Published : 01/06/2022 01:11 IST

104 రోజులు... 104 మారథాన్‌లు!

క్యాన్సర్‌ కారణంగా ఆమె ఎడమ కాల్లో తొడ నుంచి కిందిభాగం తొలగించాల్సి వచ్చింది. అలాగని కుంగుబాటుకు గురి కాలేదామె. కాలికి బ్లేడ్‌ ధరించి, మారథాన్‌ పరుగుకు సిద్ధమైంది. రన్నర్‌గా ప్రపంచరికార్డును సాధించి.. లక్ష్యానికి వైకల్యం అడ్డుకాదని నిరూపించింది. 104 రోజుల్లో 104 మారథాన్లలో పరిగెత్తి తాజాగా గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకుంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఆ బ్లేడ్‌ రన్నర్‌... జాకీ హంట్‌-బ్రోఎరస్మా. మరిన్ని రికార్డులు సాధిస్తానంటోన్న 46 ఏళ్ల జాకీ స్ఫూర్తిగాథ ఇది.

జాకీ అందరిలాగే చదువుకొని, ఉద్యోగంలో చేరింది. మారథాన్‌లంటే ఆసక్తితో ఏటా ఉత్సాహంగా పాల్గొనేది. ఆనందంగా, ఆహ్లాదంగా సాగిపోతోన్న ఆమె జీవితంలో ఓ కుదుపు.  24వ ఏట ఎడమకాలి ఎముకలో క్యాన్సర్‌ని గుర్తించారు. తొడ నుంచి కింది భాగాన్ని తొలగించకపోతే ప్రాణాంతకమన్నారు వైద్యులు. దాంతో ఆమె కూడా అందుకు మానసికంగా సిద్ధమైంది. ఆ తర్వాత కూడా ఆమె ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. నిత్యం వ్యాయామం చేసే అలవాటే ఆమె తిరిగి నడవడానికి కారణమైంది. తనను తాను ప్రోత్సహించుకుంటూ కుంగుబాటుకు గురి కాకుండా గాయం నుంచి బయటపడింది. కొన్నాళ్ల తర్వాత కాలికి బ్లేడు ధరించి నడవడం సాధన చేసింది. మనసుకు నచ్చిన వాడిని మనువాడింది. ఇద్దరు పిల్లలకు తల్లైంది.  ఆ పరిస్థితుల్లోనూ మారథాన్లలో పాల్గొనాలనే ఆసక్తి ఆమెను అటువైపు ఏదో ఒకటి చేయాలనిపించేలా పురిగొల్పింది. కాలు భాగం తొలగించిన 14 ఏళ్ల తర్వాత 2016లో రన్నింగ్‌ మళ్లీ మొదలుపెట్టింది. ఆపైన మారథాన్‌లో పాల్గొనడానికి సిద్ధపడింది. మారథాన్‌ అంటే ఏకబిగిన 42 కి.మీ. పరుగు పెట్టాలి. అందుకు పరుగుతోపాటు అనేక వ్యాయామాలూ, ఆహార నియమాలూ అవసరం. అన్ని అవయవాలూ సవ్యంగా ఉన్నవాళ్లకే అది కష్టం. అందుకే జాకీ తన మనసులో మాట చెప్పగానే ఇది సాధ్యమేనా అన్నారంతా. అయినా తను మాత్రం పట్టుదలగా సాధన ప్రారంభించింది. తన లక్ష్యం, సాధన గురించి తరచూ సామాజిక మాధ్యమాల్లో పంచుకునేది. ఎప్పటికైనా ప్రపంచ రికార్డు సాధించాలనే ఆమె పట్టుదలకు అందరూ ప్రశంసలు అందిస్తూ ప్రోత్సహించేవారు. ‘వారంతా అందించిన ధైర్యం, ప్రోత్సాహమే ఈ రోజు గిన్నిస్‌ రికార్డు దక్కించుకునేలా చేసింది’ అంటుంది జాకీ. ‘నాపై నాకు నమ్మకం కలిగించింది స్నేహితులే. నేను ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేలా చేశారు. నన్ను నేను నిరూపించుకోవడానికి తగిన శక్తినందించారు. 104 మారథాన్‌లు చేసే ఛాలెంజ్‌లో పాల్గొనే అవకాశాన్ని అందుకొన్నా. సాధన చేసేటప్పుడు తొడ దగ్గర భరించలేని నొప్పి. బ్లేడ్‌ అమర్చుకున్న సాకెట్‌ నుంచి మోకాలి వద్ద ఎముకలు జారిపోతున్నాయేమో అనిపించేది. శరీరం బరువెక్కువగా పడే కుడికాలు తరచూ అలసిపోయేది. కండరాలు పట్టేసేవి. మారథాన్‌ సమయంలో కండరాలు తిరిగి కోలుకోవడానికి 2-3 గంటలు విరామం తీసుకొని, బ్లేడు తొలగించి కుడికాలికి మసాజ్‌ చేసుకునేదాన్ని. ఆ సమయంలో కంటినిండా నిద్ర ఉండేది కాదు. ఇవన్నీ ఫిట్‌నెస్‌మీద ప్రభావాన్ని చూపించేవి’ అని చెబుతుంది జాకీ.

కాలు తొలగించిన తర్వాత ఆ సమస్య ఉందన్న భావననే మనసులోకి రానిచ్చేది కాదు జాకీ. మానసికంగా ఉత్సాహంగా ఉంటూ, రన్నింగ్‌ బ్లేడ్‌ అమర్చుకొని పరుగు సాధన చేసేది. కొత్తలో ఎన్నోసార్లు కింద పడిపోతుండేది. అయినా సరే గిన్నిస్‌ రికార్డు కోసం ఏళ్ల తరబడి కఠోర సాధన చేసింది. ఒక్కో మారథాన్‌కి అయిదేసి గంటలు పడుతుంది. అలాంటిది 104 రోజుల్లో 104 మారథాన్‌లు చేసి ప్రపంచ రికార్డు సాధించి, తానేంటో నిరూపించింది. పరిధుల్ని విస్తరించుకుంటూ పోవడమే జీవిత లక్ష్యమని చెప్పే జాకీ మరోవైపు పిల్లల సంరక్షణ బాధ్యతా తీసుకుంటుది. వాళ్లను స్కూల్‌కు పంపడం నుంచి హోమ్‌వర్క్‌, వంట వరకు అన్నీ తానే చేసుకుంటుంది. తన పిల్లలకు తానే స్ఫూర్తిగా నిలవాలనుకునే జాకీ వాళ్లకే కాదు, మహిళలందరికీ స్ఫూర్తిదాయకమే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని