Published : 23/05/2022 01:53 IST

ఈ లడ్డూ గర్భిణుల ప్రత్యేకం...

తను, తనవాళ్లు మాత్రమే కాదు.. చుట్టుపక్కల అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకుందామె. అందుకోసం చేసిన లడ్డూలు తనకో గుర్తింపునిచ్చాయి. దాన్నే మరింత పెద్ద స్థాయిలో చేసి తనతోపాటు కొడుకునూ వ్యాపారవేత్తగా మార్చింది అల్పన.  అనారోగ్య సమస్యలకు ఈ లడ్డు చిటికెలో పరిష్కారాన్నిస్తుందనే అల్పన విజయం వెనుక కథేంటో తెలుసుకుందాం.  

తండ్రికి ఆయుర్వేదం బాగా తెలియడంతో అల్పనకు చిన్నప్పటి నుంచి ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెరిగింది. రాజస్థాన్‌కు చెందిన ఈమె పెళ్లైన తర్వాత జైపూర్‌లోని అత్తింట అడుగుపెట్టింది. అక్కడికొచ్చిన తర్వాత తన ఆరోగ్యంతోపాటు ఇంటిల్లపాది ఆహారపుటలవాట్లను ఆరోగ్యంగా మార్చగలిగింది. బంధువులు, ఇరుగుపొరుగువాళ్లకు చిన్నచిన్న అనారోగ్యాలకు తెలిసిన చిట్కాలను చెప్పేది. గర్భిణులు, ప్రసవించిన తల్లులు తీసుకోవాల్సిన పోషకాహారంపై అవగాహన కలిగించేది. వారి సమస్యలు విన్నప్పుడు పరిష్కారంగా పోషకవిలువలన్నీ ఉండేలా ఓ లడ్డూ తయారుచేసిచ్చేది. గర్భవతులకు కావాల్సిన విటమిన్లు, ఖనిజ లవణాలన్నీ ఉండేలా తాను చేసిన లడ్డూను చుట్టుపక్కలవాళ్లకు ఉచితంగా అందించేది. వారిలో కలిగే ఆరోగ్యకరమైన మార్పు ఆమెను అందరిలోనూ ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టింది. ఆ తయారీనే కెరియర్‌గా మార్చుకోవాలనే ఆలోచన రావడంతో లడ్డూలను పెద్ద సంఖ్యలో తయారుచేసి గర్భిణులకు అందించడం మొదలుపెట్టింది.

రూ.20వేలు పెట్టుబడితో..

సాఫ్ట్‌వేర్‌గా పనిచేసే అల్పన కుమారుడు విరాళ్‌ ఉద్యోగం మానేసి వేరే సంస్థకు వెళ్లడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అప్పుడే తనతో ఈ లడ్డూల విషయాన్ని చెప్పింది. ‘మావారు, అబ్బాయి ఉద్యోగానికి వెళ్లిన తర్వాత ఇవి చేసేదాన్ని. వాళ్లకు తెలిస్తే విమర్శిస్తారనుకునేదాన్ని. ఒక రోజు మా అబ్బాయితో మార్కెట్‌లో ఈ తరహా ఆహారం లభ్యమవుతోందా లేదా అనేది పరిశీలించమని అడిగా. నేను చేస్తున్న లడ్డూల గురించి చెప్పా. ఆసక్తి ఉంటే నాతో కలిసి పనిచేస్తే పెద్ద ఎత్తున వ్యాపారంగా మలచవచ్చు అని అన్నాను. మొదట ఒప్పుకోలేదు. అయితే అప్పటికే కొందరు వినియోగదారుల నుంచి వీటి కోసం ఆర్డర్లు రావడం గుర్తించాడు. మార్కెట్‌లోకి తీసుకెళ్లగలిగితే దీన్ని అభివృద్ధి చేయొచ్చు అంటూ నాతో చేయి కలిపాడు. అలా రూ.20వేలు పెట్టుబడితో 2019లో ‘నుక్షా కిచెన్‌’ ప్రారంభించాం. ఆర్డర్లు ఇచ్చేవారితో మాట్లాడుతూనే వారి ఆరోగ్య వివరాలు, ఇంటి సభ్యుల సమస్యలు అడిగి తెలుసుకొని దానికి తగినట్లుగా లడ్డూలు తయారుచేసి ఇచ్చేదాన్ని. అది వారి అనారోగ్యానికి పరిష్కారాన్నిచ్చేది. నావద్దకు వచ్చేవారిలో ఎక్కువగా గర్భిణులు, ప్రసవించిన తల్లులే ఉంటారు. ఓట్స్‌, కొబ్బరి, రాగి, గోధుమరవ్వ, మెంతులు, మిల్లెట్స్‌, శనగపిండి, గోండ్‌, ఎండు ఫలాలు, పసుపు, ఆవాలు, నెయ్యి వంటివన్నీ వినియోగించి చేసే  లడ్డూలతోపాటు శతావరి పొడి వంటివి ఎక్కువగా అమ్ముడుపోతాయి. బాలింతలకి మావద్ద ప్రత్యేకంగా ప్యాకేజీ ఉంది. పూర్తిగా ఆయుర్వేదానికి అనుసంధానంగా తయారుచేసే వీటికి వాము, సోంపు లడ్డూ వంటివీ ఉంటాయి. ఇది వారికి కావాల్సిన పోషకాలను అందించి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మొదట్లో 100మంది ఉండగా, ఈ మూడేళ్లలో నుక్షా కిచెన్‌ నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేసేవారి సంఖ్య నెలకు 1000మందికి పెరిగింది. త్వరలో మా టర్నోవరు రూ.కోటికిపైగా అవుతుందని అనుకుంటున్నా’ అని చెబుతున్న అల్పన ఇప్పుడు మరిన్ని రకాల ఉత్పత్తుల తయారీకి సిద్ధపడుతోంది. పలు ప్రదర్శనలు, రైతు బజారుల్లో వీటిని ప్రదర్శించి అందరికీ అవగాహన కలిగిస్తోందీమె. రాష్ట్రేతర ప్రాంతాలకు మాత్రమే కాకుండా ఆన్‌లైన్‌ద్వారా అమెరికా, లండన్‌ వంటి దేశాలకూ ఎగుమతి చేస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని