంబు దాడుల్లో నాలా ఏళ్ల తరబడి మంచాల్లో జీవితాలను గడుపుతున్న వారి ఇబ్బందులు, వేదన నాకు స్వయంగా అనుభవంలోకి వచ్చాయి. ఈ బాధను ప్రపంచానికి చెప్పాలనే పట్టుదల పెరిగింది. పలువురు నిర్మాతలతో ఆలోచనలను పంచుకునేదాన్ని. దర్శకులతో చర్చించే దాన్ని. అలా ‘గుప్తన్‌’ చిత్రంలో నటించా. ‘ద వాయిస్‌ ఆఫ్‌ ద స్ట్రీట్‌’ లఘుచిత్రానికి ఎడిటర్‌గా చేశా. ‘నిసాయిబిన్‌ కలర్‌’ చిత్రానికి సహాయ దర్శకురాలిగా వ్యవహరించా. ఓ వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) సినిమాకు దర్శకత్వం వహించా. సామాజిక అంశాలపై అవగాహన కలిగించడానికి తీసిన ‘ద టంగ్‌ ఆఫ్‌ మౌంటెయిన్స్‌’ లఘుచిత్రం కేరళలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శనకు అర్హత సాధించింది. ప్రముఖుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం ‘స్పిరిట్‌ ఆఫ్‌ సినిమా’ పురస్కారాన్ని అందుకుంది. త్వరలో బాంబుదాడిపై డాక్యుమెంటరీ రూపొందించనున్నా. నా జీవిత చరిత్రను  తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నా’ అంటుందీమె.  

నిరాకరించి...

బాంబు దాడిలో మృతిచెందిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఇప్పటివరకు ప్రభుత్వం పరిహారం ఇవ్వ లేదు. తనకు పరిహారంగా టర్కీ ప్రభుత్వం ఇస్తానన్న 1.6 మిలియన్లు (రూ.12 కోట్లు) నగదును లిసా నిరాకరించింది. రెట్టింపు ఖర్చు అయినప్పుడు ఇదెలా అంగీకరించగలను అనే లిసా తనలాంటి వారందరికీ పరిహారం ఇప్పించడానికి ప్రభుత్వంతో చట్టపరంగా పోరాడుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్