సాహసాల కమల్‌..

పదేళ్లకే లైంగిక వేధింపులకు గురైన అమ్మాయి ఈమె. తీవ్ర మానసిక రుగ్మతకు లోనై, బయటపడుతున్న సమయంలో తల్లిని కోల్పోయి పలురకాల అనారోగ్యాలతో పోరాడింది. అయినా, ఆ అనుభవాలనే తన విజయాలకు సోపానాలుగా మార్చుకుంది.

Published : 29 Apr 2022 01:55 IST

పదేళ్లకే లైంగిక వేధింపులకు గురైన అమ్మాయి ఈమె. తీవ్ర మానసిక రుగ్మతకు లోనై, బయటపడుతున్న సమయంలో తల్లిని కోల్పోయి పలురకాల అనారోగ్యాలతో పోరాడింది. అయినా, ఆ అనుభవాలనే తన విజయాలకు సోపానాలుగా మార్చుకుంది. ప్రపంచ పర్వతారోహకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న 36 ఏళ్ల కమల్‌  ధైర్యం ఇప్పుడు ఇతరులకూ స్ఫూర్తిగా నిలుస్తోంది. సాహసాలకు మారుపేరుగా మారిన కమల్‌ ప్రస్తుతం యోగా టీచర్‌, ఫ్యాషన్‌డిజైనర్‌, మహిళాహక్కుల కోసం పోరాడే సేవాదృక్పథం ఉన్న మహిళ.  

బాల్యం నుంచి అందరి ఆడపిల్లల్లాగే అమ్మ కొంగు పట్టుకొని తిరిగేది కమల్‌ కౌర్‌. పాఠశాల నుంచి వచ్చిన వెంటనే తరగతిలోని విశేషాలను అమ్మతో పంచుకునేది. కమల్‌కు పదేళ్లు వచ్చేసరికి తీవ్ర లైంగిక వేధింపులకు గురై పలురకాల మానసిక సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. మానసిక నిపుణులందించే చికిత్స కన్నా, తల్లే ఆమెకు మొదటి వైద్యురాలిగా నిలిచింది. లండన్‌లో ఈమె తండ్రి వ్యాపారికాగా, తల్లి గృహిణి. ఆర్థికంగా స్థాయి ఎంత ఉన్నా, ఇంట్లో తల్లీ, కమల్‌ ఒంటరిగానే ఉండాల్సి వచ్చేది. 15వ ఏట అడుగుపెట్టేసరికి అనారోగ్యంతో తల్లి మరణం ఈమెను తీవ్రంగా కుంగదీసింది. అప్పటివరకు స్నేహితురాలిగా ఉన్న కన్నతల్లి లేకపోవడంతో మానసిక అనారోగ్యానికి గురైంది. బాల్యంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, ఆపై అమ్మ మృతితో కమల్‌ స్తబ్దతగా మారిపోయింది. అలా రెండేళ్లపాటు ఒంటరిగానే గడిపింది.  

ఫిట్‌నెస్‌ వైపు..

వైద్యుల సూచనమేరకు శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండటానికి ధ్యానం, వెయిట్‌ లిఫ్టింగ్‌, పరుగు, కార్డియో వర్కవుట్స్‌ వంటివి ప్రారంభించింది. దిల్లీకి చేరుకున్న తర్వాత లైంగిక వేధింపులు, గృహహింస బాధితుల కోసం చేయూతనందించే ఎన్జీవోలతో కమల్‌ తన 17 ఏట నుంచే కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. మారథాన్‌తోపాటు పలురకాల క్రీడాపోటీల్లో పాల్గొనేది. కుంగుబాటు నుంచి క్రమేపీ బయటపడటానికి ప్రయత్నించి, చదువువైపు అడుగులేసి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ పూర్తి చేసింది. ఎక్కువగా పర్యాటకప్రాంతాలు తిరగడం, సాహసోపేతమైన క్రీడల్లో పాల్గొనడంపై ఆసక్తి చూపేది. ‘పలు ఎన్జీవోలకు నిధులు సమకూర్చే దిశగా ట్రెక్కింగ్‌, పర్వతాలెక్కడంవంటివి చేయడం 20వ ఏట నుంచి మొదలుపెట్టా. ఆ సమయంలో 2010లో 24 గంటల్లో మూడు పర్వతాలు అధిరోహించే సాహసవంతమైన ఓ ఛాలెంజ్‌లో పాల్గొంటావా అని ఓ ఛారిటీ అడగడంతో ఏమీ ఆలోచించకుండా ఓకే చెప్పేశా. ఎటువంటి శిక్షణా తీసుకోలేదు. రక్తం గడ్డ కట్టే చలిలో మిగతావారితో కలిసి పాల్గొని పూర్తిచేశా. ఈ అనుభవం నాకు నా బలమేంటో తెలిసేలా చేసింది. శిఖరారోహణలపై మక్కువ పెరిగింది. ఏడు గ్లోబల్‌ సమ్మిట్స్‌లో ఆఫ్రికాలోని కిలిమాంజారో, దక్షిణ అమెరికాలోని అకాన్‌కాగ్వా, ఆఫ్రికాలో మెరూ, రష్యాలోని ఎల్‌బ్రస్‌, ఉత్తర అమెరికాలోని డెనాలీ ఎక్కా. అంతేకాదు, మౌంట్‌ ఎవరెస్ట్‌, దక్షిణధృవంలోని అత్యంత ఎత్తైన పర్వతం పెనీఫేన్‌ అధిరోహించా. ప్రపంచంలోనే ఎత్తైన మచు పిచ్చు, దక్షిణ అమెరికాలోని మిస్టీ, టిబెట్‌లోని చోఓయూ, నేపాల్‌లోని అమా వంటి పర్వతాలను అధిరోహించగలిగా. ఏదైనా పర్వతారోహణ ప్రారంభించే ముందు ఎక్కువ బరువును వీపుపై తగిలించుకొని చాలా దూరం రోజూ నడిచి సాధన చేస్తా. దీంతోపాటు ధ్యానం, వ్యాయామాలు తప్పనిసరి. ఇవన్నీ నన్ను ఫిట్‌గా ఉంచుతాయి. ఎటువంటి వాతావరణమైనా ధైర్యంగా ముందడుగు వేసేలా మానసికంగా సిద్ధం చేస్తాయి. ఛారిటీల తరఫున నేను చేసే పర్వతారోహణల ద్వారా వచ్చే నగదును మహిళాహక్కుల కోసం పోరాడే ఎన్జీవోలకు చేరేలా చేస్తా. అలా ఏటా రూ.10 లక్షలు నా తరఫున వారికి అందుతాయి. తమిళనాడులో యోగా కోర్సు పూర్తిచేసి, సర్టిఫైడ్‌ యోగా టీచర్‌గా ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతున్నా. పర్వతారోహణ చేసేటప్పుడు నా లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఎత్తైన ఆ ఎముకలు కొరికే చలిలోనూ యోగాసనాలు ప్రదర్శించి అందరికీ ఫిట్‌నెస్‌పై అవగాహన కలిగిస్తుంటా. త్వరలో ద వరల్డ్‌ సిరీస్‌ ఆఫ్‌ ఫిట్‌నెస్‌ రేసింగ్‌తోపాటు మరో శిఖరాగ్రాన్ని అధిరోహించడానికి సిద్ధమవుతున్నా. మహిళలందరికీ చెప్పేదేంటంటే.. ఇబ్బందులెదురైనా ఆత్మవిశ్వాసంతో మన ముందున్నది ఎంత పెద్ద కష్టమైనా దానికన్నా మనమే బలవంతులమని ఆలోచిస్తే చాలు. విజయం మనదే అవుతుంది’ అని చెప్పుకొస్తున్న కమల్‌ నిజంగా సాహసవంతురాలు కదూ...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్