‘యూనికార్న్‌’ అంటే నమ్మలేకపోయా!

మహిళలు సాంకేతిక రంగంలో.. అదే విధంగా ఆర్థిక రంగంలో ఉండటం చూశాం. కానీ ఈ రెండూ కలగలసిన ఫిన్‌టెక్‌ రంగంలో మాత్రం చాలా అరుదు. ఎందుకంటే ఇదెంతో క్లిష్టమైన రంగం. అలాంటి చోట సత్తా చాటుతోంది మేబుల్‌ చాకో. అయిదు ఫిన్‌టెక్‌ కంపెనీలకు ఆమె సహ వ్యవస్థాపకురాలు. అంతేకాదు తను సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న ‘ఓపెన్‌

Published : 03 Jun 2022 00:54 IST

మహిళలు సాంకేతిక రంగంలో.. అదే విధంగా ఆర్థిక రంగంలో ఉండటం చూశాం. కానీ ఈ రెండూ కలగలసిన ఫిన్‌టెక్‌ రంగంలో మాత్రం చాలా అరుదు. ఎందుకంటే ఇదెంతో క్లిష్టమైన రంగం. అలాంటి చోట సత్తా చాటుతోంది మేబుల్‌ చాకో. అయిదు ఫిన్‌టెక్‌ కంపెనీలకు ఆమె సహ వ్యవస్థాపకురాలు. అంతేకాదు తను సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న ‘ఓపెన్‌ ఫైనాన్షియల్‌ టెక్నాలజీస్‌’ ఇటీవల భారత్‌లో వందో యూనికార్న్‌గా అవతరించింది. ఆ ప్రయాణం గురించి ఆమె ఏం చెబుతారంటే...  

నేను పుట్టింది కేరళలో, పెరిగింది బెంగళూరు, అహ్మదాబాద్‌లలో. అమ్మానాన్నా బ్యాంకు ఉద్యోగులు. జర్నలిజం చేయాలనుకునేదాన్ని. కానీ, గుజరాత్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ చేసేటపుడు సీనియర్లు ఓ సంస్థని ప్రారంభిస్తూ నన్నూ చేరమన్నారు. 2006లో అహ్మదాబాద్‌లో మేం ప్రారంభించిన ‘టచ్‌2పే’ దేశంలోనే బయోమెట్రిక్‌ బ్యాంకింగ్‌ సేవలు అందించిన మొదటి సంస్థ. బ్యాంకులు మాతో కలిసి పనిచేసేలా ఒప్పందాలు కుదిర్చేదాన్ని. అయితే, టెక్నాలజీలో మాకు సమస్యలు ఉండేవి. అప్పుడే కొచ్చీలో అనీష్‌ అచ్యుతన్‌ మొబైల్‌ ఆధారంగా కాంటాక్ట్‌లెస్‌ పేమెంట్స్‌ కోసం కృషి చేస్తున్నాడని తెలిసి మాట కలిపి నా అనుభవాల్నీ పంచుకున్నా. తన కంపెనీకి సహ వ్యవస్థాపకురాలిగా ఆహ్వానించాడు. అలా ఇద్దరం బెంగళూరులో ఆఫీస్‌ ప్రారంభించాం.

ఒకటే అకౌంట్‌.. 2007లో ‘క్యాష్‌ నెక్స్ట్‌’ని ప్రారంభించి మొబైల్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవలు అందించాం. దాన్ని లాటిన్‌ అమెరికా సంస్థ కొనుగోలు చేసింది. తర్వాత నియర్టివిటీ, స్విచ్‌ లాంటి ఫిన్‌టెక్‌ కంపెనీల్ని ప్రారంభించాం. స్విచ్‌ని 2015లో సిట్రస్‌ పేమెంట్స్‌ కొనుగోలు చేశాక అందులో మార్కెటింగ్‌ వ్యవహారాలు చూశా. అంకుర సంస్థల వ్యవస్థాపకులూ, చిరు వ్యాపారులతో మాట్లాడేదాన్ని. కంపెనీ ఆర్థిక లావాదేవీలన్నిటినీ ఒకచోట చేర్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెప్పేవారు. దీన్ని పరిష్కరిస్తే బావుంటుందని అనీష్‌తో చెప్పా. అనీష్‌ తమ్ముడు అజీష్‌, ఆర్థిక విషయాల్లో మంచి అనుభవం ఉన్న దీనా జాకబ్‌లతో కలిసి 2017లో ‘ఓపెన్‌’ను ప్రారంభించాం. చెల్లింపులూ, రుణాలూ, వసూళ్లూ... వీటికి వేర్వేరు అకౌంట్‌లు కాకుండా అన్నీ కలిపి బిజినెస్‌ కరెంట్‌ అకౌంట్‌కు అనుసంధానమయ్యే సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేశాం. అకౌంట్‌గానూ, ఖాతా పుస్తకంలానూ ఉంటుందన్నమాట. ఇవన్నీ చూడ్డానికి చిన్న సంస్థలోనైనా ఒకరికి నెల పడుతుంది. ఓపెన్‌తో గంటలో పూర్తవుతుంది.

ఆసియాలోనే మొదటిది.. ఐఐఎఫ్‌ఎల్‌ సహా కొన్ని సంస్థలు ఇటీవల ఓపెన్‌లో రూ.400కోట్లు పెట్టుబడి పెట్టాయి. సంస్థ విలువ బిలియన్‌ డాలర్లు(యూనికార్న్‌)గా నిర్ణయించేసరికి నమ్మలేకపోయా. ఇదంత సులభంగా ఏం జరగలేదు. డబ్బు విషయంలో సులభంగా మనల్ని ఎవరూ నమ్మరు. ఆసియాలో ఇలాంటి సేవలు అందిస్తోన్న మొదటి సంస్థ మాదే. 2000 ఖాతాదారుల్ని సంపాదించడానికి ఏడు నెలలు పట్టింది. కానీ ఇప్పుడు నెలకు వేల మంది కొత్తగా చేరుతున్నారు. 30 లక్షల మంది ఖాతాదారులున్నారు. త్వరలో ఓపెన్‌ని అంతర్జాతీయ మార్కెట్‌లోకీ తీసుకెళ్తాం. ఖాతాదారులకు రుణాలూ ఇస్తాం. రెండు స్టార్టప్‌ల తర్వాత 2011లో అనీష్‌, నేనూ జీవితంలోనూ భాగస్వాములయ్యాం. కంపెనీ వ్యవహారాల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాం. ఒకేచోట పనిచేయడంవల్ల ఒకరి కష్టాలు ఒకరికి సులభంగా అర్థమవుతాయి. కానీ కుటుంబ వేడుకల్ని  మిస్సవుతాం.

ఒక మహిళగా మహిళా ఉద్యోగుల కష్టాలు నాకు తెలుసు. అందుకే పెళ్లి, పిల్లల తర్వాత కెరియర్‌ కొనసాగించడానికి మా కంపెనీలో అన్ని రకాలుగానూ సహకరిస్తాం. డేకేర్‌, కౌన్సెలింగ్‌... ఇలా అన్ని సదుపాయాలూ ఇస్తున్నాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్