నిప్పుకు వెరవం... ముప్పుకు బెదరం

చుట్టూ...చెలరేగే మంటలు.. కూలిన కట్టడాలు.. వాటి మధ్య చిక్కుకున్న బాధితుల హాహాకారాలు మిన్నంటుతుంటే.. వారిని కాపాడేందుకు అగ్నిమాపకదళ సభ్యులు చేసే సాహసాలు ఒళ్లు గగుర్పొడుస్తాయి. అలాంటి ప్రమాదకర రంగంలోనూ.. మేము సైతం అంటున్నారీ సాహసులు. అగ్నిమాపకదళ దినోత్సవ సందర్భంగా ఈ వీరనారులపై ప్రత్యేక కథనం..

Published : 04 May 2022 01:20 IST

చుట్టూ...చెలరేగే మంటలు.. కూలిన కట్టడాలు.. వాటి మధ్య చిక్కుకున్న బాధితుల హాహాకారాలు మిన్నంటుతుంటే.. వారిని కాపాడేందుకు అగ్నిమాపకదళ సభ్యులు చేసే సాహసాలు ఒళ్లు గగుర్పొడుస్తాయి. అలాంటి ప్రమాదకర రంగంలోనూ.. మేము సైతం అంటున్నారీ సాహసులు. అగ్నిమాపకదళ దినోత్సవ సందర్భంగా ఈ వీరనారులపై ప్రత్యేక కథనం..

జయలలిత వచ్చారు: ప్రియా రవిచంద్రన్‌

నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి పోయింది. శిధిలాల నుంచి బాధితులను రక్షించాలి. అలాంటి పరిస్థితుల్లో అగ్నిమాపకదళ అధికారిగా ప్రియ చేసిన సాహసం ఇద్దరిని బతికించింది. మరో సారి చెన్నైలో ఓ మహల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హుటాహుటిన బృందంతో అక్కడకు చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేసింది తను. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా ధైర్యంగా లోపలకు అడుగుపెట్టింది. అంతలో సీలింగ్‌ విరిగిపడింది.  మంటల్లో చిక్కుకున్న తనను బయటకు తీసేసరికే శరీరం 45 శాతం కాలిపోయింది. ‘అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఐసీయూలో ఉన్న నన్ను పలకరించి ప్రశంసించడం మరవలేనిది. 2012లో రాష్ట్రపతి నుంచి గాలంటరీ అవార్డు అందుకున్నా. తమిళనాట అగ్నిమాపక దళంలో తొలి మహిళా అధికారిగా చేరిన రోజే విధుల్లో ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమనుకున్నా. కొన్నిసార్లు మా కళ్లెదుటే కొందరు చనిపోవడం బాధగా ఉంటుంది. ఓసారి 24 అడుగుల్లోతు బోరుబావిలో రెండేళ్ల బాబు జారిపడ్డాడు. ఆ చిన్నారిని గుర్తించి, రక్షించడానికి చాలా శ్రమపడ్డాం. చివరకు ఆ తల్లి కళ్లలో కనిపించిన ఆనందాన్ని ఎప్పటికీ మరవలేను’ అంటోంది ప్రియ ఉద్విగ్నంగా.


దేశంలోనే తొలిసారిగా: హర్షిణీ కన్హేకర్‌

అయిదేళ్లక్రితం జరిగిన అద్భుతమిది. 46 ఏళ్లుగా మగవారు మాత్రమే ఉంటోన్న ఈ రంగంలో మహిళలు అడుగు పెట్టడానికి శ్రీకారం చుట్టింది హర్షిణీ కన్హేకర్‌. నాగ్‌పుర్‌కు చెందిన ఈమె నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ కాలేజీ తొలి విద్యార్థిని. ‘దరఖాస్తు చేస్తున్నప్పుడు ఆర్మీ లేదా ఎయిర్‌ఫోర్స్‌ కాలేజీలో చేరండి. ఇది మగవారికి మాత్రమే అన్నారు. అప్పటికే ప్రవేశ పరీక్ష రాసి పాసయ్యా. అత్యంత కఠినమైన శిక్షణ పూర్తి చేసుకుని యూనిఫాం ధరించి బయటికి వచ్చేటప్పుడు తృప్తిగా అనిపించింది. ఎన్నో సాహసాలు, అనుభవాలు ఈ ఉద్యోగాన్ని మరింత ప్రేమించేలా చేస్తున్నాయి’ అని చెప్పుకొస్తోందీమె.


సామర్థ్యాన్ని పెంచుకొని: తానియా సాన్యాల్‌

కోల్‌కతాకు చెందిన తానియాదీ ఇదే కల. వృక్షశాస్త్రంలో మాస్టర్స్‌ చేసిన ఈమె తనకెంతో ఇష్టమైన ఫైర్‌ ఫైటర్‌ ఉద్యోగాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దరఖాస్తు చేసింది మొదలు కఠోర సాధన చేసింది. దేహ దారుఢ్యాన్ని పెంచుకోవడానికి రోజూ 10 కి.మీ. పరిగెత్తేది. 40 కేజీల ఇసుక మూటను మోస్తూ 60 మీటర్ల దూరాన్ని సునాయసంగా దాటేది. చివరకు లక్ష్యాన్ని సాధించింది. కోల్‌కతా విమానాశ్రయంలో అగ్నిమాపక విభాగంలో చేరింది. విధినిర్వహణలో ప్రాణాలకు తెగించి, ధైర్యసాహసాలను ప్రదర్శించి సిటిజన్‌ సేఫ్టీ, డీసీడబ్ల్యూ అచీవ్‌మెంట్‌ పురస్కారాలనూ దక్కించుకుంది.


విమానాశ్రయంలో: రమ్యా శ్రీకాంతన్‌

చెన్నై విమానాశ్రయ అగ్నిమాపక దళంలో తొలి మహిళా అధికారి రమ్య. కేరళకు చెందిన ఈమెకు చిన్నప్పటి నుంచి సాహసాలంటే ఇష్టం. స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ చేసినా తన కలను వీడలేదీమె. ప్రొఫెసర్‌గా చేస్తూనే అగ్నిమాపకదళంలోకి రావడానికి  ఎన్నో ప్రయత్నాలు చేసింది. అవి ఫలించడంతో పాటు బోనస్‌గా వైమానిక దళంతో కలసి పని చేసే అవకాశాన్నీ పొందింది. విమానాశ్రయాన్ని ప్రతి క్షణం కాపాడే దళంలో విధులు నిర్వహిస్తోంది. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్