పాటతో.. చెట్టుకి ప్రాణం పోస్తున్నారు!

పాటలతో... పచ్చని చెట్టుని బతికించాలని చూస్తున్నారామె! చెట్లపై రాసిన పాటలకు బాణీలుకట్టి భవిష్యత్‌ తరాల మనసుల్లో ‘పర్యావరణ ప్రేమ’ను నాటుతున్నారు వద్దిరాజు నివేదిత. ఆ ప్రయత్నాలు

Published : 16 Apr 2022 00:23 IST

పాటలతో... పచ్చని చెట్టుని బతికించాలని చూస్తున్నారామె! చెట్లపై రాసిన పాటలకు బాణీలుకట్టి భవిష్యత్‌ తరాల మనసుల్లో ‘పర్యావరణ ప్రేమ’ను నాటుతున్నారు వద్దిరాజు నివేదిత. ఆ ప్రయత్నాలు ఎంతవరకూ సఫలమయ్యాయో చూద్దాం..

తెలంగాణ రాష్ట్రం హనుమ కొండలోని ప్రభుత్వ సంగీత పాఠశాలలో ఉపాధ్యాయురాలు నివేదిత. సుమారు వెయ్యి మంది శిష్యులను తీర్చిదిద్దిన ఈమె... పాటనే ఆయుధంగా చేసుకుని పిల్లల్లో పర్యావరణంపై ప్రేమను పెంచాలనుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమం కోసం చెట్లపై రాసిన 30 పాటలకు బాణీలు కట్టి పిల్లలకు నేర్పించారు. ‘వృక్షో రక్షతి రక్షితః’ అంటూ ఆమె నేర్పిన పాటతో దిల్లీలో జరిగిన జాతీయ పోటీల్లో మొదటి బహుమతిని గెలుచుకున్నారు ఆమె విద్యార్థులు. ‘చిన్నతనం నుంచీ సంగీతమంటే ఇష్టం. నాన్న ప్రోత్సాహంతో ముందడుగు వేశాను. వరంగల్‌ విద్యారణ్య సంగీత నృత్య కళాశాలలో సంగీతంలో డిప్లొమా చేశాక ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చింది. నా దగ్గర నేర్చుకున్న ఎంతోమంది సంగీత ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. వాళ్లందరికీ నేను చెప్పేదొకటే. పాట ద్వారా పర్యావరణాన్ని బతికించమని’ అంటారు నివేదిత. 

పద్యాలు పాడే పుస్తకాలు...
తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ రెండేళ్లుగా తెలుగు పద్యాలను డిజిటల్‌ పుస్తకాల రూపంలోకి మారుస్తోంది. ఇందులో భాగంగా వివిధ శతకాల్లోని పద్యాలను రాగయుక్తంగా ఉపాధ్యాయులతో పాడిస్తూ ఎస్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్లో ఉంచుతోంది. వీటిల్లో కుమార శతకం పద్యాలకి నివేదిత బాణీలు కట్టి, కొన్నింటిని పాడారు. ఈ పద్యాలను విదేశాల్లో ఉన్న తెలుగు వారూ పిల్లలకు నేర్పుతూ సంతోషిస్తున్నారు. పద్యాల ప్రాజెక్టు విజయవంతం కావడంతో పాఠాలను కూడా ఇలానే రాగయుక్తంగా వినిపించే ప్రయత్నం చేస్తోంది ఎస్‌సీఈఆర్‌టీ. ‘రెండు, ఆరో తరగతికి పాఠాలకు బాణీలు కట్టి పద్యాలుగా ఆలపించాను. రంగురంగుల పూలు, ఏనుగమ్మ ఏనుగు, వానా వానా వల్లప్పతోపాటు...సుద్దాల హనుమంతు రాసిన ‘పల్లెటూరి పిల్లగాడా’ పాటకీ బాణీలు కట్టి పాడాను. ఇవన్నీ త్వరలో వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి’ అంటున్నారు నివేదిత.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్