అంధకారం నుంచి వెలుగులోకి...

అప్పటివరకు ప్రకృతి వర్ణాలన్నీ ఆమెకు నేస్తాలే. సంతోషమే చిరునామాగా, తోటి వారినీ ఉత్సాహంగా ఉంచే ఆమెకు చదువు, ఉద్యోగం, హాబీలు, సరదాలంటూ కాలమే తెలియలేదు. అంతలోనే  ఊహించని ఓ కుదుపు. అకస్మాత్తుగా ఆమె ప్రపంచం చీకటైపోయింది. కానీ అక్కడే ఆగిపోకుండా

Published : 08 Apr 2022 00:54 IST

 పాయల్‌

అప్పటివరకు ప్రకృతి వర్ణాలన్నీ ఆమెకు నేస్తాలే. సంతోషమే చిరునామాగా, తోటి వారినీ ఉత్సాహంగా ఉంచే ఆమెకు చదువు, ఉద్యోగం, హాబీలు, సరదాలంటూ కాలమే తెలియలేదు. అంతలోనే  ఊహించని ఓ కుదుపు. అకస్మాత్తుగా ఆమె ప్రపంచం చీకటైపోయింది. కానీ అక్కడే ఆగిపోకుండా... తిరిగి పుట్టిందామె. జీవితాన్ని మొదటి నుంచి ప్రారంభించింది. పాక శాస్త్రంపై పట్టు తెచ్చుకొని యూట్యూబ్‌ ఛానల్‌ మొదలు పెట్టింది. ఎందరికో ఉపాధి కల్పిస్తోంది. ప్రముఖ వేదికలపై స్ఫూర్తి ప్రసంగాలిచ్చే స్థాయికి ఎదిగింది. 50 ఏళ్ల పాయల్‌ కపూర్‌ ఇవన్నీ ఎలా సాధించిందో తెలుసుకుందాం.

పాయల్‌ 22 ఏళ్లకే హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఒబెరాయ్‌ గ్రూపులో ఉద్యోగం చేసేది. సంగీతం, డ్యాన్స్‌ అంటూ తన అభిరుచులకు తగ్గట్లు సమయాన్ని ఉత్సాహంగా, సంతోషంగా గడిపేది. ఓ రోజు ఆఫీస్‌లో ఉండగా నలతగా అనిపించింది. ఆసుపత్రికెళ్తే సీజనల్‌ ఫీవర్‌ అని ఇంజెక్షన్‌ చేశారు. నాలుగురోజులకి ఎడమ కన్ను చూపు కోల్పోయింది. కంటిలో ఇన్ఫెక్షన్‌... దాంతో, తీవ్ర నొప్పి మొదలయ్యాయి. నేత్రవైద్యులకు చూపిస్తే ఎన్నో పరీక్షలు చేశారు. నెల రోజులు ఆసుపత్రిలోనే ఉంది. కానీ వ్యాధి కారణాన్ని గుర్తించలేకపోయారు. అంతలో రెండో కన్నూ పని చేయడం మానేసింది. సొంతూరు ముంబయిలో ఎన్నో ఆసుపత్రులు తిప్పారామె తల్లిదండ్రులు. సీఎస్సెఫ్‌ ప్రెషర్‌, మొదట్లోనే దీన్ని గుర్తించకపోవడం అంధత్వానికి దారి తీసిందన్నారు. వినికిడి శక్తి కూడా దూరమైంది. పాయల్‌ జీవితంలో ఒక్కసారిగా చీకట్లు ఆవరించాయి.

అరచేతిలో...

అమ్మానాన్న, బంధువులు, స్నేహితులు తనతో ఏం చెప్పాలన్నా అరచేతిలో వేళ్లతో అక్షరాలు రాసేవారని గుర్తు చేసుకుంటుంది పాయల్‌. ‘అప్పటి వరకు రంగులమయంగా ఉన్న ప్రపంచం చీకటిగా మారిపోయింది. తీవ్ర కుంగుబాటుకు గురయ్యా. అలా ఏడు నెలలు గడిచాయి. గది నుంచి బయటికి రావాలనిపించేది కాదు. ఒక రోజు ఏదో పక్షి అరుపు వినిపించింది. చెప్పలేనంత సంతోషం కలిగింది. కనీసం చెవులు పనిచేస్తున్నాయని. అలా క్రమేపీ కుడి చెవి మాత్రం పనిచేస్తోందని గుర్తించా. జీవితాన్ని మళ్లీ మొదలు పెట్టాలని చెప్పింది అమ్మ. నా పనులు నేను చేసుకోవడం, పాత్రలు శుభ్రం చేయడం నుంచి కూరగాయలు కోయడం, వంట చేయడం వరకు అన్నీ నేర్పింది. ఇంట్లో ఏయే వస్తువులు ఎంత దూరంలో ఉంటాయో చెప్పింది. కొత్తలో అలవాటు కొద్దీ వేగంగా అడుగువేసి ఎన్నో సార్లు తలకు దెబ్బలు తగిలించుకున్నా. అలా ప్రతి పనీ మళ్లీ కొత్తగా నేర్చుకున్నా. నాలో తిరిగి ఆత్మవిశ్వాసం మొదలైంది. చూపు ఒక్కటే కాదు.. జీవితంలో ఇంకా చాలా ఉన్నాయని అర్థమైంది. ఓ ఎన్జీవోలో రిసోర్స్‌ పర్సన్‌గా బాధ్యతలను తీసుకున్నా. నాలాంటి వారికి మెంటర్‌గా మారా. మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నా. దురదృష్టవశాత్తూ ఎనిమిదేళ్లకే మా బంధం తెగిపోయింది. సొంతంగా ‘రసోయీ కా రహస్య’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా ప్రారంభించా. నాలాంటి వారు వంçËలెలా చేసుకోవాలో ఇందులో చెబుతున్నా. సంగీత వాయిద్యాలు వాయించడం, కథలు రాయడం, టెడెక్స్‌ వంటి వేదికలపై ప్రసంగించడమూ చేస్తుంటా. అంటోన్న పాయల్‌ ఎన్జీవో ద్వారా అంధులకు ఉపాధిని అందించడానికి చేస్తున్న కృషికిగాను  నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫ్‌ ద డిజేబుల్డ్‌ పీపుల్‌ ప్రత్యేక పురస్కారాన్ని అందించి గౌరవించింది. ‘ఊహించని ఎదురు దెబ్బలెన్నో తగులుతుంటాయి. వాటన్నింటినీ దాటి ముందుకు సాగడమే అసలైన జీవితం అని అందరికీ చెబుతుంటా’ అంటోన్న పాయల్‌ స్ఫూర్తిప్రదాత అనడంలో సందేహం లేదు.
 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్