కేంద్రం మెచ్చిన పరిశోధనామణులు!

ఎన్నో సమస్యలు... మరెన్నో సవాళ్లు అవి మనల్ని వెనక్కిలాగుతుంటే పరిష్కారాల్ని ఆలోచించి మన దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఎంతోమంది శాస్త్రవేత్తలు. వారిలో 50 ఏళ్లలోపున్న 75 మంది మేటి శాస్త్రవేత్తల్ని కేంద్ర ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం గుర్తించి గౌరవించింది. వారిలో స్థానం దక్కించుకున్నారు విద్య, సోనా... తల్లిని కోల్పోయి అనాథగా మిగిలిన ఏనుగు పిల్లని ఆడ ఏనుగులు అలాగే వదిలేయవు. తమ గుంపులోకి ఆహ్వానించి దాన్ని అక్కున చేర్చుకుంటాయి. కానీ ఇలా చేయడం మగ ఏనుగులకి సుతరామూ నచ్చదు.

Updated : 12 Apr 2022 01:29 IST

ఎన్నో సమస్యలు... మరెన్నో సవాళ్లు అవి మనల్ని వెనక్కిలాగుతుంటే పరిష్కారాల్ని ఆలోచించి మన దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఎంతోమంది శాస్త్రవేత్తలు. వారిలో 50 ఏళ్లలోపున్న 75 మంది మేటి శాస్త్రవేత్తల్ని కేంద్ర ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం గుర్తించి గౌరవించింది. వారిలో స్థానం దక్కించుకున్నారు విద్య, సోనా...


ఆ ఏనుగుల కోసం..

ల్లిని కోల్పోయి అనాథగా మిగిలిన ఏనుగు పిల్లని ఆడ ఏనుగులు అలాగే వదిలేయవు. తమ గుంపులోకి ఆహ్వానించి దాన్ని అక్కున చేర్చుకుంటాయి. కానీ ఇలా చేయడం మగ ఏనుగులకి సుతరామూ నచ్చదు. అవి ఆ గుంపు నుంచి బయటకు వెళ్లిపోతాయి. ‘పోతేపోనీ...పిల్లలే ముఖ్యం’ అనుకుంటాయి ఆడ ఏనుగులు. ఏంటీ ఏనుగుల గోల అనుకుంటున్నారా? ‘మనుషులకి ప్రత్యేకమైన అలవాట్లు ఉన్నట్టుగానే ప్రతి జీవికి ఉంటాయి. ఆ అలవాట్లను బట్టే వాటి మనుగడ కూడా ఆధారపడి ఉంటుంది. తక్కిన జంతువుల్లా కాకుండా వీటికి ఎక్కువ స్థలం కావాలి కాబట్టే అప్పుడప్పుడూ ఊర్లలోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తుంటాయి’ అంటారు విద్య. ఆసియా ఏనుగుల అలవాట్లపైన సుదీర్ఘకాలం  పరిశోధనలు చేసిన విద్య ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులనీ సొంతం చేసుకున్నారు. తొమ్మిదో తరగతిలో పక్షి శాస్త్రవేత్త సలీంఅలీ గురించి విన్న నాటి నుంచీ విద్య కూడా తన జీవితాన్ని జంతువుల కోసమే అంకితం చేయాలనుకున్నారు. కర్ణాటకలోని నాగర్‌హోల్‌, బందీపుర్‌ టైగర్‌ రిజర్వ్‌లో కబిని ఎలిఫెంట్‌ ప్రాజెక్ట్‌ని మొదలుపెట్టి వందల ఏనుగుల అలవాట్లని లోతుగా పరిశీలించి వాటి సంతతిని కాపాడటానికి అవసరమైన విలువైన డేటాని సేకరించారు. ఆసియా ఏనుగులపై సుదీర్ఘకాలం పరిశోధనలు జరిపిన మొదటి ప్రాజెక్ట్‌ కూడా ఇదే. విద్య స్వస్థలం చెన్నై. ఆమె తల్లి కమలా రంగరాజన్‌ బ్యాంకు క్లర్క్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ కూతురి చదువుకి సహకరించారు. తండ్రి రంగరాజన్‌ హైకోర్టు జడ్జి. డిగ్రీలో ఆల్‌రౌండర్‌గా బంగారుపతకాన్ని అందుకున్న విద్య హైదరాబాద్‌లోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజీలోనూ కొంతకాలం చదువుకున్నారు. ఆ తర్వాత ఐఐఎస్‌సీ బెంగళూరులో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీలో చేరి మైనా, ఏనుగుల్లాంటి జంతువుల అలవాట్లపై పరిశోధనలు చేశారు. బెంగళూరులోని ది జవహర్‌లాల్‌నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో చేరి.. రామానుజన్‌ ఫెలోషిప్‌ అందుకున్నారు. ఆ ఫెలోషిప్‌ సాయంతోనే కబిని ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టారు. ఈమె పరిశోధనల ఆధారంగా కర్ణాటక ప్రభుత్వం తగ్గిపోతున్న ఏనుగులని కాపాడే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ కృషికి ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ ఇచ్చే యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డుని అందుకున్న విద్యకి పిల్లలకి సైన్స్‌ని అర్థమయ్యేలా బోధించడం అంటే ఇష్టం. ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రచురించే జర్నల్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌కి ఎడిటర్‌గానూ వ్యవహరిస్తున్నారు.


పోషకాహారం.. అందించాలని!

శాకాహారులకు కూడా పోషకాహారలోపం రాకుండా మాంసకృత్తులని అందించే సరైన ప్రత్యామ్నాయం ఏంటి? మనదేశంలో రోజురోజుకీ పెరుగుతున్న మాల్‌న్యూట్రిషన్‌ సమస్యకు చెక్‌ పెట్టేదెలా?.. ఈ రెండింటికీ సమాధానం.. ప్రత్యేక పోషకాలతో రూపొందిస్తున్న సోయాగింజలే అంటారు ప్లాంట్‌ బయాలజీ సైంటిస్ట్‌ డాక్టర్‌ హ్యూమిరా సోనా. శ్రీనగర్‌లో పుట్టిపెరిగిన ఆమె చిన్నతనమంతా దాల్‌ సరస్సు ఒడ్డునే సాగింది. రాయ్‌పుర్‌లోని ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీలో పీజీ చేసి.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ బయోటెక్నాలజీలో ఉద్యోగం సంపాదించారామె. వరిలో వచ్చే పొడ తెగులుకు కారణం అయిన జన్యువుల గుట్టు తెలుసుకున్నాక... మరో అడుగు ముందుకు వేసేందుకు కెనడాలోని లావల్‌ యూనివర్సిటీలో చేరారు. అక్కడే ఆమె వివిధ పంటల్లో వచ్చే వ్యాధులు, అందుకు సంబంధించిన జన్యువుల గురించే కాక ఆ జన్యుపరివర్తనపై కూడా పరిశోధనలు చేసి పంట దిగుబడులు పెంచేందుకు కృషి చేశారు. ఈమె ప్రతిభను గమనించిన మిస్సోరీ యూనివర్సిటీ... సోయాపంట జరుగుతున్న పరిశోధనల్లో పాల్గొనాల్సిందిగా కోరింది. ప్రస్తుతం మన భారతీయుల ఆహారంలో వరి, గోధుమలు మాదిరిగానే సోయాని కూడా ఒక ప్రధాన ఆహారవనరుగా మార్చడంతోపాటు దాని పోషకవిలువలనీ మరింత పెంచి తక్కువ ధరలో వీటిని అందించేందుకు ఈమె కృషి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సేకరించిన 400 రకాల సోయాగింజల్లో కొన్ని మార్పులు చేసి వాటిని భారతీయ ఆహారానికి అనుకూలంగా మార్చేందుకు కృషిచేస్తున్నారు. వ్యవసాయరంగంలో ఆమె కృషికిగానూ కేంద్రప్రభుత్వం నుంచి రిసెర్చ్‌ ఎక్స్‌లెన్స్‌తోపాటు, రామలింగస్వామి అవార్డునీ అందుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్