నెలా నెలా... ప్రకృతిపై ప్రేమతో!

మనం శుభ్రంగా ఉంటే సరిపోదు.. ప్రకృతిని కూడా శుభ్రంగా ఉంచాలని నమ్ముతున్నారు సిద్దిపేట మహిళలు. అనడమే కాదు నెలసరుల కారణంగా వస్తున్న చెత్త నివారణకు ‘రుతుప్రేమ’ పేరుతో వినూత్నమైన పరిష్కార మార్గాన్ని ఎంచుకున్నారు. మహిళలందరికీ స్ఫూర్తిదాయకమైన

Published : 22 Apr 2022 00:33 IST

మనం శుభ్రంగా ఉంటే సరిపోదు.. ప్రకృతిని కూడా శుభ్రంగా ఉంచాలని నమ్ముతున్నారు సిద్దిపేట మహిళలు. అనడమే కాదు నెలసరుల కారణంగా వస్తున్న చెత్త నివారణకు ‘రుతుప్రేమ’ పేరుతో వినూత్నమైన పరిష్కార మార్గాన్ని ఎంచుకున్నారు. మహిళలందరికీ స్ఫూర్తిదాయకమైన ఆ మార్గం గురించి మనమూ తెలుసుకుందాం..

నెలసరి సమయంలో పరిశుభ్రంగా ఉండేందుకు శానిటరీ నాప్కిన్లు వినియోగిస్తాం. అవి ఆరోగ్యానికి మంచివే. కానీ వాటి కారణంగా ఏర్పడే టన్నుల కొద్దీ చెత్తను, కాలుష్యాన్ని నివారించడం ఎలా? ఈ సమస్యకు పరిష్కారంగా సిద్దిపేట మహిళలు ఓ చక్కని మార్గాన్ని ఆచరించి చూపిస్తున్నారు. వీళ్లంతా సిలికాన్‌ కప్పులు, వస్త్రంతో చేసిన నాప్కిన్లు వినియోగిస్తూ ఇటు వ్యక్తిగత ఆరోగ్యాన్నీ, అటు పర్యావరణాన్నీ కాపాడుకుంటున్నారు. ఖర్చునీ తగ్గించుకుంటున్నారు. ఇదంతా ఎలా మొదలైందంటే...

పునర్వియోగానికి ఓటు...
తడి, పొడి చెత్తలను విడిగా సేకరిస్తూ.. వ్యర్థాల నిర్వహణలో శెభాష్‌ అనిపించుకుంటూ వస్తోంది సిద్దిపేట బల్దియా. ఈ క్రమంలో తడి, పొడిచెత్త కాకుండా మూడోరకం అయిన హానికర చెత్త వీళ్లకో సవాల్‌గా మారింది. ముఖ్యంగా శానిటరీ ప్యాడ్‌లు, పిల్లల డైపర్లను ఏం చేయాలన్న దానికి సరైన పరిష్కారం దొరకలేదు. ఇవి భూమిలో కలసిపోవాలంటే వందల ఏళ్లు సమయం పడుతుంది. కాల్చడం వల్లా హానికారక వాయువులు విడుదల అవుతాయి. మంత్రి హరీశ్‌రావు, బెంగళూరుకు చెందిన పర్యావరణవేత్త డా. శాంతి నేతృత్వంలోని బృందం పునర్వినియోగానికి అనువుగా ఉండే డైపర్లు, నాప్కిన్లే ఇందుకు సరైన పరిష్కారం అనే నిర్ణయానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి ‘రుతు ప్రేమ’ అనే పేరు పెట్టారు.

నెలసరులపై బహిరంగ చర్చ...
చాలామంది గట్టిగా మాట్లాడ్డానికే సిగ్గుపడే ఈ విషయంపై సిద్దిపేట మహిళలు ఈ నెల 6వ తేదీన ఏకంగా బహిరంగ సభనే నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఐదో వార్డు నుంచి ఈ మార్పునకు శ్రీకారం చుట్టారు. ముందుగా అంగన్‌వాడీ టీచర్ల సాయంతో ఇక్కడ ఓ సర్వేని నిర్వహించి నెలసరి సమయంలో వాళ్లు అనుసరిస్తున్న శుభ్రతా విధానాల గురించి తెలుసుకున్నారు.

ఆ తర్వాతే వస్త్రంతో తయారు చేసిన ప్యాడ్లు, మెడికల్‌ గ్రేడ్‌ సిలికాన్‌ కప్స్‌, శిశువులకు వస్త్రంతో తయారు చేసిన డైపర్లని పరిచయం చేసింది రుతుప్రేమ బృందం. సిలికాన్‌ కప్పులని నాప్కిన్లు కొన్నట్టుగా మళ్లీమళ్లీ కొనాల్సిన అవసరం లేదు. ఒక కప్పుని 8 నుంచి 10 ఏళ్ల వరకూ వాడుకోవచ్చు. ఖర్చు కూడా తగ్గుతుంది. ఏడాదికి రూ.1200 ఆదా చేయొచ్చు. వీటిని అమర్చుకొనే విధానంపైనా ప్రత్యేక శిక్షణ అందించింది రుతు ప్రేమ బృందం. అవగాహనతోపాటు 1200 సిలికాన్‌ కప్పులు, 300 మంది యువతులకి వస్త్రంతో చేసిన నాప్కిన్లు, 197 మంది శిశువులకు డైపర్లనీ బల్దియా ఉచితంగా పంపిణీ చేసింది. అంతటితో అయిపోలేదు. అంగన్‌వాడీ టీచర్లతో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి...  ఈ విధానాల అమల్లో ఏమైనా ఇబ్బందులున్నాయేమో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఎవరికైనా అనుమానాలు ఉంటే మహిళా వైద్యుల సాయంతో సందేహాల నివృత్తి కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా మొత్తం విస్తరించేందుకు కావాల్సిన చర్యలు చేపట్టింది బల్దియా. బాగుంది కదూ... ఈ రుతుప్రేమ.


ఒక్కొక్కరూ...ఐదుగురిని మార్చాలి!

పునర్వినియోగ నాప్కిన్లు వాడిన తర్వాత... మహిళల అనుభవాలు సేకరించాం. అంతకంటే ముందు నెలసరులు గోప్యంగా ఉంచాల్సిన విషయం కాదని వాళ్లలో చైతన్యం తీసుకొచ్చాం. అవసరం అయిన వాళ్లకి డాక్టర్ల సాయంతో వైద్యసలహాలు ఇప్పించాం. ఇలా చైతన్యవంతం అయిన ఒక్కో మహిళా మరో ఐదుగురిని మార్చాలన్నది మా సంకల్పం. మహిళా ప్రజాప్రతినిధులూ ఈ మార్గంలో నడుస్తూ... తోటి మహిళల్లో చైతన్యం తీసుకురావడం సంతోషంగా ఉంది.

- డా.శాంతి, పర్యావరణవేత్త.


మెతుకు వెంకటేశ్‌, సిద్దిపేట టౌన్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్