Updated : 02/06/2022 07:01 IST

తెనాలి నుంచి క్యాన్సర్‌ని తరిమేయాలని...

మనదేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకీ ఒకరు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో చనిపోతున్నారని గణంకాలు చెబుతున్నాయి. వీటిలో 90 శాతం నివారించదగ్గవే. అందుకే ‘చికిత్సకంటే నివారణ మేలు’ అని నినదిస్తున్నారు తెనాలికి చెందిన డాక్టర్‌ శారద. అనడమే కాదు, ‘క్యాన్సర్‌ ఫ్రీ తెనాలి’ పేరుతో ఒక ఉద్యమాన్నే నడుపుతున్నారావిడ. దేశానికి ఒక నమూనాగా చూపాలనుకుంటున్న ఆ కార్యక్రమం గురించి ఆమె ఏం చెబుతున్నారంటే..

చికిత్సకంటే నివారణ మేలని వైద్యశాస్త్రమూ చెబుతోంది. కానీ మన దేశంలో చికిత్స మీద చూపేంత శ్రద్ధ నివారణ మీద పెట్టరు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు 35 ఏళ్లుగా ‘ప్రజల దగ్గరకే వైద్య సేవలు’ విధానాన్ని అనుసరిస్తున్నా. కొన్ని గ్రామాలను ఎంపికచేసుకుని వ్యాధులపట్ల అవగాహన, వ్యాధుల నిర్ధరణ కోసం వైద్య శిబిరాలూ నిర్వహిస్తూ వచ్చాం. ఇటీవల మహిళల్లో క్యాన్సర్‌ మరణాలు ఎక్కువ కావడంతో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టా. 

మాది పెదనందిపాడు దగ్గర పాలపర్తి. తాతయ్య దుడ్డెంపూడి రామన్న. పాలపర్తిలో 70 ఎకరాల స్థలం ఇచ్చి చెరువు తవ్వించారు. నాయనమ్మ సౌభాగ్య, నాన్న సీతారామయ్య, అమ్మ సులోచన కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రాంతంలో మహిళలకు సరైన వైద్య సదుపాయాలు లేని లోటు తీర్చాలని నన్ను మెడిసిన్‌ చదివించారు నాన్న. గుంటూరు మెడికల్‌ కాలేజీ నుంచి మెడిసిన్‌, ఆపైన గైనకాలజీలో డిప్లొమా చేసి, తెనాలిలోనే గైనకాలజిస్టుగా పనిచేస్తున్నా. మిగతా రోగాలు వేరు క్యాన్సర్‌ వేరు. ఇది కుటుంబాల్ని ఆర్థికంగా కుంగదీస్తుంది. అది మహిళకు వస్తే ఆ నష్టం కుటుంబంలో అందరి మీదా పడుతుంది. మహిళల్లో క్యాన్సర్‌లు ఎక్కువ. మొదట్లో బాధితుల్ని గుర్తిస్తే చెన్నైలోని అడయార్‌ ఆసుపత్రికి పంపేదాన్ని. ఏటా పది కేసులైనా కనిపించేవి. దీనిపైన మహిళల్లో అవగాహన పెంచాలని 2009లోనే బలంగా నిర్ణయించుకున్నా. ఆ ఏడాది తెనాలిలో భారీ క్యాన్సర్‌ అవగాహన ర్యాలీ నిర్వహించా. అప్పట్నుంచీ సత్యసాయి, లయన్స్‌, వర్కర్స్‌ క్లబ్‌ల సాయంతో తెనాలి, చుట్టుపక్కల గ్రామాల్లో క్యాన్సర్‌ అవగాహన సదుస్సులు నిర్వహిస్తూనే అవసరమైన వారికి పరీక్షలూ చేసేవాళ్లం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ని నివారించే వ్యాక్సిన్‌ గురించి ప్రచారం చేశాం. నా రిటైర్మెంట్‌కు ముందే ఇంకా మెరుగ్గా ఏదైనా చేయాలన్న ఆలోచనలోంచి పుట్టిందే ‘క్యాన్సర్‌ ఫ్రీ తెనాలి’. ఈ ఏడాది ఏప్రిల్‌లో దీన్ని మొదలుపెట్టాం. ప్రభుత్వ యంత్రాంగం కూడా భాగం కావాలని సబ్‌ కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడితే అంగీకరించారు. దీన్లో భాగంగా మహిళల్లో వచ్చే రొమ్ము, అండాశయ, గర్భాశయ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లకు... పరీక్షలు చేసి ప్రాథమిక దశలోనే గుర్తించి నివారణ, చికిత్స అందించాలనేది మా ప్రయత్నం. దీనికోసం 30-65 ఏళ్ల మధ్య వివాహిత మహిళల్ని ఎంచుకుంటున్నాం. తెనాలిలో 40 వార్డుల్లో ఈ వయో విభాగంలో 30 వేల మంది ఉంటారు. వారందరికీ ఈ పరీక్షలు చేయించాలనేది లక్ష్యం. 

ఏడాది చివరకల్లా పూర్తి..

ఒక్కో వార్డుకు వెళ్లి... రోజుకు 30 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేసి అనుమానం ఉంటే నమూనాల్ని సేకరించి నిర్థరణకు పంపుతున్నాం. వందలో అయిదారుగురు అనుమానితులుంటున్నారు. స్క్రీనింగ్‌, పాప్‌స్మియర్‌ పరీక్షలకు చాలా ఖర్చవుతుంది. నా సంపాదనలో కొంత భాగం, మావారు సత్యనారాయణ, కుటుంబ సభ్యుల చేయూతతో ఇప్పటివరకూ కార్యక్రమాల్ని చేస్తూ వచ్చా. ఇప్పుడు పెద్ద మొత్తంలో నిధులు అవసరం. సాయం కోసం ప్రయత్నించినపుడు గుంటూరు ఎన్‌.ఆర్‌.ఐ. మెడికల్‌ కాలేజీ యాజమాన్యం 20 వేల నమూనాల్ని ఉచితంగా పరీక్షించేందుకు అంగీకరించింది. ఇప్పటివరకూ 700 మందిని పరీక్షించాం. ఏడాది చివరకల్లా తెనాలి మొత్తంగా పరీక్షలు పూర్తిచేసి అవసరమైన వారికి చికిత్స అందించాలనేది మా లక్ష్యం. ఈ కార్యక్రమం కోసం నా నర్సింగ్‌ హోమ్‌ని ఒక్క పూటకే పరిమితం చేశా. ఈ ప్రయాణంలో మా అమ్మాయి(చెన్నైలో డాక్టర్‌) స్నేహితురాలు డా.ఎల్‌.శిరీష(విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ) సహా చాలామంది వైద్యులూ, వాలంటీర్లూ తోడుగా నిలుస్తున్నారు. క్యాన్సర్‌ రహిత తెనాలిని నిర్మించి దేశానికే ఓ నమూనా చూపాలనేదే నా కోరిక. దీని స్ఫూర్తితో మరిన్ని ప్రాంతాల్లో ఈ సేవలు కొనసాగించగలిగే బృందాల్ని ఏర్పాటు చేయగలిగితే నా ఆశయం నెరవేరినట్లే.

 అత్తోట ఆదర్శంగా..

ఇంటిదగ్గరే వైద్య సేవలద్వారా కలిగే ప్రయోజనాలు తెలియజేయడానికి గతేడాది తెనాలికి సమీపంలోని అత్తోట గ్రామంలో వైద్య పరీక్షలు చేశాం. 30 ఏళ్లు దాటిన 1500 మందికి బీపీ, మధుమేహం, థైరాయిడ్‌ లాంటి పరీక్షలు చేయగా 432 మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించాం. ఆ కార్యక్రమంలో మా తమ్ముడు శ్రీనివాస్‌, కొందరు వైద్యులూ చురుకైన ప్రాత పోషించారు. ఎనిమిది మంది మహిళల కడుపులో గడ్డలున్నట్టు గుర్తించి, నలుగురికి శస్త్రచికిత్సలు చేయించాం. 38 మందికి గుండె సంబంధిత వ్యాధులున్నట్టు తేలింది. వారిలో కొందరికి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో శస్త్రచికిత్సలు చేయించాం. చికిత్సకంటే నివారణ ముఖ్యమనడానికి ఇదో నిదర్శనం.

- దాసరి సుభాష్‌, ఈనాడు జర్నలిజం స్కూల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని