అనాథలకు.. పుట్టినిల్లు!

వాళ్లింట్లో ఇద్దరు పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు... ముగ్గురు ఎమ్‌ఎస్‌ చదువుతున్నారు. మరో 69 మంది ఆడపిల్లలూ ఆ దారిలోనే ఉన్నారు. అబ్బో అంత పెద్ద కుటుంబమా వాళ్లది అంటారా? అవును మరి, కాకపోతే రక్తసంబంధమేలేదు. ఏ అండాలేని ఆడపిల్లలని...ఏ తోడూ లేని ఒంటరి మహిళలని చేరదీసి

Published : 21 Apr 2022 05:51 IST

వాళ్లింట్లో ఇద్దరు పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు... ముగ్గురు ఎమ్‌ఎస్‌ చదువుతున్నారు. మరో 69 మంది ఆడపిల్లలూ ఆ దారిలోనే ఉన్నారు. అబ్బో అంత పెద్ద కుటుంబమా వాళ్లది అంటారా? అవును మరి, కాకపోతే రక్తసంబంధమేలేదు. ఏ అండాలేని ఆడపిల్లలని...ఏ తోడూ లేని ఒంటరి మహిళలని చేరదీసి.. నీడనిచ్చి, నేనున్నానని భరోసానిచ్చే మమతల వనం. ఆ నీడ పేరు సెంటర్‌ ఫర్‌ సోషల్‌ సర్వీసెస్‌. ఆ నీడను ఇస్తోన్న అమ్మ వేమూరి విజయలక్ష్మి...

విజయలక్ష్మి

అమ్మానాన్న ఉంటే ఆ ఇంటి ఆడపిల్లని ఎంతో ముద్దు చేస్తారు. బాగా చదివించాలనీ, విదేశాలకి పంపించాలనీ, ఘనంగా పెళ్లిచేసి అత్తారింటికి పంపాలనీ ఎన్నెన్నో కలలు కంటారు. మరి.. అనాథల సంగతి? అలాంటి వారికోసమే 2004లో ‘సెంటర్‌ ఫర్‌ సోషల్‌ సర్వీసెస్‌’ను ప్రారంభించారు విజయలక్ష్మి. తల్లిదండ్రులు వదిలేసిన లేదా వాళ్లు చనిపోయి అనాథలైన ఆడపిల్లలకు రక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఐదుగురు అమ్మాయిలతో హైదరాబాదులోని నాగోలులో సొంతింట్లోనే సీఎస్‌ఎస్‌ని మొదలుపెట్టారు. రెండేళ్ల తర్వాత ఆర్‌.జానకి, టి.ప్రమీల వంటివారు ఈ సంస్థలో భాగస్వాములై సంస్థని ముందుకు నడిపించారు. క్రమంగా పిల్లల సంఖ్య వందకు పెరగడంతో ఆ ఇల్లు సరిపోలేదు. మరో ఇంటిని అద్దెకు తీసుకున్నా, సౌకర్యంగా అనిపించలేదు. దాంతో హయత్‌నగర్‌ సమీపంలోని మునగనూరు వద్ద స్థలం కొని దాతల సాయంతో భవనం నిర్మించారు. ‘ఆ భవనాన్ని కట్టేటప్పుడు కూలి పనికి పెద్దవాళ్లతో పాటు పిల్లలూ రావడం గమనించా. వీళ్లకి చదువు చెప్పాలనిపించింది. వాళ్లతోపాటు మా ఆశ్రమంలో ఉన్న పిల్లలు, చుట్టుపక్కల గ్రామాల్లోని ఆడపిల్లల కోసం ఆంగ్ల మాధ్యమ పాఠశాలని ప్రారంభించా. దాన్ని పదో తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేసుకుంటూ వచ్చాం. కంప్యూటర్‌, కోడింగ్‌ నైపుణ్యాలు నేర్పిస్తున్నాం. 22 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. మా ఆశ్రమంలో 269 మంది ఆశ్రయం పొందారు. వీళ్లలో 200 మంది పెద్ద చదువులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కొందరికి మేమే పెళ్లిళ్లు చేసి పంపించాం. ఇద్దరు పిల్లలను అమెరికా పంపించాం. మరో ముగ్గురు ఎంఎస్‌  చదువుతున్నారు. ప్రస్తుతం 69 మంది బాలికలు ఆశ్రమంలో ఉండి చదువుకుంటున్నారు. మా పాఠశాలలో 550 మంది చదువుకుంటున్నారు. కార్పొరేట్‌ పాఠశాలలకు తగ్గకుండా... ఏడో తరగతి నుంచే కెరీర్‌ గైడెన్స్‌ ఇస్తున్నాం’ అనే విజయలక్ష్మి ఒక్కో బాలికపైనా ఏడాదికి రూ.15వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఆశ్రమంలో ఉండే వారికోసం రూ.30 వేలకుపైగా ఖర్చు చేస్తున్నారు. ఇదంతా ఎందరో దాతలు విరాళాలు అందివ్వడంతోనే సాధ్యమైందంటారావిడ వినమ్రంగా.

ఒంటరి మహిళలకు స్వయంశక్తి...
సమాజంలో ఒంటరి మహిళల పరిస్థితి దయనీయంగా ఉండటం గమనించిన విజయలక్ష్మి వారికోసం 2010లో స్వయంశక్తి పేరిట ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టారు. ఇందులో వారికి టైలరింగ్‌, ఫ్యాబ్రిక్‌, మగ్గంవర్క్‌, పెయింటింగ్‌, ఆర్టిఫిషియల్‌ జ్యుయెలరీ, కొవ్వొత్తులు, ఫినాయిల్‌ తయారీ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకూ 200 మందికి శిక్షణ ఇచ్చి సొంతకాళ్లపై నిలబడేలా చేశారు. ఈ ప్రాజెక్టుకి నిధులు సమకూర్చడంతోపాటు శిక్షణ కార్యక్రమాలకు అనువుగా ఉండేలా కొండాపూర్‌లోని నాలుగు అంతస్థుల భవనాన్ని నిర్మించి, సర్వీసు అపార్టుమెంట్‌గా మలిచారు. ఒక అంతస్థులో సేంద్రియ ఉత్పత్తులు, క్యాటరింగ్‌, కర్రీ పాయింట్‌, బొటిక్‌ వంటివి నడుపుతున్నారు. వీటి నిర్వహణంతా మహిళలే చూసుకుంటారు. వచ్చిన ఆదాయాన్ని స్వయంశక్తి ప్రాజెక్టుకు వినియోగిస్తారు. మిగిలిన మూడు అంతస్థులనీ అద్దెకు ఇచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి సమావేశాలు, ఇతరత్రా కార్యక్రమాల కోసం నగరానికి వచ్చే మహిళలు రుసుము చెల్లించి ఈ సర్వీసు అపార్టుమెంట్‌లో ఉండొచ్చు. ఈ ప్రాజెక్టు కోసం
vjpvision.com వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్నారు. ‘మా ఆశ్రమంలో ఉండే పిల్లలు ఉద్యోగాలు, వీసాలు, ఇంటర్వ్యూల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో అనే ఆందోళన ఉండేది. ఆ సమస్య మరే ఆడపిల్లకూ రాకూడదనే ఈ సర్వీసు అపార్టుమెంట్‌ సేవలు అందిస్తున్నాం. కేవలం దుస్తులతో వస్తే చాలు. మా అపార్టుమెంట్‌లో తక్కిన సామగ్రి అంతా ఉంటుంది. హోటళ్లలోనో, బంధువుల ఇళ్లలోనో ఉండి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మా సేవలు వినియోగించుకోవచ్చు. వారు చెల్లించే ఛార్జీలు ఒంటరి మహిళల స్వయం ఉపాధికి ఆసరాగా ఉంటాయి’’ అని చెబుతారు విజయలక్ష్మి.

- యార్లగడ్డ అమరేంద్ర, హైదరాబాద్‌



 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్