Updated : 25/04/2022 01:50 IST

పర్వత శిఖరాలతో ప్రేమలో పడ్డా...

ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తర్వాత పర్వతాలతో ప్రేమలో పడింది... అదే ఆమెను మరిన్ని సాహసాలు చేసేలా పురిగొల్పింది. ప్రపంచంలో 18 ఏళ్లకే మౌంట్‌ సటోపంత్‌ ఎక్కిన యువతిగా చరిత్రకెక్కేలా చేసింది. తన ప్రసంగాలతో విద్యార్థులకు స్ఫూర్తినిస్తూ.. కేఫ్‌నూ నిర్వహిస్తోంది. స్వీయ అనుభవాలను రచనగా మార్చి నేటితరానికి తన సాహసాలను వివరిస్తోంది. పర్వతారోహకురాలు, రచయిత్రి, వాణిజ్యవేత్త.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచిన ముంబయి వాసి  33 ఏళ్ల కృష్ణాపాటిల్‌ స్ఫూర్తి కథనమిది.

డికి వేసవి సెలవులిస్తే చాలు. హిమాలయ పర్వతాల్లో షికారు కొట్టేది కృష్ణా పాటిల్‌ కుటుంబం. అలా పర్వతారోహణపై ఆసక్తితో 17 ఏళ్లకే ఉత్తర కాశీలోని నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటినీరింగ్‌లో అడ్వాన్స్‌ మౌంటినీరింగ్‌ కోర్సు పూర్తి చేసింది. ఆ తర్వాత ఏడాదికే ప్రీ ఎవరెస్ట్‌ పర్వతారోహణ యాత్రలో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. అలా గర్వాల్‌ హిమాలయాల్లోని మౌంట్‌ సటోపంథ్‌ను ప్రపంచంలో 18 ఏళ్లకే అధిరోహించిన తొలి యువతిగా నిలిచింది. అక్కడే మరిన్ని శిఖరాలను అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాతి ఏడాది ప్రపంచంలో అతి ఎత్తయిన ఏడు శిఖరాలెక్కే ఛాలెంజ్‌లో పాల్గొని, డెనాలి తప్ప మిగతావన్నీ పూర్తి చేసింది. సాంకేతిక సమస్యతో ఆ ఒక్కటీ సాధించలేకపోయినా, అంటార్కిటికా, దక్షిణ అమెరికా, ఐరోపా ఖండాల్లో మిగతా ఆరింటినీ అధిరోహించి, ప్రతి ఖండంలోని అతి ఎత్తయిన పర్వతాన్నెక్కిన అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సాధించింది.

సాహస క్రీడల్లోనూ...

పర్వతారోహణతోపాటు పారాగ్లైడింగ్‌, రాఫ్టింగ్‌, గుర్రపు స్వారీ లాంటి సాహస క్రీడల్లోనూ అడుగు పెట్టింది కృష్ణా. ‘అమ్మాయంటే శక్తిమంతురాలని, సాహసానికి ఆడా, మగా తేడా లేదంటూ చిన్నప్పటి నుంచి అమ్మానాన్నా నేర్పిన పాఠాలు నన్ను ప్రతి క్రీడలోనూ ప్రవేశించేలా ప్రోత్సహించాయి. వీటితోపాటు ఇంటర్నేషనల్‌ యాక్సెస్‌ వాటర్‌ సాహస యాత్రలోనూ పాల్గొన్నా. ఏడు ఖండాల నుంచి తలా ఒకరిని ఎంపిక చేసి ఆర్కిటిక్‌, అంటార్కిటికాలో పలు రకాల సాహస యాత్రలు చేసిన ఏన్‌ బాన్‌క్రాఫ్ట్‌ నేతృత్వంలో జరిగిన ఈ యాత్రకు మన దేశం నుంచి నాకు అవకాశం దక్కడం గర్వంగా అనిపిస్తుంది. ‘నీటి పొదుపు (వాటర్‌ కన్జర్వేషన్‌)పై చేసిన ఈ యాత్రలో ఆయా దేశాల్లోని అతిపెద్ద నదుల్లో బృందంతో కలిసి చేసిన ప్రయాణం మరవలేనిది. నదీ జలాలతోపాటు నదీ తీరాల్లోని పరిస్థితిని పరిశీలించి నివేదికనూ అందించాం. నా అనుభవాలను టెడెక్స్‌, ఇంక్‌ వంటి వేదికలపైనా పంచుకుంటున్నా. వీటితో కొందరైనా స్ఫూర్తి పొందుతారని భావిస్తున్నా. ఐఐటీ, ఐఐఎం విద్యార్థులకూ ప్రసంగాలిస్తున్నా.  ఎమ్మెన్సీ ఉద్యోగులకు నాయకత్వం, జట్టు నిర్మాణం, నిర్వహణలపై కార్యశాలలు నిర్వహిస్తున్నా. వ్యక్తిగత, ఉద్యోగపరంగా ఎదురయ్యే సవాళ్లను ఎలా దాటాలో వివరిస్తున్నా. కొవిడ్‌ సమయంలో సొంతంగా ఏదైనా చేయాలనిపించింది. అందరికీ ఆరోగ్యంతోపాటు పుస్తకాలను పరిచయం చేసే దిశగా కశ్మీర్‌లో డేనిష్‌తో కలిసి ‘బుక్స్‌ అండ్‌ బ్రిక్స్‌’ కేఫ్‌లో భాగస్వామినయ్యా. నా యాత్రలన్నింటినీ కలిపి ఓ పుస్తకంగా తెచ్చా. మూడు భాగాలుగా రాసిన ఈ రచనలో నా సాహసాల్లో ఎదురైన మలుపులు, ప్రమాదాల వంటివన్నీ ఉంటాయి. అంతేకాదు...నేటి తరానికి జీవిత పాఠాలు చెప్పే మరో పుస్తకాన్నీ రాస్తున్నా.’ అని చెబుతోన్న కృష్ణా పాటిల్‌ చేసిన సాహసాలకు రాజీవ్‌ గాంధీ పురస్కార్‌, యంగ్‌ అఛీవర్‌, సిటాడెల్‌ అవార్డు, రాణీ లక్ష్మీబాయి అవార్డు, యంగ్‌ ఇండియన్‌ లీడర్స్‌ అవార్డు, యూత్‌ ఆసియా అవార్డు, మహారాష్ట్ర రత్న అవార్డు, ఇందిరా గాంధీ పురస్కార్‌ వంటివెన్నో వరించాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని