Updated : 23/05/2022 04:37 IST

అత్త మరణం నన్ను మార్చేసింది!

నిరాశ్రయులైన వృద్ధులు కనిపించగానే ఒక క్షణం ‘అయ్యో పాపం’ అనుకుంటాం. మరుక్షణం ముందుకు పోతాం. కానీ ఆమె అలా కాదు.. ఎంత ముఖ్యమైన పనిమీద వెళ్తున్నా అక్కడ ఆగిపోతారు. వాళ్లని తనతోపాటు తీసుకువెళ్లి ఆశ్రయం కల్పిస్తారు. అమ్మలా సపర్యలూ చేస్తారు. ఆ అనాథల కోసమే భర్తకు దూరమయ్యారు, ఉద్యోగానికీ రాజీనామా చేశారు. అంతేకాదు, తన సంపదనంతా ఖర్చుచేశారు నాగ చంద్రికాదేవి. ‘ఇంతమంది అమ్మలచేత ‘అమ్మా’ అని పిలుపించుకోవడం కంటే అవేవీ ముఖ్యం కాదు’అంటున్న చంద్రిక సేవా ప్రస్థానమిది...

నాగ చంద్రిక సొంతూరు కడప జిల్లా ఎర్రగుంట్ల. నలుగురు తోబుట్టువుల్లో ఒక్కరే అమ్మాయి. మేనత్త ఈమెను దత్తత తీసుకున్నారు. పదో తరగతి పూర్తికాగానే పెళ్లి కావడంతో హైదరాబాద్‌ వచ్చారామె. తర్వాత ఇంటర్‌ పూర్తిచేసి విద్యుత్‌ శాఖలో క్లర్క్‌గా చేరారు. తనని పెంచి పెద్దచేసిన మేనత్త ఉపాధ్యాయురాలు. రిటైర్మెంట్‌ తర్వాత ఆవిడ ఆరోగ్యం బాగా లేకపోవడంతో తన దగ్గరకే తెచ్చుకున్నారు చంద్రిక. ఇంటికే వైద్యుల్ని పిలిపించి చికిత్స అందించేవారు. కానీ సమస్య తీవ్రమవడంతో వైద్యులు అందుబాటులో ఉన్న ఓ వృద్ధాశ్రమంలో చేర్పించారు. అక్కడ మూడు రోజులకే చనిపోయారామె. ‘నా దగ్గరుంటే మరికొన్నాళ్లైనా బతికేదిగా’ అన్న భావన చంద్రికను వెంటాడేది.

ఆమెను మర్చిపోలేక..

నిరాశ్రయులైన వృద్ధుల్ని చూడగానే ఆమెకు తన మేనత్తే గుర్తొచ్చేది. 2002లో ఒకసారి ఆఫీసుకు వెళ్లే దారిలో ఫుట్‌పాత్‌మీద ఓ వృద్ధురాలు ఎలాంటి ఆచ్చాదన లేకుండా కనిపిస్తే ఇంటికి తీసుకొచ్చి మామూలు మనిషిని చేశారు. ఏడాదిలో అలాంటి మరో నలుగుర్నీ చేరదీశారు. ఉదయాన్నే లేచి వారందరికీ సేవలు చేయడం, పిల్లల ఆలనాపాలనా చూడడం, ఉద్యోగానికి వెళ్లడం.. సాయంత్రం ఇంటికి రాగానే మళ్లీ వారి సేవల్లో మునిగిపోవడం చంద్రికకు దినచర్యగా మారింది. ఈ క్రమంలో ఆమె వైవాహిక జీవితమూ బీటలు వారింది. ఆమె మాత్రం ‘నేను కాకపోతే వాళ్లని ఇంకెవరు చూస్తారు’ అని అనుకున్నారు. పిల్లల బాగోగులు చూసుకుంటూనే.. మరింత మందికి తోడ్పడాలన్న ఉద్దేశంతో తన ఇంటి పేరుతో ‘కిన్నెర వెల్ఫేర్‌ సొసైటీ’ని 2003లో ప్రారంభించారు. ఆశ్రయం పొందేవాళ్లు పెరగడంతో విజయ్‌నగర్‌ కాలనీలో ఉంటోన్న ఇల్లు సరిపోక మెహిదీపట్నంలో అద్దె ఇంటికి మార్చారు. నెలకు రూ.30 వేల అద్దె చెల్లించేవారు. ఈ ఇంట్లో 30 మంది వృద్ధులు ఆశ్రయం పొందేవారు. చంద్రిక సేవల్ని గుర్తించి యూరోప్లెక్స్‌ సంస్థ 18 ఏళ్లుగా భవనం అద్దె చెల్లిస్తోంది. ఆహారం, వైద్యం, ఇతర వసతుల కల్పనలో దాతల సహకారం అందినా అందకపోయినా సేవలు కొనసాగిస్తూ వచ్చారు చంద్రిక. వీటికోసం తనకు పుట్టింటివారు ఇచ్చిన 200 తులాల బంగారంలో మూడొంతులు అమ్మేశారు. తల్లి అనారోగ్యంతో బాధపడుతుంటే దాదాపు 20 ఏళ్లు తన దగ్గరే ఉంచి ఆమెను చూసుకున్నారు.

శాశ్వత భవనం.. నిర్మాణంలో!

సేవకోసం ఉద్యోగం నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. చంద్రిక సేవల గురించి తెలుసుకున్న చిన జీయర్‌స్వామి ఆశ్రమానికి భవనం కట్టడంలో సాయపడతామన్నారు. ఆయన సూచనతో మైహోమ్‌ సంస్థ ముచ్చింతల్‌లో అర ఎకరం స్థలం కిన్నెర సొసైటీకి ఇచ్చింది. ఈ మధ్యనే భవన నిర్మాణ పనులు మొదలయ్యాయి. కరోనాతో చనిపోయిన వారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలని స్వామి సంకల్పించి ఆ బాధ్యతల్ని చంద్రికకు అప్పగించారు. వృద్ధుల కోసం ‘ప్రేమ నిలయం’, మానసికంగా బాధపడుతున్నవారికి ‘మనోదీపం’... పేరుతో సేవలు అందిస్తున్నారు. అనాథ వృద్ధుల్ని ఉచితంగా చేరదీస్తారు. నిస్సహాయ స్థితిలో ఎవరైనా తమ తల్లిదండ్రుల్ని ఇక్కడ చేర్చితే వారి నుంచి నామమాత్రంగా కొంత మొత్తం తీసుకుంటారు. సంస్థ నిర్వహణకు ఏటా రూ.30లక్షలకుపైనే ఖర్చవుతోంది. ఎప్పుడైనా ప్రభుత్వ సాయం అందుతున్నా, ఎక్కువగా దాతల సాయంతోనే నడిపిస్తున్నారు. చంద్రిక సేవల్ని మెచ్చి 2007లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 2011లో కేంద్ర ప్రభుత్వం ‘వయో శ్రేష్ఠ’ అవార్డుని అందించాయి. తెలంగాణ ఏర్పడ్డాక మరో రెండు సార్లు ఈ అవార్డుని స్వీకరించారామె. అమ్మాయికి పెళ్లి కాగా, అబ్బాయి బీబీఏ చేసి ప్రస్తుతం ఫౌండేషన్‌ పనుల్లో తల్లికి సాయపడుతున్నాడు. ఇప్పటివరకూ ఆశ్రమంలో దాదాపు 800 మంది ఆశ్రయం పొందారు. శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగైన వాళ్లని వీలైతే వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. కానీ చాలామంది ఇక్కడే కాలధర్మం చేశారు. దాదాపు 600 మందికి అంతిమ సంస్కారాల్ని చంద్రికనే నిర్వహించారు. ప్రస్తుతం 30 మంది ఇక్కడ ఉంటుండగా వీరిలో 16 మంది మానసిక సమస్యలతో బాధపడుతుంటే, నలుగురు పూర్తిగా మంచానికి పరిమితమైనవాళ్లే. ‘ఇక్కడున్న వాళ్లలో చాలామందిది మా అమ్మ వయసు, నా వయసు. కానీ వాళ్లంతా ప్రేమగా ‘అమ్మా’ అని పిలుస్తుంటే, ఎంతో సంతోషంగా ఉంటుంది. వారికోసం పడ్డ శ్రమంతా మర్చిపోయేలా చేస్తుంది’ అని చెబుతారు చంద్రిక.

- భూపతి బాల రాజేశ్వర్‌రావు, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని