స్టార్‌ మహిళనన్నారు..

ఒక సామాన్యురాలు.. వందల మందిని నడిపించగలదంటే నమ్ముతారా? అరిపినేని పద్మావతిని చూస్తే నమ్మాల్సిందే! పుట్టింది చిన్న పల్లె.. చేతిలో డిగ్రీ లేదు.. కాలక్షేపానికి నేర్చుకున్న విద్యతో వందల మందికి ఉపాధి కల్పిస్తోంది... వ్యాపారాన్ని విదేశాలకూ విస్తరించింది. ఈ అసామాన్య మహిళ ప్రయాణం.. తన మాటల్లోనే..! 

Published : 03 May 2022 04:03 IST

ఒక సామాన్యురాలు.. వందల మందిని నడిపించగలదంటే నమ్ముతారా? అరిపినేని పద్మావతిని చూస్తే నమ్మాల్సిందే! పుట్టింది చిన్న పల్లె.. చేతిలో డిగ్రీ లేదు.. కాలక్షేపానికి నేర్చుకున్న విద్యతో వందల మందికి ఉపాధి కల్పిస్తోంది... వ్యాపారాన్ని విదేశాలకూ విస్తరించింది. ఈ అసామాన్య మహిళ ప్రయాణం.. తన మాటల్లోనే..!

ద్రాద్రి కొత్తగూడెంలో రేపల్లెవాడ మాది. బస్సు కూడా ఉండేది కాదు. నాన్న హిందీ పండిట్‌. అప్పట్లోనే 20 కి.మీ. తీసుకెళ్లి చదువు చెప్పించారు. డిగ్రీలో పెళ్లైంది. దీంతో పూర్తి చేయలేదు. మావారు వెంకటేశ్వరరావు కొత్తగూడెంలో సింగరేణి ఉద్యోగి. ఓసారి తిరుపతికి వెళ్లినపుడు ఆవులు ప్లాస్టిక్‌ తిని చనిపోతున్నాయని ఉన్న పోస్టర్‌ చూశా. అప్పుడే ప్లాస్టిక్‌ ఎంత ప్రమాదమో అర్థమైంది. దుకాణాలన్నీ వాడేది ప్లాస్టిక్‌ కవర్లే! ఏ మార్పైనా ఇంటి నుంచే ప్రారంభమవ్వాలి. ఎలాగూ ఇంట్లో ఖాళీనే కదా అని వార్తాపత్రికలతో కవర్లు చేయడం మొదలుపెట్టా. వాటిని మావారు మందుల దుకాణాల వాళ్లకు ఉచితంగానే ఇచ్చేవారు. అప్పుడే సింగరేణి వాళ్లు.. ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా పేపర్‌ బ్యాగుల తయారీలో వారం రోజుల శిక్షణను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. నేనూ వెళ్లా. అక్కడికి వచ్చిన ఆడవాళ్లలో చాలా మంది కుటుంబానికి దూరంగా వచ్చి ఇబ్బంది పడటం గమనించా. దీంతో కొత్తగూడెంలో ఆసక్తి ఉన్న వారికి ఉచిత శిక్షణ ప్రారంభించా. చాలామంది ముందుకొచ్చారు. ఇది చూసి సింగరేణి సంస్థ పరిశ్రమ ఏర్పాటు చేసుకోవడానికి స్థలమిచ్చింది. అలా 2010లో శ్రీ వేంకటేశ్వర హ్యాండ్‌మేడ్‌ పేపర్‌ ప్రారంభించా. వార్తాపత్రికలు, మందమైన క్యాలెండర్లతో కవర్లు చేసే వాళ్లం. మెడికల్‌ షాపులకు సరే.. కానీ షోరూంలకు ఇవి పనికి రావు. పైగా ఆదాయం కావాలంటే చూడటానికీ ఆకర్షణీయంగా ఉండాలి. కాబట్టి, రంగు కాగితాలను తెప్పించా. నేనే మెటీరియల్‌ ఇస్తా. వాళ్లు తయారు చేసిస్తే మార్కెటింగ్‌ నేను చూసుకుంటా. చిన్న, పెద్ద.. ప్రతి షాపు దగ్గరకూ వెళ్లి మా ఉత్పత్తుల్ని పరిచయం చేసేదాన్ని. క్రమంగా ఆర్డర్లు పెరిగాయి. దీంతో కాగితం తయారీనీ మొదలుపెట్టాం.

రూపాయి పెట్టుబడి. . ఓసారి నాంపల్లి ఎగ్జిబిషన్‌లో స్టాల్‌ని ఏర్పాటు చేశా. దీంతో హైదరాబాద్‌ నుంచీ ఆర్డర్లు పెరిగాయి. దాన్ని చూసి ఖాదీ గ్రామోద్యోగ్‌ మహావిద్యాలయ వాళ్లు షోరూమ్‌నిచ్చి మార్కెటింగ్‌ నైపుణ్యాలు నేర్చుకోమన్నారు. అయితే రెండేళ్లే అవకాశం. నెట్‌వర్క్‌తోపాటు అమ్మకాలూ పెంచుకున్నా. దీంతో తిరిగి హైదరాబాద్‌ మాసబ్‌ ట్యాంక్‌లో షోరూం పెట్టుకోనిచ్చారు. అపోలో, స్టార్‌ హాస్పిటల్స్‌, ఇండియన్‌ ఆయిల్‌, ఎన్‌ఎండీసీ, ఏడీపీ, సింగరేణి, కళానికేతన్‌.. ఇలా ఎన్నో సంస్థలతో పనిచేశా. ఇప్పటికీ తయారీ కొత్తగూడెంలోనే. అమ్మకాలే ఇక్కడ. కాలంతోపాటు మారాలిగా! పేపర్‌తోపాటు క్లాత్‌, జ్యూట్‌ బ్యాగుల్నీ ప్రవేశపెట్టాం. విత్తన కవర్లనూ రూపొందిస్తున్నాం. పెళ్లిళ్లు, పేరంటాలకు కస్టమర్లు కోరిన రీతిలో రిటర్న్‌గిఫ్ట్‌లు, అడ్డుతెరలు, ఒకే రకమైన వస్త్రాలు నేయించివ్వడం వంటివీ జోడిస్తూ వెళుతున్నా. శిక్షణనీ కొనసాగిస్తున్నా. దివ్యాంగులకూ నేర్పించి ఉపాధినిస్తున్నా. 300 మందికిపైగా నా దగ్గర పనిచేస్తున్నారు. రాజేంద్రనగర్‌లో ఇటీవలే మరో పరిశ్రమనీ ప్రారంభించాం. అప్పట్లో వార్తా పత్రిక ధర రూపాయి. అదే పెట్టుబడిగా దీన్ని ప్రారంభించా. ఇప్పుడు  అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, జర్మనీ, డెన్మార్క్‌ తదితర దేశాలకీ పంపిస్తున్నాం.

మా బాబు ఎంబీఏ చేసి సొంత స్టార్టప్‌ పనిలో ఉన్నాడు. అమ్మాయి ఎంఫార్మసీ చదివి ఉద్యోగం చేస్తోంది. కానీ 5-6 ఏళ్లు అబ్బాయి పంజాబ్‌.. అమ్మాయి హైదరాబాద్‌ హాస్టల్‌... మావారు కొత్తగూడెం, నేనేమో అత్తగారితో ఇక్కడ.. నలుగురం నాలుగు దిక్కుల్లో ఉన్నాం. ఆ సమయంలో చాలా బాధేసేది. 2020 నుంచే హైదరాబాద్‌లో ఒకచోట ఉంటున్నాం. కనీసం డిగ్రీ లేదు.. మార్కెటింగ్‌ ఎలా సాధ్యమైందంటారు చాలామంది. నాన్న రాజకీయ నాయకుడు. ఆయన్నుంచే ధైర్యంగా మాట్లాడటం అలవాటైంది. ఓసంస్థ పదివేల బ్యాగుల్ని పదిరోజుల్లో చేసిమ్మంది. అసలే హ్యాండ్‌మేడ్‌. వాటిని వివిధ ప్రదేశాలకు పంపాలి. నాతోపాటు ఇంట్లోవాళ్లు, పని వాళ్లూ రాత్రింబవళ్లు పనిచేశాం. మేం చేసివ్వగలమని ఆ సంస్థా నమ్మలేదు. తీరా అందించేసరికి ‘మీరు స్టార్‌ మహిళండీ’ అన్నారు. అది మర్చిపోలేను. మన మీద మనకు నమ్మకం, నా కుటుంబం లాంటి కుటుంబం తోడుంటే ఏదైనా సాధ్యమే!

- ఆకుల శ్రీనివాసరావు, కొత్తగూడెం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్