బరువు తగ్గడానికెళ్లి.. ప్రపంచ ఛాంపియన్‌ అయ్యింది!

వివాహమై ఆమె ఓ బిడ్డకు తల్లైంది. ప్రసవం తర్వాత పెరిగిన అధిక బరువును తగ్గించుకోవడానికి జిమ్‌లో చేరింది. అదే ఆమెను అంతర్జాతీయస్థాయి క్రీడాకారిణిగా మార్చింది. కెటిల్‌బెల్‌ క్రీడలో స్వర్ణపతకాన్ని సాధించిన తొలి మహిళగా, ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ప్రధాని ప్రశంసలను సైతం అందుకుంది. ఆమెనే 40 ఏళ్ల శివానీ అగర్వాల్‌. ఆమె స్ఫూర్తి కథనమిదీ..

Updated : 17 Apr 2022 02:28 IST

వివాహమై ఆమె ఓ బిడ్డకు తల్లైంది. ప్రసవం తర్వాత పెరిగిన అధిక బరువును తగ్గించుకోవడానికి జిమ్‌లో చేరింది. అదే ఆమెను అంతర్జాతీయస్థాయి క్రీడాకారిణిగా మార్చింది. కెటిల్‌బెల్‌ క్రీడలో స్వర్ణపతకాన్ని సాధించిన తొలి మహిళగా, ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ప్రధాని ప్రశంసలను సైతం అందుకుంది. ఆమెనే 40 ఏళ్ల శివానీ అగర్వాల్‌. ఆమె స్ఫూర్తి కథనమిదీ..

ఉద్యోగినిగా, భార్యగా, ఓ బిడ్డకు తల్లిగా, కుటుంబాన్ని చూసుకుంటూ ఉండే శివానీ అగర్వాల్‌ తాను ప్రపంచ రికార్డు నెలకొల్పుతానని కలలో కూడా ఊహించలేదు. కోల్‌కతాకు చెందిన శివానీ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌. మయాంక్‌ అగర్వాల్‌తో వివాహమైన రెండేళ్లకు బాబు పుట్టాడు. అప్పటివరకు సొంతంగా కెరీర్‌ చూసుకుంటూ బాబు సంరక్షణ, ఇంటి బాధ్యతలను చూసుకునేదామె. ప్రసవం తర్వాత అకస్మాత్తుగా బరువు పెరగడంతో జిమ్‌కు వెళ్లాల్సి వచ్చింది. అలా 2016లో మొదటిసారి జిమ్‌లోకి అడుగుపెట్టిన శివానీ.. మొక్కుబడిగా వ్యాయామాలు చేసేది. ఎంతోకొంత బరువు తగ్గితే చాలనుకుంది. అలా ఆమెకు కెటిల్‌ బెల్‌తో వర్కౌట్లు చేయడం అలవాటైంది. క్రమంగా దానిపై ఆసక్తి పెంచుకుంది.

ఇంటిని, ఆరునెలల పిల్లాడిని చూసుకుంటూ జిమ్‌కు రోజూ వెళ్లడానికి తొలుత శివానీ ఇబ్బంది పడేదట. ‘మావారు ఉద్యోగరీత్యా ఎక్కువగా బయట తిరగాల్సి వచ్చేది. కెటిల్‌బెల్‌ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నా ఇంట్లో బాధ్యతలు నన్ను సమయం ఉండేలా చేసేవి కావు. అలా కొన్ని వారాలు గడిచిన తర్వాత ఓరోజు జిమ్‌లో మెంటర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. నా ఆసక్తిని గుర్తించిన ఆయన ఇంటికొచ్చి శిక్షణనిస్తా అని చెప్పగానే ఎగిరి గంతేయాలనిపించింది. బరువు తగ్గడానికి చేసే వ్యాయామాల్లో ఇది కూడా ఓ భాగమని అనుకునేదాన్ని. ఆ తర్వాతే తెలిసింది.. ఇది కూడా ఓ క్రీడ అని! ఇందులో పోటీలు కూడా జరుగుతాయని తెలిసి మరింత ఆసక్తి పెరిగింది. అలా కొన్ని నెలలు శిక్షణ తీసుకొని, 2017లో ఆసియన్‌ ఛాంపియన్‌షిప్‌కు మన దేశం తరఫున పాల్గొనే అవకాశాన్ని దక్కించుకోవడమే కాదు.. ఛాంపియన్‌షిప్‌నూ గెలుచుకున్నా. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన పోటీల్లో ఛాంపియన్‌షిప్‌ అందుకున్నా. గతేడాది చివర్లో ఫ్రాన్స్‌లో జరిగిన కెటిల్‌బెల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో స్వర్ణపతకాన్ని అందుకున్న తొలి మహిళాక్రీడాకారిణిగా నిలిచా. ఇది నాకు హ్యాట్రిక్‌. గత నెల 28న ప్రధాని నుంచి లేఖ రూపంలో ప్రశంసలు అందుకోవడం మరవలేను. దేశం తరఫున మహిళగా నేను సాధించిన విజయాన్ని ఆయన కొనియాడారు. ఈ క్రీడలో అధిక బరువునెత్తాల్సి ఉంటుంది. గత పోటీల్లో 16 కేజీల కెటిల్‌బెల్‌తో అరగంటసేపు 369 సార్లు రిపిటేషన్స్‌ చేసి గెలిచా. బరువు తగ్గడానికి వెళ్లి అంతర్జాతీయస్థాయిలో దేశం గర్వపడేలా నిలిచిన నేను.. మరికొందరి మహిళలకు స్ఫూర్తిగా మారినందుకు సంతోషంగా ఉంది. వయసు, బాధ్యతలకన్నా లక్ష్యం బలమైంది. ఇబ్బందులెన్నెదురైనా అనుకున్నది సాధించగల సత్తా మహిళలందరిలో ఉంటుందని నమ్ముతా’ అని చెబుతోంది శివానీ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్