వారింట గోరింట వీళ్లు వెయ్యాల్సిందే!

అరచేతిలో గోరింటాకు ఎర్రగా పండితే మురిసిపోతాం. వైవాహిక జీవితంలో అడుగు పెట్టే వధువుకు మెహందీ శ్రీకారంలాంటిది. ఈ క్షణాలను అందమైన జ్ఞాపకంగా వీరు తీర్చిదిద్దుతున్నారు. సినీ, క్రీడ,

Updated : 01 May 2022 03:33 IST

అరచేతిలో గోరింటాకు ఎర్రగా పండితే మురిసిపోతాం. వైవాహిక జీవితంలో అడుగు పెట్టే వధువుకు మెహందీ శ్రీకారంలాంటిది. ఈ క్షణాలను అందమైన జ్ఞాపకంగా వీరు తీర్చిదిద్దుతున్నారు. సినీ, క్రీడ, వ్యాపార కుటుంబాల మహిళల చేతులను గోరింటాకుతో పండిస్తూ తామూ జాతీయ స్థాయికి ఎదిగిన కొందరు మెహందీ కళాకారుల గురించి...

దేశవ్యాప్తంగా అభిమానులే... వీణా నాగ్డా

‘పుట్టి పెరిగిందంతా ముంబయి. మెహందీ అంటే బాల్యం నుంచి ఇష్టం. ఎవరి చేయి దొరికినా గోరింటాకు పెట్టడం అలవాటు. మొదట చిన్నచిన్న శుభకార్యాలకు మెహందీ పెట్టేదాన్ని. కొన్నిరోజులకు సెలబ్రిటీలకు పెట్టే అవకాశం వచ్చింది. అలా బాలీవుడ్‌లో నటీనటుల వివాహాలకు కబురు పెడతారు.శిల్పాశెట్టి, కరిష్మా, ట్వింకిల్‌ ఖన్నా, దీపికాపదుకొణె నుంచి కాజల్‌ అగర్వాల్‌, ఆలియాభట్‌ వరకు రెండుదశాబ్దాల నుంచి నేటి తరం డిజైన్స్‌ వేయగలను. అంబానీ, బిర్లా కుటుంబాలకూ మెహందీ వేయడం సంతోషమనిపిస్తుంది. విదేశాలకు వెళ్లి కూడా వేసి వస్తుంటా’.


తల్లీ కూతుళ్లం జతగా... ఉష

‘ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నేను పెళ్లైన తర్వాత ముంబయికి వచ్చా. నాకిష్టమైన గోరింటాకే నా కెరియర్‌ అవుతుందనుకోలేదు. ఇంట్లోవారికి, స్నేహితులకు సరదాగా మెహందీ వేసే దాన్ని. మా అత్తగారి ప్రోత్సాహంతో ఓ మెహందీ పోటీలో బహుమతి సాధించా. ఊహించని ఈ గెలుపు నా జీవితంలో ఓ మలుపైంది. ఈ కళలో శిక్షకురాలిగా మారా. ఓ పత్రికలో నా గురించి రాయడంతో బాలీవుడ్‌ నటి నమ్రతాదత్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. అలా ఆమిర్‌ఖాన్‌, కరిష్మాకపూర్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, కాజల్‌, రవీనా టాండన్‌, బిపాసాబసు, ఆయేషా జాకీష్రాఫ్‌, వివేక్‌ ఓబరాయ్‌, రితేష్‌ దేశ్‌ముఖ్, పూనం థిల్లాన్‌... ఇలా ఎందరికో మెహందీ పెట్టా. హాలీవుడ్‌ నటి డెమీ మూర్‌ వంటివారు కూడా నా ఖాతాదారుల జాబితాలో ఉన్నారు. కార్పొరేట్‌, క్రికెట్‌ రంగాల ప్రముఖుల సతీమణులు, కుమార్తెలు ఎందరో నా డిజైన్లకు ఫిదా అయ్యారు. అంబానీ, బజాజ్‌, గావస్కర్‌ కుటుంబాలకూ ఈ సేవలందించా. దీని కోసం  ఎన్నో సార్లు విదేశాలకూ వెళ్లొచ్చా. మైఖేల్‌ జాక్సన్‌ బృందం నా వద్ద హెన్నా టాటూస్‌ వేయించుకోవడం మరవలేను. అరబిక్‌, టాటూ, జర్దోసీతోపాటు థీంలకు తగినట్లు డిజైన్స్‌ మారుస్తుంటా. మా అమ్మాయి ఏక్తాషా కూడా నాతో కలిసి పని చేస్తోంది.’


రజనీ కుటుంబసభ్యులకు... మనీషా మోదీ

‘తమిళనాట పుట్టిన నాకు బాల్యం నుంచే మెహందీ ఒంట పట్టింది. ఆసక్తితో ఈ కోర్సు చేసి శిక్షణనివ్వడం మొదలుపెట్టా. తెలిసిన వారింట్లో వేడుకలకు గోరింటాకు పెట్టేదాన్ని. అలా ప్రముఖ నటి మంజుల కుమార్తెల పెళ్లిళ్లకు మెహందీ పెట్టే అవకాశం దక్కింది. తర్వాత రజనీ, సూర్య తదితర నటుల కుటుంబాల్లో పెళ్లిళ్లు, వేడుకలకు పిలుపొచ్చింది. 20 ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నా. ఫ్యాషన్‌కు తగినట్లుగా డిజైన్స్‌ మారుస్తూ కొత్తదనాన్ని అద్దుతుంటా. దీంతోపాటు వంటలపైనా ప్రత్యేక తరగతులూ నిర్వహిస్తుంటా.’


అత్తా కోడళ్లం... గీతాపాటిల్‌

‘నా కోడలు పూర్వి, నాతో కలిసి అడుగు లేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాది ముంబయి. మెహందీ ఆర్ట్‌లో ప్రత్యేక శిక్షణ ఏమీ తీసుకోలేదు. నా కళ చూసి నావద్దకు నేర్చుకోవడానికి వచ్చేవారు. అలా బాలీవుడ్‌ తారల వివాహాల్లో అవకాశాలొచ్చే స్థాయికి ఎదిగా. సృజనాత్మకంగా, వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా మెహందీ తీర్చిదిద్దుతా. సహజ సిద్ధమైన వేర్లు, ఆకులను గోరింటాకుకు కలిపి మరీ వేస్తా. డిజైన్లు వేయడంలో మార్వాడీ, బెంగాలి, మరాఠీ... ఇలా వారి సంప్రదాయాలను అనుసరిస్తా. అరబిక్‌, జర్దోసీ, ఫ్లోరల్‌స్టైల్స్‌ వేస్తా. గోరింటాకు పెట్టడంలో నా కోడలు పూర్వి నిపుణురాలు.’


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్