రక్తం ఇమ్మంటే.. పొమ్మనేవాళ్లు!

పెళ్లైన ఏడాదికే బాబు.. కానీ, మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే పిడుగులాంటి వార్త.. ‘బాబుకి తలసీమియా.. అయిదేళ్లకు మించి బతకడ’న్నారు. ఒక్కసారిగా కాళ్ల కింద భూమిని లాగేసినట్లు అనిపించిందామెకు. ఆ షాకు నుంచి తేరుకున్నాక, తన ఆయుష్షు పోసైనా పిల్లాణ్ని బతికించాలనుకుంది. అందుకోసం ఆమె ఎక్కని గడపలేదు, తిరగని ఆసుపత్రి లేదు. ఇప్పుడు తన బిడ్డలేకపోయినా, అలాంటి పిల్లలెందరికో ఊపిరినందిస్తున్నారు కొత్తపల్లి రత్నావళి. వసుంధరతో ఆ ప్రయాణాన్ని...

Updated : 17 May 2022 03:37 IST

పెళ్లైన ఏడాదికే బాబు.. కానీ, మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే పిడుగులాంటి వార్త.. ‘బాబుకి తలసీమియా.. అయిదేళ్లకు మించి బతకడ’న్నారు. ఒక్కసారిగా కాళ్ల కింద భూమిని లాగేసినట్లు అనిపించిందామెకు. ఆ షాకు నుంచి తేరుకున్నాక, తన ఆయుష్షు పోసైనా పిల్లాణ్ని బతికించాలనుకుంది. అందుకోసం ఆమె ఎక్కని గడపలేదు, తిరగని ఆసుపత్రి లేదు. ఇప్పుడు తన బిడ్డలేకపోయినా, అలాంటి పిల్లలెందరికో ఊపిరినందిస్తున్నారు కొత్తపల్లి రత్నావళి. వసుంధరతో ఆ ప్రయాణాన్ని పంచుకున్నారిలా...

పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఇంటర్‌ అవ్వగానే పెళ్లి చేశారు. మావారు హనుమంత కుమార్‌. ఏలూరులో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. పెళ్లైన ఏడాదికే రోహిత్‌ పుట్టాడు. వాడిని చూస్తూ మేమెంత మురిసిపోయేవాళ్లమో. కానీ, ఆ ఆనందం నాలుగు నెలలకే ఆవిరైపోయింది. తర్వాత తరచూ జ్వరం, విరేచనాలతో నీరసపడేవాడు. ‘చిన్నపుడే తల్లి అయితే పిల్లల పెంపకం ఏం తెలుస్తుంది’ అని బంధువుల సూటిపోటి మాటలు. హైదరాబాద్‌ తీసుకొచ్చి పిల్లల ఆసుపత్రిలో చూపిస్తే, తక్షణమే రక్తం ఎక్కించాలన్నారు. అంతేకదా, అనుకున్నా. తర్వాత ‘మీవాడికి తలసీమియా. అయిదేళ్లకు మించి బతకడు, ఉన్నన్నాళ్లూ ఆనందంగా ఉంచండి’ అని డాక్టర్లు చెబుతుంటే మెదడంతా మొద్దుబారిపోయింది.  బాబు కోసం హైదరాబాద్‌లో ఉండటమే మంచిదనుకున్నాం. మావారు ఇక్కడ మరో ప్రభుత్వ ఉద్యోగం చూసుకున్నారు.

ఈ వ్యాధి ఉన్నవారికి 2-3 వారాలకొకసారైనా రక్తం ఎక్కించాలి. రెండు సార్లు మా బంధువులిచ్చారు. ఆ తర్వాత కష్టాలు మొదలయ్యాయి. ఇది 33 ఏళ్ల కిందట సంగతి. అప్పట్లో ఈ వ్యాధిపైనే కాదు, రక్తదానంపైనా పెద్దగా అవగాహన లేదు. రోజంతా ఇల్లిల్లూ తిరుగుతూ రక్తదానం చేయమని అభ్యర్థించేదాన్ని. కొందరు ముఖంపైనే తలుపులేసేవారు. ఇంకొందరు గేటు దాటి లోపలికే రానిచ్చేవాళ్లు కాదు. నీళ్లు నిండిన కళ్లతో ఇంటి దారి పట్టేదాన్ని. అయినా తల్లి మనసు ఆగేది కాదు. మర్నాడు మరో కొత్తచోటుకి వెళ్లి ప్రయత్నించేదాన్ని. నూటికి ఒక్కరు దొరకడమూ కష్టమయ్యేది. నిమ్స్‌లో తలసీమియాతో బాధపడుతోన్న అయిదేళ్ల చిన్నారిని చూశా. సంతోషంగా ఆడుకుంటుంటే.. మా వాడికీ ఏం కాదనుకున్నా. కొద్ది రోజులకు ఆ చిన్నారి చనిపోయాడని తెలిసి భయం ఇంకా పెరిగింది.

వాడికోసమే రెండో బాబు..

ఈ ప్రయాణంలో సమస్యతోపాటు అవగాహన లేమి కూడా ఎక్కువగా ఉందని అర్థమైంది. అందుకే రక్తదానం, తలసీమియా గురించి అవగాహన కలిగించాలనుకున్నా. 1991లో హెమటాలజిస్ట్‌ డాక్టర్‌ ఏఎన్‌ కృష్ణకుమారితో పరిచయమైంది. ఆవిడ సూచన మేరకు ముంబయి, దిల్లీ నగరాల్లో ఈ వ్యాధిపైన పనిచేస్తున్న సంస్థల గురించి తెలుసుకోవడానికి వెళ్లేదాన్ని. రోహిత్‌కి పూర్తిగా నయం కావాలంటే బోన్‌ మేరో మార్పిడి చేయాలన్నారు. నాది, మా వారిది ప్రయత్నిస్తే 50 శాతమే మ్యాచ్‌ కలిసింది. తోబుట్టువు ఉంటే వీలవుతుందంటే 1995లో రెండో బిడ్డను కన్నాం. వీడి నుంచి మార్పిడి చికిత్సకు ప్రయత్నిస్తే 75 శాతమే మ్యాచ్‌ అవుతోందనడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. ఎప్పట్లానే రక్తం ఎక్కిస్తూ బతికించుకోవడం ఒక్కటే మార్గమైంది.

అతిపెద్ద సంస్థగా..

1998లో నాలాంటి మరో 20 మంది సహకారంతో హైదరాబాద్‌లో ‘తలసీమియా అండ్‌ సికిల్‌ సెల్‌ సొసైటీ’ స్థాపించి, వీరికోసం ప్రత్యేకంగా రక్తమార్పిడి యూనిట్‌ను ప్రారంభించాం. బాధితులకు ఉచిత రక్త దానం, రక్త పరీక్షలతోపాటు బస, ఆహారం వంటి సౌకర్యాలను కల్పించాం. వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలిగించడంలో రోహిత్‌ కూడా నాతో కలిసి పనిచేసేవాడు. అది 2009.. అప్పటికి రోహిత్‌కు 21 ఏళ్లు. ఎప్పటిలాగే ఓసారి రక్తం ఎక్కించాం. రెండు రోజులకే రియాక్షన్‌ వచ్చింది. సమస్యని గుర్తించడానికి కల్చర్‌ టెస్ట్‌ చేస్తారు. అప్పట్లో ఈ శాంపిల్‌ను ముంబయి పంపిస్తే, దానికి తగిన మందులు రావడానికి వారం పట్టేది. అప్పటికే సమయం మించిపోవడంతో బాబు చనిపోయాడు. ఆ బాధని గుండెల్లో దాచుకుంటూనే, సేవల్ని కొనసాగించా. సొసైటీ తరఫున సొంత బ్లడ్‌ బ్యాంకును 2010లో ప్రారంభించాం. ఈమధ్య ఖమ్మంలో కొత్త శాఖని తెరిచాం. ఇప్పటివరకు 3,300 మంది తలసీమియా బాధితులు మా సేవల్ని అందుకున్నారు. ఇప్పటికీ ప్రతి నెలా దేశం నలుమూలలనుంచీ 1800 మంది బాధితులు రక్త మార్పిడికీ, 500 మంది పరీక్షల కోసం వస్తారు. వీరికి సేవలు అందించడానికి 70 మంది సిబ్బంది ఉన్నారు. నెలకు రూ.20 లక్షలు ఖర్చవుతుంది. దాతల సహకారంతోనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ప్రపంచంలో తలసీమియా బాధితుల కోసం ఈ స్థాయిలో పనిచేస్తున్న సంస్థ మరోటి లేదు. గర్భిణులకు తొలి త్రైమాసికంలో హెచ్‌బీఏ2 పరీక్ష తప్పనిసరి చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు విన్నవిస్తున్నాం. దీనివల్ల తలసీమియాని ప్రాథమిక దశలోనే గుర్తించి చర్యలు చేపట్టొచ్చు. పాఠ్య పుస్తకాల్లో దీన్ని పెట్టించాం. తలసీమియా గురించి మరింత అవగాహన తెచ్చి తల్లుల గర్భశోకం పోగొట్టాలన్నదే నా ధ్యేయం.

-గరిడేపల్లి ప్రసాదరావు, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్