Updated : 14/05/2022 22:53 IST

చేతుల్లేకపోతేనేం... జీవితం ఉందిగా!

పొద్దున్నే లేచి తన పనులన్నీ చేసుకుంటుంది, ఇంటి పనులు చేస్తుంది, బొమ్మలూ వేస్తుంది. ‘చాలామంది చేస్తారుగా’ అంటారా... కానీ రెండు చేతులూ లేకుండానే ఇవన్నీ చేస్తుంది సారాటాల్బి. ఆమె ఓర్పు, నేర్పు చూసి కోట్లమంది స్ఫూర్తిపొందుతున్నారు...  

సారా చేతుల్లేకుండానే పుట్టింది. మొదట్నుంచీ చదువు మీదకన్నా ఎంతో కష్టమైన చిత్రకళపైన ఇష్టం పెంచుకుందీమె. ఆ ఇష్టంతో పెయింటింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. కాళ్లతోనే బొమ్మలు వేస్తూ తన ప్రతిభను ప్రదర్శిస్తుంటుంది. బెల్జియంకు చెందిన ఈమె అక్కడి బ్రస్సెల్స్‌ అకాడమీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో తన పెయింటింగ్స్‌ ప్రదర్శించి ప్రముఖుల ప్రశంసలనూ అందుకుంది. కాళ్లతో బొమ్మలు వేస్తున్న వీడియోలు తీసి మొదట్లో సామాజిక మాధ్యమాల్లో పంచుకునేది 39 ఏళ్ల సారా. వాటిని చూసిన వాళ్లంతా మెచ్చుకుంటూనే మరిన్ని వీడియోలు చేయమనేవారు. జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కడానికి ఎంత కష్టపడిందో వీడియోల్లో వివరిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచేది.

వివాహమై, ఓ పాపకు తల్లి అయిన తర్వాత సారా తన అభిమానులకు మరింత దగ్గరైంది. కొందరు అభిమానులు కోరికమేరకు దైనందిన జీవితాన్ని వీడియోలుగా తీసి యూట్యూబ్‌లో పెట్టేది. ‘ఇంటి పనులు, పాప పెంపకం, నా చిత్రకళకు సంబంధించిన అంశాల్ని వీడియోలుగా చేసి యూట్యూబ్‌ ద్వారా పంచుకోవడం అలవాటైంది. ఎందుకంటే లక్షలాదిమంది అభిమానులు నన్ను చూసి స్ఫూర్తి పొందుతున్నామని చెప్పేవారు. ఆ మాట వింటుంటే సంతోషంగా ఉంటుంది. చేతుల్లేవనే విషయం నాకు గుర్తుండదు. అవి లేకుండానే నా పనులన్నీ చేసుకోవడమే కాదు, సాధారణ ఇల్లాలిలాగే ఇంటి, వంట పనులన్నీ పూర్తిచేయగలను. పాపకు స్నానం నుంచి దుస్తులను మార్చడం, భోజనం తినిపించడం, బయటకు తీసుకెళ్లడం, తనతో కలిసి ఆడుకోవడం వంటివన్నీ చేస్తుంటా. జీవితం అందమైనదీ, చాలా విలువైనదీ... దీన్ని ఆస్వాదించడానికీ, ఆనందంగా ఉండటానికీ అవయవ లోపమో, మరో సమస్యో ఆటంకం కాదు. తపన ఉంటే ఎవరైనా లక్ష్యం చేరుకోగలరు. పాపతో సమయం గడపడం, ఖాళీ ఉన్నప్పుడల్లా బొమ్మలు వేయడం.. ఇదే నా జీవితం’ అని చెప్పుకొస్తున్న సారా 2016లో ‘మౌత్‌ అండ్‌ ఫుట్‌ పెయింటింగ్‌ ఆర్టిస్ట్స్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ అసోసియేషన్‌’ పురస్కారాన్నీ అందుకుంది. ఈమె యూట్యూబ్‌ ఛానెల్‌కు 2.7 లక్షల మంది చందాదారులన్నారు. కొన్ని వీడియోలకు వీక్షణలు కోట్లలోనే. ఇన్‌స్టాలోనూ 35 వేల మంది ఈమెను అనుసరిస్తున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని