ఈమె కడితే... ఐక్యరాజ్యసమితి మెచ్చుకుంది

ఆకాశాన్ని తాకే భవనాలు అభివృద్ధి సూచికల్లా అనిపించొచ్చు.. కానీ వాటి నిర్మాణంలో వాడే పదార్థాల వల్ల జరిగే కాలుష్యం పర్యావరణాన్ని వినాశం దిశగా నడిపిస్తోందంటున్నారు తృప్తి దోషి. ఇందుకు పరిష్కారంగా ఆమె ఎంచుకున్న మార్గం, నిర్మించిన భవనాలు ఆధునిక తరం ఆర్కిటెక్ట్‌లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి...

Updated : 09 Apr 2022 06:09 IST

ఆకాశాన్ని తాకే భవనాలు అభివృద్ధి సూచికల్లా అనిపించొచ్చు.. కానీ వాటి నిర్మాణంలో వాడే పదార్థాల వల్ల జరిగే కాలుష్యం పర్యావరణాన్ని వినాశం దిశగా నడిపిస్తోందంటున్నారు తృప్తి దోషి. ఇందుకు పరిష్కారంగా ఆమె ఎంచుకున్న మార్గం, నిర్మించిన భవనాలు ఆధునిక తరం ఆర్కిటెక్ట్‌లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి...

వెర్నాక్యులర్‌ ఆర్కిటెక్చర్‌’... ఆర్కిటెక్చర్‌ విద్యార్థులకు ఈ అధ్యాయం మార్కులని ఇస్తుందేమో కానీ, భవిష్యత్తులో పెద్దగా ఆదాయాన్ని ఇవ్వదు. అందుకే చాలామంది దీనిపై దృష్టేపెట్టరు. కానీ ఈ ఇదే అధ్యాయం ముంబయిలో ఆర్కిటెక్చర్‌ చదువుతున్న తృప్తి దోషిని పూర్తిగా మార్చేసింది. ‘మనం పోటీలు పడి కట్టే బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాల్లో వాడే పదార్థాలు పర్యావరణానికి ఎంత హానిచేస్తున్నాయో తెలిసినరోజు నా మనసంతా చేదుగా అయిపోయింది. అవును మరి... సారవంతమైన, పంటలు పండించే మట్టిని కాల్చి నిర్వీర్యం చేసి ఇటుకలు చేస్తున్నాం. కానీ ఆ మట్టిని తయారు చేసుకోవడానికి భూమికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. రెండో కాలుష్య కారకం... రీయిన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌. దేశంలో నిర్మాణాలన్నీ దీంతోనే. మన దేశ కర్బన ఉద్గారాల్లో ఈ నిర్మాణాల వాటా 22 శాతం. ఇంత విధ్వంసం చేసిన మనం ప్రస్తుతానికైతే హాయిగా ఉండగలమేమోకానీ తర్వాత తరాలు మనల్ని క్షమించవు. అందుకే వెర్నాక్యులర్‌ ఆర్కిటెక్చర్‌పై దృష్టి పెట్టాను. ఇదేమీ రాకెట్‌ సైన్స్‌ కాదు. కాంక్రీట్‌, సిమెంట్‌ లేనప్పుడు మన పూర్వీకులు సున్నం, మట్టి, కలప, బండలు, రాళ్లు వంటి వాటితో నిర్మించే వారు కదా! అదే. కాకపోతే ఆధునిక అవసరాలకు తగినట్టు మార్పులు చేస్తాం’ అంటారు తృప్తి. ఈ నిర్మాణాల గురించి తెలుసుకోవడానికి తను దేశమంతా తిరిగారు. ‘తమిళనాడులో 82 ఏళ్ల ఒకపెద్దాయనకి చెట్టినాడు నిర్మాణశైలి గురించి తెలుసని విని వెళ్లి, ఆ కిటుకులు తెలుసుకున్నా. ధర్మశాలలో ఉంటున్న దీదీ కాంట్రాక్టర్‌ గురించీ తెలిసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇక్కడ స్థిరపడ్డ దీదీ విదేశాల్లో ఆర్కిటెక్చర్‌ చదువుకున్నారు. కానీ  హిమాలయాలకు ఏమాత్రం హాని జరగకుండా మన పూర్వీకులు అనుసరించిన నిర్మాణశైలి ఆమెని ఇక్కడే ఉండేలా చేసింది. ప్రస్తుతం ఆ తరహా ఇళ్లను నిర్మించేది ఆమె ఒక్కరే. కేరళలోని బైజూ, మార్క్‌మురేలాంటి వాళ్లని చూశాక స్థానిక నిర్మాణశైలికి ఆధునిక హంగులు అద్దడం ఎలానో అర్థమైంది’ అంటారు తృప్తి.

వాన నీటితో...  ‘కనుచూపుమేరంతా బీడువారిన నేలలే. భయంకరమైన వేడి, ఉక్క. ఇలాంటి ప్రాంతంలోనే తమిళనాడులోని ఆరోవిల్లే స్వచ్ఛంద సంస్థకి శరణం రూరల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ని నిర్మించాల్సి వచ్చింది. స్టీల్‌, సిమెంట్‌, ఇటుకల వాడకాన్ని బాగా తగ్గించి... మట్టితో ఈ నిర్మాణాన్ని పూర్తిచేశాను. ఈ ప్రాజెక్టు మొదలుపెట్టేనాటికి మా దగ్గర ఈ నిర్మాణ నైపుణ్యాలు తెలిసిన వారు చాలా తక్కువ. అది పూర్తయ్యే సమయానికి 300 మంది స్థానికులకు శిక్షణ ఇచ్చాం. వాననీటిని ఒడిసిపట్టి ఆ నీటినే దాని కోసం వాడాం. 4,500 చదరపు అడుగుల స్లాబ్‌ వేయడానికి కేవలం 33 సిమెంట్‌ బస్తాలని మాత్రమే వాడాం’ అనే తృప్తి కష్టానికి తగిన ఫలితం కూడా దక్కింది. యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాల్‌మెంటల్‌ ప్రోగ్రామ్‌ సంస్థ ఈ నిర్మాణాన్ని గుర్తించి భావినిర్మాణాలకు స్ఫూర్తిగా చూపించింది. ఈ ఆత్మవిశ్వాసంతో అరోమా గ్రూప్‌ని ప్రారంభించారు తృప్తి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యావరణ హిత నిర్మాణాలు చేపడుతున్నారు. ఫ్రెంచ్‌ నిర్మాణశైలిలో... అరోవిల్లేలో నిర్మించిన అరోమా ఫ్రెంచ్‌ విలామెంట్స్‌ ప్రాజెక్ట్‌ ఆమె సృష్టించిన మరో అద్భుతంగా పేరుతెచ్చుకుంది.

కాలుష్యాన్ని తగ్గించేందుకు: స్లాబ్‌లు, గోడల నిర్మాణం కోసం తృప్తి వ్యర్థాలని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ- వేస్ట్‌ అంటే పనికిరాని కీబోర్డులు, మౌస్‌లతో పాటు కొబ్బరిచిప్పలు, పాత సీడీలు, గాజు సీసాలు, ఖాళీ టెట్రాప్యాక్‌లు, చాక్లెట్‌ రేపర్లని ఉపయోగిస్తున్నారు. అలాగే... పరిశ్రమల నుంచి వెలువడే బూడిదతో ఇటుకలు చేసి, నిర్మాణాల్లో ఉపయోగిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్