Updated : 15/05/2022 04:07 IST

అలాంటప్పుడు గుండె మెలిపెట్టినట్టుంటుంది!

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమయ్యేనాటికి ‘కీవూ ఇండిపెండెంట్‌’ పత్రిక వయసు కేవలం రెండువారాలు. ప్రాణాలు దక్కితే చాలనుకుని అంతా ఉక్రెయిన్‌ ఖాళీ చేస్తుంటే.. కీవూ విలేకరుల బృందం మాత్రం ఈ రోజుకీ యుద్ధవార్తలని నిరాటంకంగా ప్రపంచానికి అందిస్తూ శభాష్‌ అనిపించుకుంటోంది. ఈ బృందానికి సారథ్యం వహిస్తున్న ఓల్గారుడెంకో తాజాగా టైమ్‌ ముఖ చిత్రమైంది..

గత ఏడాది నవంబర్‌ నెలలో.. ఓ అర్ధరాత్రి పాతికమంది విలేకరుల బృందం ఓ చోట సమావేశమైంది. అందులో ఓల్గా కూడా ఒకరు. వాళ్లంతా కీవూపోస్ట్‌ పత్రిక విలేకరులు. ఉక్రెయిన్‌లో ఉన్న ఏకైక ఇంగ్లిష్‌ పత్రిక అది. విశ్వసనీయ సమాచారం అందిస్తుందన్న మంచి పేరు ఉంది. కానీ కొత్తగా ఆ పత్రికకి యజమాని అయిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కివాన్‌ వార్తల పంథా మార్చాలని విలేకరులకు సలహా ఇచ్చాడు. అది పాటించని వాళ్లందరినీ ఉద్యోగాల నుంచి తొలగించాడు. కానీ అక్కడున్న ప్రతి విలేకరికీ దేశం ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉందో తెలుసు. అందుకే చేతిలో డబ్బు లేకపోయినా... జీతం రాదని తెలిసినా దేశాన్ని యుద్ద పరిణామాల నుంచి కాపాడాలనుకున్నారు. అత్యవసరంగా కీవూ ఇండిపెండెంట్‌ అనే వెబ్‌ పత్రిక ప్రారంభించారు. దాని బాధ్యతలని ఓల్గారుడెంకోకి అప్పగించారు. ఆమెకే ఆ బాధ్యతలు అప్పగించడానికి కారణం ఉంది. ఓల్గా ఉక్రెయిన్‌లో డ్నిప్రో ప్రాంతంలో పుట్టింది. నాలుగేళ్ల వయసులో తండ్రిని పోగొట్టుకుంది. తల్లి అకౌంటెంట్‌. మనుషులని చదవడం అంటే ఓల్గాకి చాలా ఇష్టం. అందుకే జర్నలిజంలో చేరింది. చదువు పూర్తయ్యాక కివూపోస్ట్‌లో లైఫ్‌స్టైల్‌ జర్నలిస్టుగా చేరింది. ఇంగ్లిష్‌లో రాయాలంటే ఓల్గాకి చెమటలు పట్టేవి. అలా భయపడుతూ రాసిన మొదటికాపీని డెస్క్‌ ఇన్‌ఛార్జికి ఇచ్చింది. ‘ఆమె బాగుంది. కానీ చిన్న మార్పు చేస్తా అంటూ.. కంట్రోల్‌ ఎ కొట్టి మొత్తం కాపీని డిలీట్‌ చేయడం నాకింకా గుర్తే. నా ఆసక్తంతా ఉక్రెయిన్‌పై జరుగుతున్న దాడులపైనే ఉండేది. నెమ్మదిగా ఆ వార్తలు రాయడం మొదలుపెట్టాను’ అనే ఓల్గా కీవూ పోస్ట్‌లో డిప్యూటి ఎడిటర్‌ స్థాయికి ఎదిగింది. చికాగో యూనివర్సిటీ నుంచి ఫెలోషిప్‌ అందుకోవడానికి అమెరికా వెళ్లింది. అప్పుడే ఉద్యోగ్యాన్ని కోల్పోయింది. ‘మరో రెండు వారాల్లో యుద్ధం ఉందని మా దగ్గర పక్కా సమాచారం ఉంది. అందుకే కష్టమైనా కొత్త పత్రిక ప్రారంభించాలనుకున్నాం. అప్పటి వరకూ దాచుకున్న డబ్బుని తీసేశాం. బ్యాంకులు పనిచేయకపోయినా.. మా పనికి ఆటంకం కాకూడదని. నెట్‌ సేవలు ఉండకపోవచ్చని అనుమానించి అమెరికా నుంచి పత్రిక రన్‌ అయ్యేట్టు జాగ్రత్తలు తీసుకున్నాం. చనిపోయిన సైనికులు, ప్రజల ఫొటోలు చూసినప్పుడల్లా గుండె మెలిపెట్టినట్టుగా అవుతుంది. అయినా మా పని ఆపలేం కదా! మొదట్లో మా పత్రికని ట్విట్టర్‌లో పదివేలమంది ఫాలో అయ్యేవారు. అది ముప్పై లక్షలమందికి చేరింది. వాళ్లే క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా డబ్బు అందించి మా పత్రిక ఆగిపోకుండా సాయం చేస్తున్నారు’ అంటోంది ఓల్గా. ఆమె కృషిని గుర్తించిన టైమ్‌ భవిష్యత్‌ తరాలని ముందుకు నడిపించే నాయకురాలిగా ప్రశంసిస్తూ ఆమెని ముఖచిత్రంగా వేసింది. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని