స్విగ్గీకి దారి చూపిస్తోంది!

ఫుడ్‌ డెలివరీ వ్యాపారం అంటే... కాలంతో పోటీ. రెస్టరెంట్‌ నుంచి డెలివరీ పాయింట్‌కి సులువైన, దగ్గరి మార్గాన్ని ఎంచుకోవడంతోనే ఆ పోటీలో విజయం సాధ్యమయ్యేది. అందుకు మ్యాప్‌లు ఎంతో కీలకం. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీకి ఈ మ్యాప్‌లు రూపొందిస్తున్నారు ప్రజ్ఞ. ఈమె ఆ సంస్థ ఇంజినీరింగ్‌ విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌ కూడా.

Updated : 18 Apr 2022 03:42 IST

ఫుడ్‌ డెలివరీ వ్యాపారం అంటే... కాలంతో పోటీ. రెస్టరెంట్‌ నుంచి డెలివరీ పాయింట్‌కి సులువైన, దగ్గరి మార్గాన్ని ఎంచుకోవడంతోనే ఆ పోటీలో విజయం సాధ్యమయ్యేది. అందుకు మ్యాప్‌లు ఎంతో కీలకం. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీకి ఈ మ్యాప్‌లు రూపొందిస్తున్నారు ప్రజ్ఞ. ఈమె ఆ సంస్థ ఇంజినీరింగ్‌ విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌ కూడా.

మహిళలు టెక్నాలజీ రంగంలో ముందుకు వెళ్లాలంటే కొత్త సాంకేతికతలు నేర్చుకోవాలి. అవకాశాల్ని అందిపుచ్చుకుని ఎదగడానికి ప్రయత్నించాలి. సమయాన్ని పెట్టుబడిగా పెట్టి కష్టపడితేనే విజయం.

సేవల్ని మెరుగుపర్చుకోవడంలో భాగంగా ఫుడ్‌ డెలివరీ సమయాన్ని తగ్గించడానికి కొత్తమార్గాల్ని అన్వేషిస్తుంటుంది స్విగ్గీ. అందుకోసం కచ్చితమైన మ్యాప్‌లను అభివృద్ధి చేసుకోవాలని గ్రహించి.. ప్రజ్ఞా కర్బారిని సంప్రదించింది. మూడేళ్ల కిందట ఆ బాధ్యతల్ని స్వీకరించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు ప్రజ్ఞ. అక్కడవరకూ చేరడానికి ఆమె కెరియర్‌లో ఎన్నో మలుపులూ, సవాళ్లూ.

గూగుల్‌తో మొదలు... ప్రజ్ఞ పుట్టిపెరిగింది ముంబయిలో. పైచదువుల కోసం 1998లో అమెరికా వెళ్లి అట్లాంటాలోని జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో కంప్యూటర్‌ సైన్స్‌లో ఎం.ఎస్‌., పీహెచ్‌డీ చేశారు. ఆ క్రమంలోనే కంటెంట్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌పై పరిశోధనలు చేశారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న క్లౌడ్‌ కంప్యూటింగ్‌కు మూలమిది. పీహెచ్‌డీ పూర్తవగానే అమెరికాలోనే గూగుల్‌లో చేరారు ప్రజ్ఞ. డేటా నిల్వచేసే కేంద్రం, పంపిణీ కేంద్రాల మధ్య లోడ్‌ బ్యాలెన్సింగ్‌ను గమనిస్తూ అవి సజావుగా పనిచేసేలా చూడటం ఈమె విధులు. తన చొరవ చూసి స్వల్ప వ్యవధిలోనే గూగుల్‌ సర్వర్లని చూసే బాధ్యతనీ అప్పగించారు. ‘ఇదో సవాల్లాంటిది. అప్పట్లో సర్చ్‌, యాడ్స్‌, జీమెయిల్‌... ఇవన్నీ ఆ సర్వర్‌ ద్వారానే నడిచేవి. ఓరోజు లంచ్‌కి వెళ్లి వచ్చేలోపే వ్యవస్థ క్రాష్‌ అయ్యింది. చాలావరకు సర్వీసులు నిల్చిపోవడంతో బాగా కంగారుపడ్డాను. నా టీమ్‌ లీడర్‌ ముందుకొచ్చి బ్యాకప్‌ డేటాతో సమస్యని పరిష్కరించారు. ఎంత ముఖ్యమైనదైనా పనిలో పొరపాట్లు జరగడం సహజం. దాని గురించి కంగారు పడకుండా ఎంత త్వరగా పరిష్కరిస్తామనేది ముఖ్యం. ఆ అనుభవం ద్వారా నేర్చుకున్న పాఠమది’ అని కెరియర్‌లో తొలి రోజుల్ని గుర్తుచేసుకుంటారు ప్రజ్ఞ. 2009లో బెంగళూరు గూగుల్‌ శాఖకు మారి ఆర్కుట్‌, ప్రాంతీయ భాషల్లో సర్చింగ్‌, మ్యాప్స్‌ మొదలైనవాటిపైన పనిచేశారు. ఈ సేవలకు ‘గూగుల్‌ ఫౌండర్స్‌ అవార్డు’(2010) అందుకున్నారు.

సొంత కంపెనీతో... అంకుర సంస్థల విప్లవం మొదలయ్యాక వ్యాపారవేత్తగా మారాలనుకుని 2014లో గూగుల్‌ నుంచి బయటకు వచ్చేశారు ప్రజ్ఞ. ఆమె భర్త చెన్నైలో ఉండేవారు. ఆగ్మెంటెండ్‌ రియాలిటీ విభాగాన్ని ఎంచుకుని గూగుల్‌లో పనిచేసిన మిత్రుడు సహ వ్యవస్థాపకుడిగా చెన్నైలోనే ‘పాయింట్‌105-ఏఆర్‌’ను మొదలుపెట్టారు. యాప్‌నీ తెచ్చారు. ‘ఇంజినీర్‌గా ఉద్యోగం చేయడానికి, సొంతంగా వ్యాపారం చేయడానికి చాలా తేడాలున్నాయి. మాది మంచి ఉత్పత్తే కానీ, మార్కెట్‌ని సృష్టించుకోలేకపోయాం. మూడేళ్లపాటు(2019) యాప్‌ను నడిపాక కూడా ఆపేయడం మంచిదనిపించింది. అప్పుడే స్విగ్గీ నుంచి పిలుపు వచ్చింది. హైపర్‌ లోకల్‌ మ్యాప్‌లు తయారుచేయాలన్నది వారి ప్రతిపాదన. చెన్నైలోనే ఇంజినీరింగ్‌ విభాగాన్ని ఏర్పాటుచేసి, నాయకత్వ బాధ్యతలు తీసుకోమన్నారు. మంచి అవకాశంగా అనిపించి చేరా’ అని చెబుతారు ప్రజ్ఞ.

క్షేత్రస్థాయికెళ్లి... స్వయానా వినియోగదారుడికీ, డెలివరీబాయ్‌కీ ఎదురయ్యే ఇబ్బందుల్ని గమనించడానికి క్షేత్రస్థాయికి వెళ్లి మ్యాపింగ్‌లో మార్పులు తెచ్చారు ప్రజ్ఞ. ‘కెరియర్‌ మొదట్నుంచీ కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడు సులువుగా, వీలైనంత తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకోవడం గురించి ఆలోచించేదాన్ని. గూగుల్‌ మ్యాప్స్‌ అనుభవమూ ఉంది. స్విగ్గీ సేవల్ని ఎక్కడికక్కడ కొంత పరిధిలోనే అందిస్తుంటాం. అందుకే నగరాల్ని జోన్లుగా విభజించి, వాటిలోని వీధుల్ని, అపార్ట్‌మెంట్లనీ, ఇళ్లనీ మ్యాపింగ్‌చేశాం. కచ్చితత్వం కోసం జీపీఎస్‌, ఇతర సాంకేతికతల్ని వాడాం. దీనికోసం ‘లొకేషన్‌ ఇంటెలిజెన్స్‌’ వ్యవస్థను నెలకొల్పాం. డెలివరీ బాయ్‌ అపార్ట్‌మెంట్‌కి చేరడం వరకే కాదు, ఆపైన బైక్‌ ఎక్కడ పార్క్‌ చేయాలి. అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లడానికి లిఫ్ట్‌కి ఎలా వెళ్తే దగ్గరవుతుంది... లాంటివీ మ్యాప్‌లో ఉంటాయి. దీనివల్ల వారి పని వేగంగా, తేలిగ్గా పూర్తవుతుంది’ అంటారు ప్రజ్ఞ. దీంతో డెలివరీలు అందించడంలో స్విగ్గీ వేగం పెరిగిందని చెబుతారామె. ఈ రంగంలో కొత్తగా అడుగుపెట్టే మహిళలకు మార్గనిర్దేశం చేస్తుంటారు కూడా.

- హిదాయతుల్లాహ్‌. బి,  చెన్నై

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్