Published : 09/05/2022 01:02 IST

పొద్దున్నే పది కిలోమీటర్లు పరిగెత్తేది

చిన్న కష్టాలకే కొందరు నిరాశలోకి వెళ్లిపోతుంటారు. కొందరు మాత్రం ఆ కష్టాలకు ఎదురెళ్లి మరీ సత్తాని చాటుతారు.. బబ్లీబాయి కథ అటువంటిదే! కూలీగా మొదలైన ఆమె కానిస్టేబుల్‌గా మారే వరకూ ఎన్నో సవాళ్లను, హేళనలను ఎదుర్కొంది...

ఎంతో బరువైన బండరాళ్లను ఎత్తిదించాలి. భయంకరమైన వేడిలో వాటిని సానబెట్టి, మెరుగులు దిద్ది అందమైన మార్బుల్స్‌గా మలచాలి. ఇదీ మార్బుల్‌ ఫ్యాక్టరీలో బబ్లీబాయి పని. 16ఏళ్లకే భర్తతో కలిసి ఈ పనిలో కుదురుకుందామె. ఆమె భర్తదీ పెద్ద వయసేం కాదు.. 19 ఏళ్లే. రాజస్థాన్‌లోని పిండ్వారా ప్రాంతంలో చాలామంది యువతీయువకులు జీవనోపాధి కోసం ఇదే పనిలో కుదురుకుంటారు. కఠినమైన పనే అయినా కుటుంబాన్ని నడిపించడానికి ఇదొక్కటే మార్గం వాళ్లకి. దేశవ్యాప్తంగా దేవాలయాలకు అవసరమైన విగ్రహాలు, స్తంభాలు వీళ్ల చేతుల్లోనే అందంగా రూపుదిద్దుకుంటాయి. కానీ ఎదుగూబొదుగూ లేనిపని. అందుకే బబ్లీ.. టాటా ట్రస్ట్‌ ప్రారంభించిన పశుసఖి కార్యక్రమంలో శిక్షణ కోసం చేరింది. గ్రామీణ మహిళా రైతులకు పశుసంపద ద్వారా జీవనోపాధి మార్గాలను పెంచడం, ఇందుకోసం ఆర్థిక సాయం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. అయితే ఆ ప్రాంతంలో పశువులకు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్య సేవలు అందించడానికి పశువైద్యశాలలు కానీ, పశువైద్యులు కానీ అందుబాటులో ఉండరు. దాంతో పశుసఖి కార్యక్రమంలో పశువులకు అత్యవసర చికిత్సలు అందించడంపై కొందరు స్థానిక మహిళలకు టాటా ట్రస్ట్‌ శిక్షణ ఇచ్చింది. ఈ శిక్షణ అందుకున్న బబ్లీ మూగజీవులకు సేవలు అందిస్తూ, అందరికీ తల్లోనాలుకలా మారింది. తనకి ఒక బాబు, పాప. ఫర్వాలేదు బతకడానికి భరోసా ఉందనుకున్న సమయంలో భర్తకి సిలికోసిస్‌ అనే వ్యాధి వచ్చింది. రాళ్లను పగలకొట్టేటప్పుడు వచ్చే సన్నని రజను దీనికి కారణం. ఇక ఆమె భర్త పనికి దూరమయ్యాడు. కుటుంబ భారమంతా బబ్లీపైనే పడింది. పిల్లల్ని తల్లికి అప్పగించి చుట్టుపక్కల నాలుగు గ్రామాల్లోని 500 కుటుంబాలకు పశుసఖిగా సేవలు అందించేది. అవసరం అయితే అర్ధరాత్రి, అపరాత్రి కూడా వెళ్లాలి కాబట్టి దాచుకొన్న సొమ్ముతో ఒక బండి కొనుక్కొంది. ఇదంతా బబ్లీ సోదరుడికి నచ్చలేదు. ఇలా బండేసుకొని బబ్లీ గ్రామాలు తిరగడం... ఆమెకు తల్లి అండగా ఉండటం ఇష్టం లేక తల్లిని ఇంట్లోంచి గెంటేశాడు. టాటా ట్రస్ట్‌లో బబ్లీకి మెంటార్‌గా ఉన్న హేమలత ఆమెతో పదోతరగతి పరీక్షలు రాయించింది. అందులో ఆమె ఉత్తీర్ణురాలయ్యింది. బబ్లీ సామర్థ్యం తెలిసిన హేమలత... ఇంటర్‌ పరీక్షలు కూడా రాయించి పాసయ్యాక, ఆమెతో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టించింది. ఓ పక్క ఉద్యోగానికి వెళ్తూ, ఒంటిచేత్తో కుటుంబాన్ని నిర్వహించుకుంటూనే... ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కోసం తెల్లవారుజామున లేచి పదికిలోమీటర్లు పరుగులు పెట్టేది. పట్టుదలగా చదివి కోరుకున్న పోలీస్‌ ఉద్యోగం సాధించింది. ఇన్ని కష్టాల్లోనూ బబ్లీ ఎప్పుడూ నిరాశ పడలేదు. చిరునవ్వు వీడలేదు. తన లక్ష్యం ఒక్కటే... కష్టాల్ని అధిగమించాలి. పిల్లల్నీ, భర్తనీ బాగా చూసుకోవాలి. ఆ ప్రాంతంలో చదువుకున్న మహిళలే అరుదు. ఇలా పోలీసైన వాళ్లు అసలే ఉండరు. నన్ను ప్రేమించిన గ్రామీణ మహిళలు, అమ్మ సాయం లేకుండా ఈ విజయాన్ని సాధించే దాన్ని కాదు అంటోంది బబ్లీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని