ఆమెకు సేవే వారసత్వం!

పసిపిల్లలకి పుస్తకాలు పంచేటప్పుడు... వాళ్లలో ఒకరిగా కలిసిపోతారామె. వృద్ధాశ్రమాల్లోని పెద్దవాళ్లని కలిసినప్పుడు సాయం చేయడానికి పెద్దమనసుతో ముందుకొస్తారు. సేవ చేయడానికి స్పందించే మనసు కావాలి కానీ వయసుతో పనేంటి అంటారు ప్రమీలమ్మ..

Published : 19 Apr 2022 01:59 IST

పసిపిల్లలకి పుస్తకాలు పంచేటప్పుడు... వాళ్లలో ఒకరిగా కలిసిపోతారామె. వృద్ధాశ్రమాల్లోని పెద్దవాళ్లని కలిసినప్పుడు సాయం చేయడానికి పెద్దమనసుతో ముందుకొస్తారు. సేవ చేయడానికి స్పందించే మనసు కావాలి కానీ వయసుతో పనేంటి అంటారు ప్రమీలమ్మ..

ర్త చనిపోయాక తనలో ఏర్పడిన శూన్యాన్ని సేవతో భర్తీచేయాలనుకున్నారు ప్రమీలమ్మ. 77 ఏళ్లవయసులో అనాథలు, అభాగ్యులకు అండగా ఉంటూ తన సేవాలక్ష్యాలను రోజురోజుకూ విస్తరించుకుంటూ వయసుని తగ్గించుకొంటున్నారీమె. ప్రమీలమ్మది నెల్లూరు జిల్లా. సామాన్య రైతు కుటుంబం. చిన్నవయసులోనే తండ్రిని కోల్పోవడంతో అమ్మమ్మ ఇంట్లోనే పెరిగారామె. అమ్మమ్మ, అమ్మ నుంచి సాయం చేసే గుణాన్ని వారసత్వంగా తీసుకున్న ప్రమీలమ్మ ఇంట్లో దాచుకోమని ఇచ్చిన డబ్బుతో పేద పిల్లలకు ఫీజు కట్టి, పుస్తకాలు, దుస్తులు కొనిపెట్టేవారు. డిగ్రీ చదువుతుండగానే వివాహం అయింది. భర్త ఏజీ శ్రీనివాసరెడ్డి 70ల్లో రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యదర్శిగా పని చేశారు. ఆయన కూడా సేవాభావం కలిగినవారే. అనంతపురం శివారు గ్రామాల్లో పేదలకు ఇళ్లు నిర్మించి, పొలాల్లో బోర్లు వేయించి పంటల సాగుకు సహకరించారు. 2013లో ఆయన చనిపోయిన తర్వాత ప్రమీలమ్మ తన జీవితాన్ని పూర్తిగా సేవకే కేటాయించారు.

అనాథలకు.. విద్యార్థులకు తోడ్పాటు..  భర్త ఆశయాలే తోడుగా సేవాప్రస్థానాన్ని మొదలుపెట్టారు ప్రమీలమ్మ. ఇందుకోసం 2014లో ఏజీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ని స్థాపించారు. మొదట్లో అనాథాశ్రమాలకు వెళ్లేవారు.  అక్కడ కనీస  సదుపాయాలు లేకపోవడం చూసి బాధపడ్డారు. ఆశ్రమాలకు అవసరమైన అదనపు గదులు, టాయిలెట్లు నిర్మించి, నీటి కోసం బోర్లు వేయించారు. ఇలా నగర పరిధిలో పది ఆశ్రమాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం ఆర్థిక సాయం అందించారు. నెలలో ఒక ఆశ్రమాన్ని ఎన్నుకుని అక్కడుండే అనాథలను, వృద్ధులను స్వయంగా కలుసుకునేవారు. వారితో రోజంతా  గడుపుతారు. వాళ్లకి కావాల్సిన నిత్యావసరాలనీ, వైద్యసేవల్నీ అందిస్తారు. 2016 నుంచి ఏటా అనంతపురం, శివారుల్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాల పిల్లలకు పుస్తకాలు, దుస్తులు, బ్యాగులు, లైబ్రరీల్లోకి కావాల్సిన పుస్తకాలు అందిస్తున్నారు.

కొవిడ్‌ వేళ..అండగా.. కొవిడ్‌ మొదటి, రెండో వేవ్‌ సమయాల్లో లక్షన్నర మంది ఆకలి తీర్చారు. ఐదుగురు మనుషుల్ని పెట్టుకుని ఇంటి దగ్గరే వండించి ఆసుపత్రులకు పంపించేవారు. వైద్యులకు, మున్సిపల్‌ సిబ్బందికి ఎన్‌-95 మాస్కులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, సర్జికల్‌ గ్లవుజులు, శానిటైజర్లను అందించారు. ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోతున్న వారిని చూసి చలించిపోయి యాభై ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను కొనుగోలుచేసి రోగులకు ఇంటికే ఆక్సిజన్‌ సిలిండర్లు పంపి ప్రాణాలు కాపాడారు.

నెలకి రెండులక్షలతో... హెచ్‌ఐవీ వంటి వ్యాధులు సోకి...సరైన పోషకాహారం అందక మృత్యువుతో పోరాడుతున్నవారిని బతికించేందుకు ప్రతినెలా పోషకాహారం అందిస్తున్నారు. జొన్నలు, రాగి పిండి, బెల్లం, శనగలు, చిక్కీలు, ఎండు ఫలాలు ఇలా ఏడు రకాల పోషకాలు కలిగిన సరకులను ప్రతినెలా 250 మందికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం నెలకు రూ.2లక్షలు ఖర్చుపెడుతున్నారు. ప్రమీలమ్మకు ఇద్దరు పిల్లలు. కుమార్తె విదేశాల్లో ఉండగా.. కుమారుడు ఏజీ అనిల్‌కుమార్‌ సేవారంగంలో ఉన్నారు. ‘డిస్కవర్‌ అనంతపురం’ పేరుతో ఆయన నడుపుతున్న పేజీలో ఎవరైనా సాయం కోరితే ఆయన సేవాబృందం వెళ్లి పరిశీలించి అవసరం అయిన వారికి సాయం అందిస్తున్నారు.  

- సి. నల్లప్ప, అనంతపురం


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాం, సిగ్నల్‌ల ద్వారా పంపవచ్చు. ఈ నంబరు కంప్యూటర్‌తో అనుసంధానమై ఉంటుంది. అందువల్ల ఇది సందేశాలకు మాత్రమేనని గమనించగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్