Updated : 08/05/2022 00:27 IST

ఆ కోరిక బలం.. 15 మంది వైద్యులు!

అమ్మకి పెద్ద కోరిక ఏముంటుంది? తన పిల్లలు ఉన్నతంగా ఎదగాలనీ, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలనీ! ఈ అమ్మ ఈ కోరికను మరింత బలంగా కోరుకున్నట్టుంది. కొడుకే కాదు.. ఆయన స్ఫూర్తిగా కుటుంబంలో ఇంకెంతోమంది వైద్యులవ్వడానికి కారణమైంది.

తేతలి దశరథ రామ రెడ్డి.. పేరు వినగానే కాస్త ఆలోచిస్తారేమో కానీ.. డాక్టర్‌ టీడీఆర్‌గా ఆయన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. విదేశాల్లోనూ గుర్తింపు పొందారు! ఆయనకే కాదు మరెంతో మందికి ఆ మార్గాన్ని సూచించింది వాళ్లమ్మ అచ్చియమ్మ. వీళ్లది.. తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి. ఆయనకు రెండేళ్లున్నప్పుడు వాళ్ల నాన్న నారాయణ రెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. భర్త, పిల్లలతోడిదే అచ్చియమ్మ లోకం. తనను, ఆరుగురు పిల్లల్ని ఒంటరి చేస్తూ ఆయన వెళ్లిపోవడం ఆవిడ తట్టుకోలేకపోయారు. బాధతో కుంగి పోయారు. కుటుంబ సభ్యుల సాయంతో మూడేళ్లకుగానీ దానిలోంచి బయట పడ లేకపోయారు. కానీ తన ముందున్న లక్ష్యం ఆవిడకి స్పష్టంగా తెలుసు. భర్త అప్పట్లోనే బాగా చదువుకున్నారు. వైద్య వృత్తి అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. అందుకే ఆయన తమ్ముడినీ, పెద్ద కూతుర్ని వైద్యులుగా చూడాలనుకొని వైద్యకళాశాలలో చేర్పించారు కూడా. కానీ ఆ కల నెరవేరకుండానే చనిపోయారు. దీంతో ఆయన ఆకాంక్షలను ముందుకు నడిపించడమే తన బాధ్యతనుకున్నారు. పిల్లలందరినీ ఉన్నతవిద్య చదివించాలి, కొడుకుని వైద్యుడిగా చూడాలనుకున్నారు. దశరథ రామరెడ్డికి ఆరోతరగతి నుంచే చుట్టు పక్కల ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు సరిగా లేకపోవడాన్ని వివరిస్తూనే వైద్యవృత్తి ప్రాధాన్యాన్ని తెలిపే వారు. అలా ఆయన మనసులో డాక్టర్‌ అవ్వాలన్న కోరికను బలంగా నాటారు. ఆవిడ చదివింది పెద బాలశిక్షే. అయినా పిల్లలకు తోడుగా ఉండటం కోసం రాత్రి వాళ్లతో కూర్చొని భర్త సేకరించుకున్న పుస్తకాలను చదివేవారు. తెల్లవారుఝామున వాళ్లతో పాటే లేచి తోడుగా కూర్చుని రామకోటి రాసేవారు. చివరికి కొడుకు డాక్టర్‌ అయ్యాడు. ఆమె కోరిక అంతటితో ఆగిపోలేదు. తన మనమలు, మనవరాళ్లు, మరుదుల పిల్లలు... ఇలా ఏ పిల్లలు కనిపించినా వాళ్లను వైద్యులుగా చూడాలనుకున్నారు. తన కొడుకునే స్ఫూర్తిగా చూపిస్తూ తమ్ముళ్ల పిల్లలు, వాళ్ల పిల్లలు అందరికీ వైద్యం గొప్పతనం, దాని వల్ల ఎందరి ప్రాణాలు నిలబెట్టగలరో చెప్పి ప్రోత్సహించారు. ఫలితమే.. ఆ కుటుంబంలో 15 మంది వైద్యులు. సరైన వైద్యం అందకే తన భర్త చనిపోయారని అచ్చియమ్మ నమ్మకం. అందుకే తనకు కలిగిన నష్టం మరే కుటుంబానికీ కలగ కూడదనుకున్నారు. ఒక వైద్యుడు ఎన్నో వేల మందిని కాపాడగలుగుతాడు.. అందుకే వైద్యమంటే సేవే అని నమ్మారావిడ. అందుకే సంపాదన కోసం కాక నలుగురికీ సాయపడే వైద్యసేవనే ఎంచుకునేలా తన చివరి నిమిషం వరకూ పిల్లల్ని ప్రేరేపించారు. అలా ఒక అమ్మ నమ్మకం ఇంతమందిని వైద్య సేవ దిశగా నడపడం స్ఫూర్తిమంతమే కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని