50ల్లో.. రూ.100 కోట్ల వ్యాపారం!

50 ఏళ్లు.. విశ్రాంతికి ప్రణాళికలు వేసే వయసు. కానీ తన విషయంలో కాదంటుంది సంగీత లాలా. యవ్వనంలో నాన్నకి నచ్చలేదని తనకిష్టమైన ఉద్యోగం మానేసింది. పెళ్లయ్యాక కొత్త కెరియర్‌ మొదలుపెడితే.. పిల్లల కోసం దాన్నీ

Published : 26 Apr 2022 06:19 IST

50 ఏళ్లు.. విశ్రాంతికి ప్రణాళికలు వేసే వయసు. కానీ తన విషయంలో కాదంటుంది సంగీత లాలా. యవ్వనంలో నాన్నకి నచ్చలేదని తనకిష్టమైన ఉద్యోగం మానేసింది. పెళ్లయ్యాక కొత్త కెరియర్‌ మొదలుపెడితే.. పిల్లల కోసం దాన్నీ వదలాల్సొచ్చింది. ఇకిప్పుడు ఆమెకు సమయం దొరికింది. ‘ఈ వయసులో..’ అని వెనకడుగు వేయదలచుకోలేదు. ధైర్యంగా ప్రయత్నించింది. ఫలితమే రూ.100 కోట్ల వ్యాపార సామ్రాజ్యం.

‘నా దృష్టిలో వయసొక సంఖ్యే! సాధించడానికి అదో అడ్డంకి అనుకోను’ అంటారు సంగీత. ఈమెది ముంబయి. అమ్మా, నాన్న ప్రొఫెసర్లు. గోల్డ్‌మెడలిస్ట్‌లు కూడా. అన్నయ్యదీ అదే బాట. ఈమె కూడా వాళ్లనే అనుసరిస్తుందనుకుంటే తనేమో హోటల్‌ మేనేజ్‌మెంట్‌, క్యాటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ అప్లయిడ్‌ న్యూట్రిషన్‌లో చేరింది. సంగీత వాళ్ల నాన్న తర్వాత ప్లాస్టిక్‌ యూనిట్‌, ప్రింటింగ్‌ వ్యాపారం ప్రారంభించారు. చదువయ్యాక సంస్థ పనులు చూసుకుంటుందనుకున్నారాయన. ‘నాకేమో చదువుకున్న రంగంలోనే ఉద్యోగం చేయాలని! అందుకే తాజ్‌ హోటల్‌లో చేరా. వేళకాని వేళల్లో పని.. పైగా అమ్మాయిని. నాన్నకి నచ్చలేదు. మానేయమన్నారు. రాజీనామా చేసి, మా సంస్థలోనే చేరా. నెరోలాక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ వంటి పెద్ద సంస్థలకు ప్లాస్టిక్‌ సప్లై చేసేవాళ్లం. ఎకనామిక్‌, పొలిటికల్‌ వీక్లీలేకాదు.. మహారాష్ట్ర బోర్డు కోసం పాఠ్య పుస్తకాలు ముద్రించే వాళ్లం. వ్యాపారంలో కుదురుకున్నా. ఇంతలో అనిల్‌తో పరిచయం, పెళ్లి. ఆయనది వస్త్ర వ్యాపారం. తర్వాత మేం బెంగళూరుకు మారిపోయాం’ అని చెప్పుకొచ్చారు సంగీత.

ఆ మాట మలుపు తిప్పింది...

ఇక్కడికొచ్చాక కొన్నాళ్లు రెస్టారెంట్లకు కన్సల్టెన్సీ సేవలు అందించారు. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌లోకీ అడుగు పెట్టినా.. పిల్లలకు ఇబ్బంది అవుతోందని మానేశారు. తర్వాత కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాన్ని నిర్వహించేవారు. ఈమెకు ఇద్దరబ్బాయిలు. చిన్నబ్బాయిని కాలేజీలో చేర్చడానికని కాలిఫోర్నియా వెళ్లినపుడు అక్కడ ఓ రెస్టారెంట్‌లో ఫ్యాన్‌ ఆమెను ఆకర్షించింది. ‘సీలింగ్‌ ఫ్యాన్‌ అంటే.. నాకు తెలిసింది మూడు రెక్కలతో ఉండేదే! కొద్ది నెలల ముందే మా ఇంటిని ఆధునీకరించాం. ఫ్యాన్లనూ మారుద్దామని ఎంత వెతికినా రంగుల్లో మార్పులు మినహా అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇదేమో 4 రెక్కలతో భిన్నాకృతిలో ఉంది. అందుకే బాగా ఆకర్షించింది’ అని వివరిస్తారీమె. అప్పటికీ ఆమెకు వ్యాపారాలోచనేమీ లేదు. తిరిగొస్తుంటే వాళ్లబ్బాయి.. ‘అమ్మా.. ఇప్పటిదాకా మాకోసం చేసింది చాలు. ఇకనైనా నీకు నచ్చింది చెయ్‌’ అన్నాడు. అది ఆమెలో ఫ్యాన్ల వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచన రేకెత్తించింది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.

మూడునెలల్లోనే.. రూ.కోటి

‘ఇదే ఎందుకంటే.. బాధ్యతలు తీరాయి. ఓడినా.. కొత్తది ప్రయత్నించానన్న సంతృప్తి ఉంటుంది. పైగా నన్ను బాగా ఆకర్షించింది.  దేశీయ మార్కెట్‌లోనూ డిజైనర్‌ ఫ్యాన్లు లేవు. దీంతో దాదాపు ఏడాది పాటు స్పెయిన్‌, యూఎస్‌లలో ఫ్యాన్ల తయారీ సంస్థలతో సంప్రదింపులు జరిపా. కొందరు నిపుణుల్ని నియమించుకొని కొత్త డిజైన్లు రూపొందించి, తయారు చేశాం. దీనంతటికీ ఏడాదిపైనే పట్టింది. చిన్న షోరూంగా ‘ఫ్యాన్జ్‌ఆర్ట్‌’ను బెంగళూరులో 2012లో ప్రారంభించాం. మావారూ కో ఫౌండర్‌గా చేరారు. ఆయన కంపెనీ వ్యవహారాలు, నేను డిజైనింగ్‌, మార్కెటింగ్‌ చూసుకుంటున్నాం. ఎన్నో రకాల మెటల్స్‌తో, చెక్కతోనూ ఫ్యాన్లను రూపొందించాం. రెండు నుంచి 14 రెక్కల వాటి వరకూ, కాలాన్ని బట్టి సవ్య, అపసవ్య దిశల్లోకి మార్చుకునేలానూ తీర్చిదిద్దాం. ఫ్యాన్‌నీ గృహాలంకరణ సామగ్రిలో ఒకటిగా మార్చాం. దీంతో ప్రముఖులు, క్రికెటర్లు, తారలూ కస్టమర్లయ్యారు. మొదటి మూడు నెలల్లోనే వ్యాపారాన్ని రూ.కోటికి చేర్చగలిగాం’ అని ఆనందం వ్యక్తం చేస్తారీమె. ఏడాది తర్వాతి నుంచి ఫ్రాంచైజ్‌లనీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 100 ఫ్రాంచైజ్‌లున్నాయి. దేశీయంగా విజయం సాధించాక శ్రీలంక, దుబాయ్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, సింగపూర్‌, యూరప్‌ దేశాలపై దృష్టిపెట్టారు. సర్వీసింగ్‌ సెంటర్లనీ ఏర్పాటు చేశారు. ఇప్పుడామె వ్యాపారం రూ.100 కోట్ల పైమాటే!


‘50 ఏళ్ల వయసులో ఏంటా ధైర్యం అంటారందరు. మొదట్నుంచీ నా ప్రయాణంలో కొత్త సవాళ్లే. పైగా అన్నింట్లోనూ విజయాలే. ఆ ధైర్యం ఉంటుందిగా! అయినా ఆడవాళ్లు మల్టీటాస్కింగ్‌లో దిట్టలు. ఒత్తిడిలోనూ నెగ్గుకు రాగలరు. సృజనాత్మకతకీ ఆద్యులు. నా ప్రత్యేకతలు నేను గుర్తించా. నాలాగే అందరూ చేస్తే వారికీ విజయం సులువే. పైగా నాకు కుటుంబం అండా ఉంది. చాలామంది ఇప్పుడు నాకు సమయం వచ్చిందంటారు కానీ.. నేను ఒప్పుకోను. మునుపటిదంతా నేను నేర్చుకున్న సమయం’ అంటారు సంగీత. ఇప్పుడామె వయసు 60కు పైమాటే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్