అమ్మయినా ఆగక్కర్లేదు!

మాతృత్వం... మహిళల జీవితంలో అపూర్వమైన ఘట్టం. దానికోసం ఎన్నో కలలు కంటారు. అమ్మ అయ్యాక మాత్రం శారీరకంగా, మానసికంగా బలహీనపడ్డామని కెరియర్‌ కొనసాగించడానికి సంకోచిస్తారు.

Updated : 15 Apr 2022 01:59 IST

మాతృత్వం... మహిళల జీవితంలో అపూర్వమైన ఘట్టం. దానికోసం ఎన్నో కలలు కంటారు. అమ్మ అయ్యాక మాత్రం శారీరకంగా, మానసికంగా బలహీనపడ్డామని కెరియర్‌ కొనసాగించడానికి సంకోచిస్తారు. కానీ అమ్మతనం కలలు నెరవేర్చుకోవడానికి అడ్డంకి కాదంటున్నారు ఈ క్రీడామణులు. అనడమే కాద, కఠోర సాధనతో విజయాలు సాధిస్తూ యువతరం అమ్మలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

నాలుగింటి నుంచే ప్రాక్టీసు

గత అక్టోబరులో కవలలకు జన్మనిచ్చిన ప్రముఖ స్క్వాష్‌ క్రీడాకారిణి దీపిక... ఆపైన రెండు నెలలకే శిక్షణ ప్రారంభించింది. తాజాగా గ్లాస్గో వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు గెలిచింది. ఆఖరిసారిగా ఈమె   2018లో ఆడింది. కొన్నాళ్లపాటు 10-20 ర్యాంకుల మధ్య నిలవడంతో అక్కడే ఆగిపోయానన్న అసంతృప్తితోపాటు, పెళ్లి కారణంగా ఆటకు దూరంగా ఉంది. వ్యాపారం చేసినా ఆమెకు తృప్తిలేదు. తిరిగి కోర్టులో అడుగు పెట్టాలనుకునేసరికి కొవిడ్‌, ఆపైన గాయం, తల్లి కావడంతో వాయిదా పడుతూ వచ్చింది. పిల్లలు పుట్టాక ఆట కొనసాగిస్తానని చెబితే... ‘నీవల్ల అవుతుందా’ అని కొందరు సందేహించినా ధైర్యంగా ముందడుగు వేసింది. ‘ఉదయం మూడింటికే లేచి పిల్లలిద్దరికీ పాలిచ్చి నిద్రపుచ్చి నాలుగింటికి కోర్టులో ఉండేదాన్ని. కోర్టులో తిరిగి కాలు పెట్టినపుడు ఇది కదా నేనుండాల్సిన చోటు అనిపించింది’ అని చెబుతుంది దీపిక. తను వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌కి ఎంపికైనపుడే... క్రికెటర్‌, భర్త దినేశ్‌ కార్తీక్‌ ఐపీఎల్‌ కోసం వెళ్లాడు. ‘అత్తమామలూ, అమ్మానాన్నా, స్నేహితురాలు పిల్లల్ని చూసుకుంటామని భరోసా ఇచ్చారు. వాళ్లు నామీద చూపిన ప్రేమ, నమ్మకం చూసి ఎలాగైనా పతకాలు గెలవాలనుకున్నా’ అని తాను సిద్ధమైన తీరుని గుర్తుచేసుకుంటుంది. ‘కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలిచి పతకాల పట్టికలో భారత్‌ను ఉన్నత స్థానంలో నిలపాలన్నది నా లక్ష్యం’ అంటోంది 30 ఏళ్ల దీపిక.


ఎనిమిది నెలల్లో ఒక్కసారే!

అక్క... అనేది జిల్నా ఫొటోని చూసి ఆమె కూతురు. కేరళకు చెందిన 24 ఏళ్ల జిల్నాని ఆమె కూతురు ఎనిమిది నెలల్లో ఒక్కసారే చూసింది మరి. పాపకి పది నెలలపుడు భర్త, అత్తయ్యల దగ్గర వదిలి కొల్లాంలో ఆమె శిక్షణ తీసుకోగా, అక్కడికి ఏడుగంటల ప్రయాణ దూరంలో ఉన్న పాలక్కడ్‌లో ఉండేది పాప. ఒక్కరోజులో వెళ్లి చూసి రావొచ్చు కానీ అలా చేస్తే శిక్షణ గాడి తప్పుతుందని భావించింది. తన కష్టం ఊరకే పోలేదు. ఇటీవలి కాలికట్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో కెరియర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసి 100మీటర్ల దూరాన్ని 11.63 సెకన్లలో చేరుకుంది. ఈమె కంటే స్టార్‌ అథ్లెట్‌ ద్యుతీచంద్‌ మాత్రమే ముందుంది. ‘సీమా సురక్షా బల్‌’లో కానిస్టేబుల్‌ అయిన జిల్నా బిడ్డకు జన్మనిచ్చాక ఎనిమిది కిలోలు బరువుతగ్గి కర్రలా తయారైంది. కండరాలూ పట్టు కోల్పోయాయి. ఇక ట్రాక్‌లో అడుగుపెట్టడం కష్టమే అనుకుంది. ‘బిడ్డ పుట్టిన ఆరు నెలలకు ట్రాక్‌లో అడుగుపెడితే సాధారణ ప్రాక్టీసుకీ కాళ్లు సహకరించలేదు. ఇక పరుగు కష్టమేనేమో అనుకున్నా. ఎలాగైతేనేం మెల్లగా పుంజుకున్నా. అంతర్‌ రాష్ట్ర పోటీలకోసం మళ్లీ కొల్లాంలో ప్రాక్టీసు చేస్తున్నా. కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో అర్హత సాధించడానికి ఇంకా మెరుగుపడాలి. మునుపటి లయ అందుకున్నాను కాబట్టి లక్ష్యాన్ని చేరతాననే అనుకుంటున్నా’ అని చెబుతోంది జిల్నా.


కలలు నిజం చేసుకోవాల్సిందే!

2018 అక్టోబరులో తల్లి అయిన సానియా మీర్జా తర్వాత ఆరు నెలలకే టెన్నిస్‌ రాకెట్‌ పట్టి.. 2020 జనవరిలో హోబార్ట్‌ ఇంటర్నేషనల్‌ డబుల్స్‌ టైటిల్‌ గెల్చింది. కొవిడ్‌ కారణంగా ఓ ఏడాది ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చినా గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచిన 35 ఏళ్ల సానియా తనలో ఆడే సత్తా ఇంకా ఉందంటోంది. ‘తల్లి అయ్యాక బాగా బరువు పెరిగాను. దాంతో ఇంకాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తోంది. ఫిట్‌నెస్‌ లేకుండా అత్యున్నత స్థాయిలో రాణించలేం’ అని చెప్పే సానియా తాజాగా అమెరికాలో జరిగిన చార్ల్స్‌టన్‌ ఓపెన్‌లో డబుల్స్‌ రన్నరప్‌గా నిలిచింది. జనవరిలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో క్వార్టర్స్‌ వరకూ వెళ్లింది. గెలుపోటములు సంగతి పక్కనపెడితే 100 శాతం ప్రదర్శన ఇవ్వగలుగు తున్నానంటోంది. ‘విమర్శకుల గురించి నేనస్సలు పట్టించుకోను. కానీ యువ తల్లులూ, తల్లి కాబోతున్నవాళ్లకి మాత్రం ఒకటే చెబుతాను. మనసు పెట్టి పనిచేస్తే ఏదీ మిమ్మల్ని ఆపలేదు. తల్లి అయినంత మాత్రాన మీ కలల్ని చంపుకోవాల్సిన పనిలేదు’ అంటోంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్